‘ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌’లో ఫ్లిప్‌కార్ట్‌కు వాటా

ABN , First Publish Date - 2020-10-24T07:55:58+05:30 IST

దేశీయ రిటైల్‌ రంగంలో మరో డీల్‌ కుదిరింది. ప్రపంచ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ చేతుల్లోకి వెళ్లిన దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌లో 7.8 శాతం వాటా కొనుగోలు చేయనుంది...

‘ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌’లో  ఫ్లిప్‌కార్ట్‌కు వాటా

  • 7.8శాతం వాటా కొనుగోలు.. డీల్‌ విలువ రూ.1,500 కోట్లు 


న్యూఢిల్లీ: దేశీయ రిటైల్‌ రంగంలో మరో డీల్‌ కుదిరింది. ప్రపంచ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ చేతుల్లోకి వెళ్లిన దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌లో 7.8 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.1,500 కోట్లు. ఫ్లిప్‌కార్ట్‌ తన ఫ్యాషన్‌ ఉత్పత్తుల పరిధిని మరింత విస్తృతపర్చుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. తన ప్రధాన ప్రత్యర్ధి అమెజాన్‌తో పాటు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌తో పోటీపడేందుకూ ఉపయోగపడనుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ విషయానికొస్తే, ఈ లావాదేవీ ద్వారా సమకూరే నిధులతో రుణభారాన్ని తగ్గించుకోనుంది. 2020 మార్చి 31 నాటికి ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రుణ భారం రూ.2,776 కోట్లుగా ఉంది.  


వాటా కొనుగోలు ఇలా.. 

ఈ ఒప్పందంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌కు ప్రిఫరెన్షియల్‌ షేర్లు, ఒక్కొక్కటీ రూ.205 చొప్పున జారీ చేయనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ తెలిపింది. గురువారం ఈ కంపెనీ షేరు ముగింపు ధర రూ.153.4తో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్‌ 33.6 శాతం ప్రీమియం చెల్లించనుంది. ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపు తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ ప్రమోటర్లు కంపెనీలో 55.13 శాతం వాటా కలిగి ఉండనున్నారు. నియంత్రణ సంస్థలు, ఇతర అనుమతులకు లోబడి ఈ ఒప్పంద లావాదేవీ పూర్తికానుంది. 


8 శాతం పెరిగిన షేరు 

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ షేరు దాదాపు 8 శాతానికి పైగా లాభపడింది. బీఎ్‌సఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకదశలో 16.55 శాతం వరకు ఎగబాకిన షేరు ధర చివరికి 7.59 శాతం లాభంతో రూ.165.05 వద్ద ముగిసింది. 



ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్‌ గురించి.. 

ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ ఇది. దేశంలోని అతిపెద్ద ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ కంపెనీల్లో ఒకటి. పీటర్‌ ఇంగ్లాండ్‌, అలెన్‌ సోలీ, లూయిస్‌ ఫిలిప్‌, వ్యాన్‌ హ్యూసెన్‌ వంటి ప్రముఖ రెడీమేడ్‌ దుస్తుల బ్రాండ్ల విక్రయదారు.  ఫరెవర్‌ 21, అమెరికన్‌ ఈగిల్‌, రాల్ఫ్‌ లారెన్‌, ఫ్రెడ్‌ పెర్రీ, హ్యాకెట్‌ లండన్‌, జేపోర్‌, శంతను అండ్‌ నిఖిల్‌, సైమన్‌ కార్టర్‌, టెడ్‌ బేకర్‌ బ్రాండ్లను విక్రయించే హక్కులనూ కలిగి ఉంది. అంతేకాదు, పాంటలూన్స్‌ పేరుతో రెడీమేడ్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తుల రిటైల్‌ విక్రయ స్టోర్లను నిర్వహిస్తోంది. సంస్థకు దేశవ్యాప్తంగా 3,000కు పైగా రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. మరో 23,700 మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ విక్రయ కేంద్రాలు, 6,700 డిపార్ట్‌మెంట్‌ స్టోర్ల ద్వారానూ తన బ్రాండ్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీలో 25 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 


Updated Date - 2020-10-24T07:55:58+05:30 IST