Flipkart: ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల తీవ్ర అసంతృప్తి.. ఆ ఫోన్ కొనేందుకు ట్రై చేస్తుంటే..

ABN , First Publish Date - 2022-09-22T16:34:08+05:30 IST

ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart Big Billion Days Sale) పండగ సందడి మొదలైంది. బిగ్‌ బిలియన్ డేస్ సేల్..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల తీవ్ర అసంతృప్తి.. ఆ ఫోన్ కొనేందుకు ట్రై చేస్తుంటే..

ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart Big Billion Days Sale) పండగ సందడి మొదలైంది. బిగ్‌ బిలియన్ డేస్ సేల్ 2022 ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు (Flipkart Plus Customers) ఒకరోజు ముందుగానే మొదలైంది. ఈ సేల్‌కే హైలైట్‌గా నిలవనున్న ఐఫోన్ 13 (iPhone13OnFlipkart) కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఓ రేంజ్‌లో ఆసక్తి చూపించారు. డిస్కౌంట్ ధర ఎంతో చెప్పకుండా ఇన్నాళ్లూ ఫ్లిప్‌కార్ట్ ఊరిస్తూ రావడమే ఇందుకు కారణం. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఐఫోన్ 13 (iPhone13 Flipkart Price) పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు ఆశపడ్డారు. అర్ధరాత్రి 12 గంటలకు సేల్ మొదలు కావడంతోనే ఐఫోన్ 13 డిస్కౌంట్‌ పోనూ ఎంత తక్కువకు వస్తుందోనని కొనేందుకు తెగ ఆసక్తి చూపించారు. కానీ.. ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి కస్టమర్లకు మిశ్రమ స్పందన ఎదురైంది.



ఐఫోన్ 13 ధరను ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు మారుస్తూ గందరగోళానికి గురిచేస్తుందని ట్విట్టర్ వేదికగా కస్టమర్లు ఆరోపిస్తున్నారు. iPhone13OnFlipkart అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13 ధర తొలుత రూ.48 వేలుగా ఉందని, అరగంట పోయాక రూ.50 వేలు పైగానే చూపించిందని కస్టమర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13 ధర విషయంలో కస్టమర్లను ఫూల్స్‌ను చేసిందని మండిపడుతున్నారు. మరికొందరికేమో.. ఐఫోన్ 13 కొనుగోలు చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఫోన్ బుక్ కాలేదు. ఇంకొందరేమో.. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. డిస్కౌంట్‌లో ఐఫోన్ 13 పొందలేకపోయిన కస్టమర్లు తమ అసంతృప్తిని పలు విధాలుగా వ్యక్తం చేస్తున్నారు. పదేపదే ఐఫోన్ ధరను మార్చుతూ.. కస్టమర్లను ఎందుకు ఇలా వేధిస్తున్నారని కొందరు నిలదీస్తున్నారు.



ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఐఫోన్ 13 మోడల్ 51,990 రూపాయలుగా ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో చూపించింది. ఐఫోన్ 13 డిస్కౌంట్‌లో పొందిన కస్టమర్లు ట్విట్టర్‌లో స్క్రీన్‌షాట్లు షేర్ చేసి మరీ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఒక కస్టమర్ తనకు రూ.48,019కే ఐఫోన్ 13 దక్కినట్లు ట్విట్టర్‌లో స్క్రీన్ షాట్ పెట్టాడు. మరో కస్టమర్ ఏమో.. ఇది సేలా లేక స్టాక్ మార్కెటా అని ఫ్లిప్‌కార్ట్‌లో మారిన ఐఫోన్ 13 ధరలను స్క్రీన్ షాట్ పెట్టి మరీ వెటకారం చేశాడు.



ఏదేమైనా.. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌పై, డిస్కౌంట్‌లో ఐఫోన్ 13 మొబైల్‌ను పొందడంపై కస్టమర్లు ఎంత వెర్రెత్తిపోయి ఉన్నారో ఈ పరిణామం స్పష్టం చేసింది. ప్లస్ కస్టమర్లకు సేల్ మొదలయితేనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక సెప్టెంబర్ 23 నుంచి 30 వరకూ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లందరికీ సేల్ అందుబాటులోకి రానుండటంతో పరిస్థితి ఇంకెలా ఉండబోతుందోనన్న ఆసక్తి మొదలైంది.

Updated Date - 2022-09-22T16:34:08+05:30 IST