మనసును కదిలిస్తున్న మూగజీవాల స్నేహం!

ABN , First Publish Date - 2020-02-22T01:37:46+05:30 IST

స్నేహ బంధం ఎంతో అద్భతమైనది. మనుషుల్లోనే కాదు.. మూగ జీవుల్లోనూ స్నేహాలు చిగురిస్తుంటాయి. జాతి వైరం లేకుండా పిల్లి-కుక్క, ఎలుక-పిల్లి ఇలా ఎన్నో జంతువుల మధ్య స్నేహం చూశాం.

మనసును కదిలిస్తున్న మూగజీవాల స్నేహం!

న్యూఢిల్లీ: స్నేహ బంధం ఎంతో అద్భతమైనది. మనుషుల్లోనే కాదు.. మూగ జీవుల్లోనూ స్నేహాలు చిగురిస్తుంటాయి. జాతి వైరం లేకుండా పిల్లి-కుక్క, ఎలుక-పిల్లి ఇలా ఎన్నో జంతువుల మధ్య స్నేహం చూశాం. కానీ వీటి స్నేహం మాత్రం ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. అటు ఎగరలేని పావురం.. ఇటు నడవలేని కుక్కపిల్ల.. ఈ రెండింటి మధ్య స్నేహం చిగురించింది. వీటి స్నేహం ఎంతో మంది మనసులను కదిలించింది. ఈ రెండూ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 


అసలు ఆ రెండూ ఎలా కలిశాయి..? వాటి మధ్య స్నేహం ఎలా కుదిరింది..? ఆ ఫోటో సోషల్ మీడియాకు ఎలా ఎక్కింది...? వివరాలన్నీ తెలుసుకుందాం పదండి.. మియా ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నడుస్తోంది. ఆ సంస్థ వైకల్యాలతో బాధపడుతున్న జంతువులు, పక్షులకు పునరావాసం కల్పించి వాటిని సంరక్షిస్తుంటారు. ఇలా ఎగరలేకుండా ఉన్న పావురాన్ని, నడవలేని కుక్కపిల్లను వారు తమ సంరక్షణశాలకు తీసుకువచ్చారు. వాటికి ట్రీట్‌మెంట్ ఇవ్వడం, వాటి ఆలనాపాలనా చూస్తూ వచ్చారు. హర్మన్, లుండీ అని వాటికి పేర్లు కూడా పెట్టారు. అలా ఈ రెండింటి మధ్య స్నేహం చిగురించింది. రెండూ కలిసి ఆడుకోవడం, సరదాగా ఉండటం చూసి ఫౌండేషన్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పావురం, కుక్కపిల్ల రెండూ కలిసి ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. హర్మన్, లుండీ మధ్య కొత్త స్నేహం వికసించింది అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే ఫేస్‌బుక్‌లో ఫోటో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే తెగ వైరలైపోయింది. 24 గంటల వ్యవధిలోనే దాదాపు 5 మిలియన్ల మందికి రీచ్ అయింది. వీటి స్నేహానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఇవి ఎంత బాగున్నాయో.. భగవంతుడు వీటికి అండగా ఉంటాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘నేను ఇప్పటి వరకు చూసిన వాటిలో కుక్కపిల్ల, పావురం స్నేహం ఎంతో అందమైనది అని’’ మరో నెటిజన్ పేర్కొన్నారు.

Updated Date - 2020-02-22T01:37:46+05:30 IST