కరోనా ఎఫెక్ట్.. UAE-India మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీగా పడిపోయిన విమాన చార్జీలు!

ABN , First Publish Date - 2022-01-05T17:44:05+05:30 IST

మహమ్మారి కరోనా కారణంగా మరోసారి విమాయాన సంస్థలకు తిప్పలు తప్పడం లేదు.

కరోనా ఎఫెక్ట్.. UAE-India మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీగా పడిపోయిన విమాన చార్జీలు!

దుబాయ్: మహమ్మారి కరోనా కారణంగా మరోసారి విమాయాన సంస్థలకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడిప్పుడు కాస్తా తేరుకుంటున్న సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ల కారణంగా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండడంతో భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. ఇక చాలా మంది అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే కరోనా సమయంలో ఇతర దేశాల్లో చిక్కుకుని చాలా మంది పడరాని పాట్లు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం కొన్ని దేశాలు బయటి దేశాల ప్రయాణాలకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇదంతా కలిసి ఇప్పుడు విమాన చార్జీలు తగ్గడానికి కారణమైందని దుబాయ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు చెబుతున్నమాట. 


ఇక భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం దుబాయ్ నుంచి ఇండియా వచ్చేందుకు కేవలం 300 దిర్హమ్స్(సుమారు రూ.6వేలు) ఉంటే చాలు. ఇంతకుముందు వెయ్యి నుంచి 1500 దిర్హమ్స్ ఉన్న చార్జీలు ఇప్పుడు ఏకంగా 4-5 రేట్లు పడిపోయాయి. అలాగే గత వారం రోజులుగా దుబాయ్-భారత్ రూట్‌లో టికెట్ బుకింగ్స్ సైతం భారీగా పడిపోయినట్లు EaseMyTrip అనే ట్రావెల్ పోర్టల్ వెల్లడించింది. వారం ముందు వరకు డైలీ 142 వరకు ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 120కి పడిపోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం దుబాయ్‌ నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు ఉన్న విమాన చార్జీలను ఒకసారి పరిశీలిస్తే..


* ఢిల్లీ నుంచి దుబాయ్‌కు ఇంతకుముందు 1000-1500 దిర్హమ్స్‌గా(రూ.20వేలు నుంచి రూ.30వేలు) ఉన్న విమాన టికెట్ల రేట్లు ఇప్పుడు కేవలం 330 దిర్హమ్స్(రూ.6600) మాత్రమే ఉన్నట్లు కొన్ని విమానయాన సంస్థులు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నెషనల్ ప్రయాణికులకు విధించిన పెయిడ్ ఐసోలేట్ నిబంధన. విదేశాల నుంచి వచ్చినవారికి పాజిటివ్ వస్తే తప్పనిసరిగా ఐసోలేట్‌లో ఉండాల్సిందే. 

* కొచ్చి టు దుబాయ్ ప్రస్తుతం విమాన చార్జీలు 1300 దిర్హమ్స్(రూ.26వేలు). అదే దుబాయ్ నుంచి కొచ్చి వచ్చేందుకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌తో పాటు ఫ్లై దుబాయ్ వంటి విమానయాన సంస్థలు కేవలం 300-500 దిర్హమ్స్(రూ.6వేల నుంచి రూ.10వేలు) మాత్రమే చార్జ్ చేస్తున్నాయి.     

* తిరువనంతపురం నుంచి దుబాయ్‌కు చార్జీలు 1500-4000 దిర్హమ్స్(రూ.30వేల నుంచి రూ.81వేలు)గా ఉంటే.. రిటర్న్ టికెట్లు సుమారు 390 దిర్హమ్స్(రూ.8వేలు) మాత్రమే.

* కన్నూర్, కోజికోడ్ నుంచి దుబాయ్‌కు 1000-1400 దిర్హమ్స్(రూ.20వేల నుంచి రూ.28వేలు)గా ఉంటే.. రిటర్న్ ఫ్లైట్ టికెట్ ధరలు 380-600 దిర్హమ్స్(రూ.7700 నుంచి రూ.12వేలు)గా ఉన్నాయి.


Updated Date - 2022-01-05T17:44:05+05:30 IST