ముంపు ముప్పు

ABN , First Publish Date - 2021-07-23T06:19:34+05:30 IST

ముంపు ముప్పు

ముంపు ముప్పు
ప్రకాశం బ్యారేజీ దిగువన వరద నీటి ప్రవాహం

జిల్లాను వీడని వాన.. మునిగిన నారుమళ్లు, వరిపైరు 

పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్‌.. స్థానికులకు ఇబ్బందులు

జిల్లాలో సగటు వర్షపాతం 50.6 మిల్లీమీటర్లుగా నమోదు

వత్సవాయిలో అత్యధికంగా 93.8 మిల్లీమీటర్లు

భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరిపైరు నీట మునిగింది. కృష్ణమ్మకు ప్రవాహ ఉధృతి పెరగగా, ప్రకాశం బ్యారేజీ గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

మచిలీపట్నం/విజయవాడ, ఆంధ్రజ్యోతి : భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. వీడని వానతో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనద్రోణి కారణంగా శుక్రవారం కూడా కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని తెలిపింది. గురువారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లా సగటు వర్షపాతం 50.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. వత్సవాయిలో అత్యధికంగా 93.8, నాగాయలంకలో అత్యల్పంగా 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 50.6 మిల్లీమీటర్లుగా ఉంది.  

పొంగి ప్రవహిస్తున్న వాగులు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు ఉధృతంగా ఉన్నాయి. దీంతో నందిగామ, వీరులపాడు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. మునేరు, కీసర వాగుల్లో నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. అధికారులు ముందస్తుగా లింగాల-చిట్యాల, ముచ్చింతాల -పెనుగంచిప్రోలు మధ్య ఉన్న కాజ్‌వేను మూసివేశారు. మునేరుకు గురువారం మధ్యాహ్నం వరకు 16వేల క్యూసెక్కుల నీరు పోలంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చింది. అది రాత్రికి 25వేల క్యూసెక్కులకు చేరింది. జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామం వద్ద చెట్లు నేలకూలాయి. పెనుగంచిప్రోలు మండలం లింగంగూడెం వద్ద గండివాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో లింగంగూడెం-పెనుగంచిప్రోలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరు పొంగి ప్రవహిస్తుండటంతో మరుసుమిల్లి-దాసులపాలెం, పోరాటనగర్‌ మధ్య ఇదే పరిస్థితి ఏర్పడింది. మైలవరంలోని చంద్రబాబు నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. తిరువూరు మండలంలో కాకర్ల, వల్లంపట్ల, చౌటపల్లి మధ్య ఎదుళ్లవాగు పొంగి ప్రవహిస్తోంది. తిరువూరు-అక్కపాలెం మధ్య పడమటి వాగు ఉధృతంగా ఉంది. మల్లేల వద్ద ఉన్న  చప్టాపై వరదనీరు ప్రవహిస్తోంది. వత్సవాయి మండలంలో పోలంపల్లి ఆనకట్ట వద్ద మునేరు వాగు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం 11 అడుగులకు చేరితే చిల్లకల్లు, వైరానది లింగాల కాజ్‌వే పైకి చేరి ప్రమాదకర స్థితి ఏర్పడుతుందని అధికారులు అంచనా వేశారు. 

2,811 హెక్టార్లలో వరిపైరు నీటమునక

వెదజల్లే పద్ధతిలో నాట్లు పూర్తిచేసిన పొలాలకు వర్షాలు ముప్పుగా పరిణమించాయని రైతులు చెబుతున్నారు. ఎత్తు తక్కువగా ఉన్న వరిపైరు రోజుల తరబడి నీటిలో ఉండటంతో చనిపోతోందని అంటున్నారు. గన్నవరం, ముదినేపల్లి, బంటుమిల్లి, కృత్తివెన్ను, ఉంగుటూరు మండలాల్లోని 54 గ్రామాల్ల్లో 5 నుంచి 25 రోజుల వయసున్న వరిపైరు 2,811 హెక్టార్లలో నీటమునిగి దెబ్బతిన్నట్లు ప్రాథమిక నివేదికను వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. తోట్లవల్లూరు, రొయ్యూరు, వల్లూరుపాలెంలో నాట్లు పూర్తిచేసిన పొలాల్లోని వరిపైరు నీట మునిగింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిస్తే నారుమళ్లు, వరిపైరు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉధృతంగా తమ్మిలేరు

చాట్రాయి : భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులు రాగా, తెలంగాణ పరిధిలోని బేతుపల్లి జలాశయం నుంచి రాత్రికి ఇన్‌ఫ్లో బాగా పెరుగుతుందని ఇరిగేషన్‌ డీఈఈ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 337 అడుగులు ఉందని, ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం 355 అడు గులు కాగా, 348 అడుగులు దాటాక గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తామ న్నారు. కాగా, వరద తాకిడికి చిన్నంపేట, పశ్చిమగోదావరి జిల్లా శివపురం మధ్య తమ్మిలేరుపై ఉన్న కాజ్‌వే అప్రోచ్‌ రోడ్డుకు గండి పడింది. దీంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  








Updated Date - 2021-07-23T06:19:34+05:30 IST