అట్టుడుకుతున్న లాహోర్‌

ABN , First Publish Date - 2021-04-17T07:38:40+05:30 IST

పాకిస్థాన్‌లో తీవ్ర సామాజిక అశాంతి చెలరేగింది. అతివాద, నిషేధిత ఇస్లామిక్‌ గ్రూపు- తెహ్రీక్‌-ఇ-లిబాయక్‌ పాకిస్థాన్‌ (టీఎల్‌పీ) నాయకుడు సాద్‌ రిజ్వీని మంగళవారం అరెస్ట్‌ చేసిన నాటి నుంచీ దేశమంతా నిరసన

అట్టుడుకుతున్న లాహోర్‌

మత నేత అరె్‌స్టతో తీవ్ర ఉద్రిక్తత

ఏడుగురి మృతి..600మందికి గాయాలు

సోషల్‌ మీడియాపై తాత్కాలిక నిషేధం

ఫ్రాన్స్‌-వ్యతిరేక ప్రదర్శనల హోరు


ఇస్లామాబాద్‌-లాహోర్‌, ఏప్రిల్‌ 16: పాకిస్థాన్‌లో తీవ్ర సామాజిక అశాంతి చెలరేగింది.  అతివాద, నిషేధిత ఇస్లామిక్‌ గ్రూపు- తెహ్రీక్‌-ఇ-లిబాయక్‌ పాకిస్థాన్‌ (టీఎల్‌పీ) నాయకుడు సాద్‌ రిజ్వీని మంగళవారం అరెస్ట్‌ చేసిన నాటి నుంచీ దేశమంతా నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతోంది. లాహోర్‌లోనూ, కరాచీ, రావల్పిండిల్లోనూ ఈ ప్రదర్శనల హోరు తీవ్రంగా ఉంది. శుక్రవారం ప్రార్థనల అనంతరం హింస మరింత ప్రబలవచ్చని భావించిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌ మొదలైన సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. ఇంటర్నెట్‌ను సైతం కట్‌ చేసింది.  


ఎవరీ రిజ్వీ... ఎందుకు అరెస్ట్‌.. ?

టీఎల్‌పీ ఓ ఛాందసవాద ఇస్లామిక్‌ పార్టీ.  పాక్‌ ఎలక్షన్‌ కమిషన్లో రిజిస్టరై 2018 ఎన్నికల్లో సైతం పోటీచేసిన రాజకీయ పక్షం. దాని అధినేత సాద్‌ రిజ్వీ. మత దూషణ ప్రపంచంలో ఎక్కడ జరిగినా పాక్‌లో ప్రదర్శనలను నిర్వహించడం ఈ టీఎల్‌పీ విధానం.  మహమ్మద్‌ ప్రవక్తపై చార్లీ హెబ్డో సహా కొన్ని ఫ్రెంచి పత్రికల్లో కార్టూన్లను ప్రచురించడం, ప్రవక్తను వ్యంగ్యంగా చిత్రీకరించడంపై టీఎల్‌పీ మొదట్నుంచీ తీవ్రంగా నిరసిస్తోంది.  ఈ కార్టూన్లను భావప్రకటన స్వేచ్ఛ కింద జమకట్టిన ఫ్రెంచి ప్రభుత్వం వాటిని సమర్థించుకురావడంతో టీఎల్‌పీ నిరసన సాగిస్తోంది. గత అక్టోబరులో ప్రవ క్త కార్టూన్‌లకు సంబంధించి ఓ ఫ్రెంచి టీచర్‌ను పారి్‌సలో తలనరికి చంపిన నాటి నుంచి ఈ వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. నెలరోజులుగా టీఎల్‌పీ ఉధృతం చేసింది. 


రిజ్వీ అరె్‌స్టతో ఆ పార్టీ ప్రత్యక్ష హింసకు దిగింది. నలుగురు పోలీసులు సహా ఏడుగురు వ్యక్తులు ఇప్పటిదాకా చనిపోయారు. 600కు పైగా ఆందోళనకారులు గాయపడ్డారు. భారీ ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఇస్లామాబాద్‌కు వెళ్లే రహదారులను దిగ్బంధించడం, వేల మంది బైఠాయింపులు,  ధర్నాలు, దాడులతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్రాన్స్‌తో సంబంధాలు తెగతెంపులు చేయాలని, దేశంలోని ఫ్రెంచి వారందరినీ పంపేయాలనీ ఈ  గ్రూప్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం నిరాకరించింది. అలా చేస్తే పాక్‌ ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందని స్పష్టం చేసింది. టీఎల్‌పీని దారికి తేవడానికి యత్నించి, సాధ్యం కాకపోవడంతో ఆ సంస్థను ఉగ్రవాద తండాగా ముద్ర వేసి నిషేధం విధించింది. ఓ రాజకీయ పక్షాన్ని టెర్రరిస్ట్‌ గ్రూప్‌గా పేర్కొని నిషేధం విధించడంతో మరిన్ని ఇస్లామిక్‌ గ్రూపులు దీన్ని నిరసిస్తూ ప్రదర్శనలు మొదలెట్టాయి. పరిస్థితి విషమించిందని భావించిన ఫ్రాన్స్‌లోని ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ ప్రభుత్వం వెంటనే స్వదేశానికి వచ్చేయండని తన పౌరులను, కంపెనీలను కోరింది. 

Updated Date - 2021-04-17T07:38:40+05:30 IST