జలహోరు

ABN , First Publish Date - 2020-11-28T07:28:35+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయం నుంచి భారీగా వరదను దిగువకు విడుదల చేయడంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది.

జలహోరు
పెన్నా నది ఉగ్రరూపం

పెన్నాకు పోటెత్తిన వరద

నదీ తీరంలో భయం... భయం

పొట్టేపాళెం కలుజు వద్ద వాహన రాకపోకలు బంద్‌ 

నెల్లూరు - తాటిపర్తి రహదారి మూసివేత 

కనుపూరు కాలువలో భారీ ప్రవాహం

సాధ్యపడని గండి పూడ్చివేత

నీట మునిగిన వేలాది ఎకరాలు


నెల్లూరు రూరల్‌, నవంబరు 27 : నివర్‌ తుఫాన్‌ కారణంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయం నుంచి భారీగా వరదను దిగువకు విడుదల చేయడంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నది పరీవాహక ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. నెల్లూరు కాలువ ద్వారా నెల్లూరు చెరువుకు చేరుతున్న భారీ నీటి ప్రవాహంతో పొట్టేపాళెం కలుజు ప్రమాదకరంగా పారుతోంది. దీంతో నెల్లూరు - జొన్నవాడ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. అలాగే ములుముడి కలుజు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ములుముడి - సౌత్‌మోపూరు మధ్యనున్న రహదారి దెబ్బతినడంతో రాకపోకలు సాగడం లేదు. 

నీట మునిగిన పొలాలు 

పెన్నాకు వరద పోటెత్తడంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. సజ్జాపురంలో ఏకంగా 700 ఎకరాల పంట నీటిలో కొట్టుకుపోయింది. గొల్లకందుకూరు, వెల్లంటి గ్రామాల్లో పంటతోపాటు వ్యవసాయ మోటార్లు గల్లంతయ్యాయి. పెన్నాలో నీటి మట్టం పెరిగేకొద్దీ పల్లె ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది.  ముఖ్యంగా పొట్టేపాళెం గ్రామం భయం గుప్పెట్లో చిక్కుకుంది. నదికి అంచునే ఈ గ్రామం ఉండటంతో కరకట్టలను తాకిని వరద నీరు పెల్లేడు వాగు రెగ్యులేటర్‌ చెక్కలను తన్నుకుని గ్రామంలోకి ప్రవేశించాయి. పల్లెపాళెం, పాతహరిజనవాడ, అరుధంతీవాడలు నీట మునగడంతో అక్కడి ప్రజలను అధికారులు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రానికి బస్సుల ద్వారా తరలిస్తున్నారు. నెల్లూరు చెరువులోని వరదను పెన్నాలోకి తీసుకెళ్లే పెల్లేడు వాగు ఎగువకు ప్రవహిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. కరకట్టలు ఎప్పుడు తెగిపోతాయోనన్న ఆందోళనలో స్థానికులు, అధికారులున్నారు. కరకట్టలు బలహీనంగా ఉన్న చోట పటిష్టతకు యంత్రాలతో చర్యలు చేపడుతున్నారు.


కనుపూరు కాలువలో ప్రవాహం ఉధృతం

కనుపూరు కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం 1000 క్యూసెక్కులుకాగా ప్రస్తుతం 1200 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో 30వ కిలోమీటర్‌ వద్ద సౌత్‌మోపూరు సమీపంలో కాలువకు భారీ గండిపడింది. దానిని పూడ్చేందుకు ఇరిగేషన్‌ అధికారులు శ్రమిస్తున్నప్పటికీ ఆగని వర్షంతో వాతావరణం అనుకూలించడం లేదు. ఈ క్రమంలో నీరంతా పక్కనే ఉన్న రామయ్య చెరువు ద్వారా నెల్లూరు - తాటిపర్తి రహదారి మీదుగా పెన్నాలోకి ప్రవహిస్తోంది. దీంతో రోడ్డు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో నీటి ఉధృతి తగ్గితేగానీ గండిని పూడ్చలేమని అధికారులు తేల్చారు. ఇదిలాఉండగా 25వ కి.మీ. వద్ద చెరువుకు వెళ్లాల్సిన ప్రవాహ నీరు సూపర్‌ ప్యాసేజ్‌ గోడలు కూలడంతో తిరిగి కనుపూరు కాలువలోకే వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-11-28T07:28:35+05:30 IST