ఖర్చు.. విమానం మోతే!

ABN , First Publish Date - 2020-05-27T10:08:20+05:30 IST

వృత్తి రీత్యా, ఉపాధి కోసం వారంతా విదేశాలకు వెళ్లారు. కుటుంబాలను కొన్నాళ్లు వదిలి ఉండాల్సి వచ్చినా, ఆర్థికంగా స్థిరపడేందుకు ఆ మాత్రం త్యాగం తప్పదనుకున్నారు. కుదురుకున్నామని భావించి కొందరు.. పండుగ ఉందని కొందరు స్వదేశం రావాలని...

ఖర్చు.. విమానం మోతే!

  • ప్రయాణ టికెట్లకు రెట్టింపు ధర!
  • స్వదేశం చేరినా రెండు వారాలు ఇంటికెళ్లలేం
  • పైగా క్వారంటైన్‌కు సొంతంగా చెల్లింపులు
  • విదేశాల్లో ఉన్న హైదరాబాద్‌ వాసుల ఆవేదన

హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): వృత్తి రీత్యా, ఉపాధి కోసం వారంతా విదేశాలకు వెళ్లారు. కుటుంబాలను కొన్నాళ్లు వదిలి ఉండాల్సి వచ్చినా, ఆర్థికంగా స్థిరపడేందుకు ఆ మాత్రం త్యాగం తప్పదనుకున్నారు. కుదురుకున్నామని భావించి కొందరు.. పండుగ ఉందని కొందరు  స్వదేశం రావాలని భావించారు. ఇంతలో లాక్‌డౌన్‌ వచ్చిపడి విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పుడు ఆ గడువు సైతం తీరి.. విమాన ప్రయాణాలు ప్రారంభమైనప్పటికీ, టికెట్‌ ఖర్చు, క్వారంటైన్‌ను తల్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఇదీ.. గల్ఫ్‌, యూరప్‌ దేశాల్లో ఉన్న హైదరాబాద్‌ వాసుల పరిస్థితి. వీరిలో కొందరు దేశం కాని దేశంలో కరోనా అనంతర పరిణామాలను తల్చుకుని ఆందోళన చెందుతున్నారు. సొంతగడ్డపై కలో గంజో తాగైనా బతుకుదామని అనుకుంటున్నారు.


టికెట్‌ రేటుతో ఆశలు కట్‌..

విమానాల ప్రారంభంతో వచ్చేద్దామనుకుంటున్నవారు.. ముందు టికెట్‌ రేటు చూసి బెంబేలెత్తిపోతున్నారు. భౌతిక దూరం నిబంధన దృష్ట్యా గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చేవారు రెండు సీట్ల ధర భరించాల్సి వస్తోంది. ఆపై వీలుంటే హోటల్‌ క్వారంటైన్‌ లేదంటే సర్కారీ క్వారంటైన్‌. దీంతో రెండు వారాలు ఇళ్లకు వెళ్లలేమని భావించి ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. మొత్తం లెక్క చూస్తే గల్ఫ్‌ నుంచి రావాలంటే రూ.లక్ష ఖర్చవుతోంది. ఇక యూరప్‌, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుంచి రావాలంటే విమాన టికెట్లకే రూ.లక్ష అవుతోంది. ఆపై క్వారంటైన్‌ ఖర్చు అదనం. ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న హైదరాబాద్‌ వాసులతో ‘ఆంధ్రజ్యోతి’ మాట్లాడింది. వారేమన్నారంటే..


ఏప్రిల్‌లోనే  వచ్చేద్దామనుకున్నా..

పాతికేళ్లుగా సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో పనిచేస్తున్నా. ఈ ఏడాది అంతా బంద్‌ చేసి తిరిగొద్దామనుకున్నా. ఏప్రిల్‌ నెలలో ప్రయాణానికి ప్రణాళిక వేసుకున్నా. అంతలోనే లాక్‌డౌన్‌ వచ్చిపడింది. విమాన సర్వీసులు రద్దు చేశారు. క్వారంటైన్‌ తప్పదన్నారు. దాంతో ఇక్కడే ఉండిపోయా. భార్యాపిల్లలను చూడక రెండేళ్లయింది. కాస్త డబ్బులెక్కువైనా, ఇప్పుడు కల్పించిన వెసులుబాట్లతో హైదరాబాద్‌ వచ్చేద్దామంటే హోటల్‌ క్వారంటైన్‌కు వెళ్లాలంటున్నారు. ఇంటి దగ్గరికి చేరి కూడా రెండు వారాలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. టికెట్‌తో పాటు క్వారంటైన్‌ ఖర్చు భారమే. 

 -  అబ్దుల్‌ అలీమ్‌, ఫలక్‌నుమా వాసి


నా దగ్గర టికెట్‌కే డబ్బుల్లేవు..

దశాబ్దంపైగా దుబాయ్‌లో నివసిస్తున్నా. బాధ్యతల రీత్యా, ఇతర కార్యక్రమాలతో ఇప్పటివరకు ఎలాగో నెట్టుకొచ్చా. లాక్‌డౌన్‌తో నా ఉపాధి (కఫీల్‌ దగ్గర టైలరింగ్‌) పోయింది. తిండి, బస ఏర్పాట్లు తప్ప నా యజమాని ఏమీ ఇవ్వలేకపోతున్నాడు. తిరిగి వెళ్దామంటే విమాన టికెట్‌కు డబ్బుల్లేవు. క్వారంటైన్‌ ఉండలేను. వేచి చూడటం తప్ప చేసేదేమీ లేదు.

- అబ్దుల్‌ వాహెద్‌, కార్వాన్‌ వాసి 


Updated Date - 2020-05-27T10:08:20+05:30 IST