పుత్తూరులో ఫ్లెక్సీల గొడవ

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

పుత్తూరు పట్టణంలో నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయమై టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి.

పుత్తూరులో ఫ్లెక్సీల గొడవ
గొడవ పడుతున్న వైసీపీ, టీడీపీ నాయకులు

టీడీపీ నాయకులను చితకబాదిన వైసీపీ నేతలు

భయాందోళనలో స్థానికులు

పహారా కాస్తున్న పోలీసులు


పుత్తూరు, జూలై 3: పుత్తూరు పట్టణంలో నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయమై టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. ఆదివారం ఉదయం మున్సిపల్‌ కమిషనర్‌ తన సిబ్బందితో కలసి పున్నమి హోటల్‌, ఇతర ప్రాంతాల వద్ద ఫ్లెక్సీలను తొలగిస్తుండగా టీడీపీ నాయకులు సుమారు రెండు వందల మందిపైగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషనర్‌, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ నాయకులను పోలీ్‌సస్టేషన్‌కు రావాలని పోలీసులు చెప్పడంతో 15 మంది వరకు వెళ్లారు. మరోవైపు వైసీపీ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్‌ అధికారులను అడ్డుకోవడం టీడీపీ నాయకులకు తగదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను రెండ్రోజుల్లో తొలగించారన్నారు. సమావేశానంతరం వైసీపీ నాయకులు ఫ్లెక్సీలను తొలగించడం మొదలుపెట్టారు. సమాచారం తెలిసిన పోలీస్‌స్టేషన్‌లోని టీడీపీ నాయకులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. దాంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులైన చిత్తూరు బీసీసెల్‌ అధ్యక్షుడు షణ్ముగంరెడ్డిని, పుత్తూరు రూరల్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌ను వైసీపీ నాయకులు చొక్కాలు చింపి మరీ చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొందరు టీడీపీ నాయకులను స్వీట్స్‌ స్టాల్‌లోకి నెట్టేసి.. మిగిలినవారిని సర్దుబాటు చేశారు. అప్పటికే మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆనంద్‌, షణ్ముగంరెడ్డి, రవికుమార్‌లతో వైసీపీ నాయకులు గొడవకు దిగారు. పోలీసులు షణ్ముగంరెడ్డి, రవికుమార్‌, ఆనంద్‌లను పోలీసు జీపులో తీసుకెళ్లారు. దెబ్బలుతిన్న వారిని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ సంఘటనతో పుత్తూరు పట్టణంలో భయాందోళన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు పట్టణంలో పహారా కాస్తున్నారు. 







Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST