ఫ్లెక్సీ రంగంపై.. నీలినీడలు

ABN , First Publish Date - 2022-09-24T05:18:21+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 800 ఫ్లెక్సీ ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. వీటికి తోడు ఇటీవల బాపట్ల జిల్లాలో భాగమైన చీరాల డివిజన్‌ పరిధిలో మరో 200 వరకూ ఉన్నాయి.

ఫ్లెక్సీ రంగంపై..  నీలినీడలు
ఫ్లెక్సీ ముద్రణ యంత్రం

ఫ్లెక్సీల నిషేధం ప్రకటనతో కుదేలు 

మూడు జిల్లాల్లో 10 వేల మంది ఉపాధిపై దెబ్బ

పండుగలకు కూడా ఖాళీగా ఉన్న ముద్రణాలయాలు

ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పునః సమీక్షించాలని వేడుకోలు

నవంబరు ఒకటి నుంచి నిషేధం అమలుకు ప్రభుత్వ ఆదేశాలు


రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ఒక్కో రంగాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీస్తోంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నామంటూ సీఎం జగన్‌ చేసిన ప్రకటనతో ఫ్లెక్సీల ముద్రణా రంగం కుదేలైంది. ముఖ్యమంత్రి నిర్ణయం అధికారికంగా నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. అయితే ఇప్పటికే ఆ ప్రభావం ముద్రణాలయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 10వేల మంది ఉపాధిపై దాని ప్రభావం పడింది. వరుసగా పండుగలు, శుభకార్యాలు, ప్రముఖుల పుట్టినరోజు, వర్థంతి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఫ్లెక్సీల ముద్రణాలయాలు వెలవెలబోయాయి. కరోనా సమయంలో కూడా ఈ పరిస్థితి లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గంవైపు మళ్లే వరకు నిషేధం నిర్ణయాన్ని పునః సమీక్షించాలని నిర్వాహకులు అభ్యర్థిస్తున్నారు.


గుంటూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 800 ఫ్లెక్సీ ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. వీటికి తోడు ఇటీవల బాపట్ల జిల్లాలో భాగమైన చీరాల డివిజన్‌ పరిధిలో మరో 200 వరకూ ఉన్నాయి. మొత్తంగా మూడు జిల్లాలో 1000కి పైగా ఫ్లెక్సీ ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో యజమాని సహా డిజైనర్‌, ప్రింటింగ్‌ ఆపరేటర్‌, హెల్పర్‌, బ్యానర్‌ ఫిక్సర్‌ వంటి ఐదుగురు పనిచేస్తుంటారు. దీనికి అనుబంధంగా ఫ్రేములు తయారు చేసేవారు, బ్యానర్లను కట్టేవారు, హోర్డింగులకు బ్యానర్లు అతికించేవారు మరో ఐదారుగురు జీవనోపాధి పొందుతున్నారు. ప్రస్తుతం వీరందరి ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధ నిర్ణయం కారణంగా వీరంతా ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నారు. ముఖ్యమంత్రి తాజా నిర్ణయం కారణంగా మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 10 వేల మంది ఉపాధికి గండం వచ్చిపడినట్లు తెలుస్తోంది. కాగా ఒక్కో యూనిట్‌ ఏర్పాటుకు రూ.25 లక్షల నుంచి 30 లక్షలు పెట్టుబడి అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రింటింగ్‌ మిషన్‌కు రూ.15 లక్షలు, కంప్యూటర్లు, రంగులు, అడ్వాన్సులు, ఇతర అవసరాలకు మరో రూ.10 లక్షలకు తగ్గకుండా ఖర్చవుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారిగా ఫ్లెక్సీల నిషేధాన్ని ప్రకటించడంతో లక్షల పెట్టుబడి పెట్టిన వీరంతా గగ్గోలు పెడుతున్నారు.


కేంద్ర నిబంధనలకు భిన్నంగా సీఎం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. ప్లాస్టిక్‌ గ్లాసులు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్‌ సీసాలు, 100 మైక్రాన్ల లోపు ఉండే ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించింది. అయితే రాష్ట్రంలో ఈ నిషేధం ఎక్కడా అమల్లోకి రాలేదు. షాపు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సరిపుచ్చారు. ఫలితంగా నేడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వీటి నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి 350 మైక్రాన్లకు పైగా ఉండే ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. వీటిని నిషేధిస్తున్న ముఖ్యమంత్రి అందరూ వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫ్లెక్సీ అడుగుకు రూ.8 నుంచి రూ.10 ఖర్చవుతుంది. అదే వస్త్రంతో చేసిన ఫ్లెక్సీకి రూ.33 ఖర్చవుతుందని స్వయంగా ముఖ్యమంతే సెలవిచ్చారు. ఇంత భారీ ఖర్చు భరించలేని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, చిరువ్యాపారులు బ్యానర్లు వేయించేందుకు ముందుకు రారు. పైగా వస్త్రం ఫ్లెక్సీ మన్నిక కూడా చాలా తక్కువ కావడం వల్ల వ్యాపారులు ఎవరూ బ్యానర్లు, హోర్డింగులు వేయించే అవకాశమే లేదు. ఇలా మొత్తంగా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది. 


9 శాతం ప్లాస్టిక్‌ ఉన్న ఫ్లెక్సీలపై నిషేధమా?

ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫ్లెక్సీలలో ప్లాస్టిక్‌ 9 శాతమే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లెక్సీల్లో అత్యధికంగా కాల్షియం కార్బొనేట్‌, అంటే సున్నం 36 శాతం, పునర్వినియోగానికి పూర్తిగా పనికివచ్చే పీవీసీ రెజిన్‌ 33 శాతం, పాలిస్టర్‌ వస్త్రం 18 శాతం, ప్లాస్టిక్‌ 9 శాతం, ఇతర రసాయన మిశ్రమాలు 4 శాతం ఉంటాయంటున్నారు. వీటిలో 9 శాతంగా ఉన్న ప్లాస్టిక్‌ మినహా మిగిలినవన్నీ పునర్వినియోగానికి పనికి వచ్చేవని స్పష్టం చేస్తున్నారు. మైక్రాన్ల రూపంలో చూసినా ఫ్లెక్సీ 350 మైక్రాన్లకంటే మందంగా ఉంటుందని, అలాంటి ఫ్లెక్సీలను నిషేధించడం అనాలోచిత నిర్ణయంగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. 


ఫ్లెక్సీ కడితే జరిమానా

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్లపై గత నెలలో సీఎం ప్రకటించగా గురువారం నిషేధ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.  ఈ మేరకు నవంబరు ఒకటో తేదీ నుంచి ఎక్కడైనా ఎవరైనా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ కడితే జరిమానా విధిస్తామని అందులో పేర్కొంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్లను ఏ వ్యక్తి తయారు చేయరాదు.. మెటీరియల్‌ను దిగుమతి చేసుకోకూడదని.. ఏ వ్యక్తి ఎలాంటి ఫ్లెక్సీలను ముద్రించకూడదని.. ఉపయోగించకూడదని.. రవాణా చేయకూడదని.. ప్రదర్శించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలు బాధ్యతను గ్రామాల్లో పంచాయతీ అధికారులకు, మున్సిపల్‌ పట్టణాల్లో కమిషనర్లు, హెల్త్‌, శానిటరీ, వార్డు సచివాలయ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్‌, రవాణా, జీఎస్టీ అధికారులకు అప్పగించారు. నిషేధిత ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్ల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధిస్తారు. 


 జీవో రాకముందే ఆగిపోయిన ముద్రణ

ఫ్లెక్సీల నిషేధం జీవో రాక ముందు నుంచే పని లేదు. నవంబరు 1 నుంచి నిషేధం అమలు అని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నెల రోజులుగా తీవ్రంగా నష్టపోయాం. రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నాం. పండుగకు, పుట్టినరోజులు, వర్థంతి కార్యక్రమాలకు కూడా ఎవరూ ఫ్లెక్సీలు వేయించ లేదు. కరోనా కారణంగా కూడా ఇంతగా దెబ్బతిన లేదు.

- లక్ష్మణ్‌, పెద్దవడ్లపూడి


ముఖ్యమంత్రి కనికరించాలి..

ఫ్లెక్సీల నిషేధంపై ముఖ్యమంత్రి కనికరించాలి. దీనిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అర్ధాంతరంగా వాటిని ఆపేస్తే మేం వీధిన పడాల్సి వస్తుంది. పునర్వినియోగ ఫ్లెక్సీలపై నిషేధం విషయంలో ముఖ్యమంత్రి సానకూలంగా నిర్ణయం తీసుకోవాలి.

- స్వామి, గుంటూరు


 

Updated Date - 2022-09-24T05:18:21+05:30 IST