Abn logo
Apr 13 2021 @ 00:32AM

ఫ్లాట్లూ పాట్లు

వీఎంఆర్‌డీఏ వద్ద తనఖా పెట్టినవి కూడా అమ్మకం 

బిల్డర్లకు అధికారుల సహకారం

తాళ్లవలసలో 17 తనఖా ప్లాట్లు అమ్మేసుకున్న బిల్డర్‌

ప్రాజెక్టు పూర్తిచేయకపోవడంతో కొనుగోలుదారుల గగ్గోలు

చదరపు అడుగుకు రూ.500 అదనంగా డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులు...బిల్డర్లు/లేఅవుట్‌ డెవలపర్లతో కుమ్మక్కు కావడం వల్ల స్థిరాస్తుల కొనుగోలుదారులు మోసపోతున్నారు. లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లలో ‘తనఖా’   (మార్టిగేజ్‌) పేరుతో ఆయా సంస్థలకు అప్ప గించే ప్లాట్లు/ఫ్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారిపోతున్నా...అడ్డుకోవలసినవారు కాసులకు కక్కుర్తిపడి మిన్నకుంటున్నారు. ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు బాధితులు ఫిర్యాదు చేసినా నెలల తరబడి పట్టించుకోవడం లేదు. బిల్డర్లకు కనీసం నోటీసు కూడా జారీ చేయలేకపోతున్నారు. 


ఏమిటీ తనఖా?

ఒక లేఅవుట్‌ వేసినా, అపార్ట్‌మెంట్‌ కట్టినా పూర్తి చేయడానికి ఒక నిర్ణీత గడువు ఉంటుంది. ఆ సమయంలోగా సదరు డెవలపర్‌/బిల్డర్‌ వాటిని పూర్తిచేసి, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలి. నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణం ఉండాలి. సెట్‌ బ్యాక్స్‌, ఫైర్‌ సేఫ్టీ, యూజీడీ కనెక్షన్‌ వంటివన్నీ ఉండాలి. అదే లేఅవుట్‌ అయితే రహదారులు, కాలువలు, విద్యుద్దీపాలు, సామాజిక అవసరాలకు తగిన స్థలం కేటాయింపు వంటివన్నీ పక్కాగా ఉండాలి. ఒకవేళ అలా చేయకపోతే వారిపై చర్యలు తీసుకునేందుకు గాను ఆ ప్రాజెక్టులోని 10 శాతం విలువైన ప్లాట్లు లేదా ఫ్లాట్లు జీవీఎంసీ/వీఎంఆర్‌డీ తనఖా (మార్జిగేజ్‌) కింద పెట్టుకుంటాయి. ప్రాజెక్టు 100 శాతం పూర్తయిందని, నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకున్నాక...వాటిని తనఖా నుంచి విడుదల చేస్తాయి. అంతవరకు వాటిని బిల్డర్‌/డెవలపర్‌ అమ్ముకోవడానికి వీల్లేదు. ఇలాంటి కేసుల్లో సదరు సంస్థలు తనఖా పెట్టిన ప్లాట్లు/ఫ్లాట్ల వివరాలను విధిగా సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపాలి. వాటిని రిజిస్టర్‌ చేయకూడదని లిఖిత పూర్వకంగా కోరాలి. అప్పుడు బిల్డర్‌ అమ్ముకోవడానికి అవ్వదు. కానీ ఇక్కడ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏలు ఈ విధానం అనుసరించడం లేదు. తనఖాల వివరాలను అనేక ఏళ్లుగా సబ్‌ రిజిస్ట్రార్లకు పంపడం లేదు. దాంతో కొంతమంది బిల్డర్లు, డెవలపర్లు తనఖా పెట్టినవి కూడా ముందే అమ్మేసుకుంటున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో మౌలిక వసతులు కల్పించకుండానే జారుకుంటున్నారు. 


వైటీఆర్‌ రెసిడెన్సీయే ఉదాహరణ

భీమిలి మండలం తాళ్లవలస గ్రామం సర్వే నంబరు 77/3లో 1.06 ఎకరాల్లో అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి వైటీఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ 2013లో నాటి వుడాకు దరఖాస్తు చేసుకుంది. అప్పటికి భీమిలి జీవీఎంసీలో విలీనం కాలేదు. వైటీఆర్‌ రెసిడెన్సీ పేరుతో జి+5, 144 ఫ్లాట్ల నిర్మాణానికి 2014లో అనుమతి ఇచ్చింది. మౌలిక వసతులు కల్పించడం కోసం రెండో ఫ్లోర్‌లో 17 ఫ్లాట్లను వుడా తనఖా పెట్టుకుంది. ఈ వివరాలను ఆనందపురం సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపాలి. కానీ ఆ పని చేయలేదు. బిల్డర్‌  తిరుమలరాజు సూర్యనారాయణరాజు 2015లో నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉంది. ఈలోగానే ఫ్లాట్ల అమ్మకం ప్రారంభించారు. అన్నీ అమ్ముడుపోయాయి. 2017కి పూర్తి కావలసిన నిర్మాణం 2021 వచ్చినా పూర్తి చేయలేదు. కొనుగోలుదారులు అంతా డబ్బులు కట్టేశారు. బిల్డర్‌ ఏడాదిన్నర నుంచి కనిపించడం లేదు. నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దాంతో వారిలో ఆందోళన మొదలైంది. బిల్డర్‌ని కలవాలని వెళితే కనిపించడం లేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోంది. సమాధానం చెప్పేవారు లేరు. ఆరా తీస్తే...తనఖా పెట్టిన ఫ్లాట్లను కూడా అమ్మేసుకున్నారని తెలిసింది. దాంతో లబోదిబోమంటూ వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి గత ఏడాది జూలై 9న వెళ్లి కమిషనర్‌ను కలిశారు. బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని, తనఖా పెట్టిన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని కోరారు. ఫలితం కనిపించలేదు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన...ఆ లేఖను జిల్లా రిజిస్ట్రార్‌కు పంపి, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆపాలని సూచించారు. ఆ తరువాత బాధితులు నాటి డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగిని కలిసి బాధ చెప్పుకొన్నారు. ఆయన ఆరా తీశారు. అది అక్కడితో ఆగిపోయింది. వారి సంగతి తేలలేదు. దాంతో బాధితులంతా ఒక సంఘంగా ఏర్పడి, అధ్యక్షురాలు విజయలక్ష్మి సారధ్యంలో సోమవారం వీఎంఆర్‌డీ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. ఆ తరువాత కమిషనర్‌ కోటేశ్వరరావును కలిశారు. బిల్డర్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తమకు ఫ్లాట్లు అప్పగించేలా చూడాలని కోరారు. రెరా చట్టం పరిధిలోకి ఈ ప్రాజెక్టు రానందున, న్యాయపరంగా ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన సమాధానమిచ్చారు. జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావును పిలిచి, ఆ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని సూచించారు.


అదనపు మొత్తం డిమాండ్‌

బిల్డర్‌ ఇప్పుడు అదనపు మొత్తం డిమాండ్‌ చేస్తున్నాడని పలువురు కొనుగోలుదారులు ఆరోపించారు. ఆ ప్రాంతం అంతా పరిపాలనా రాజధాని పరిధిలోకి వచ్చిందని, రేట్లు పెరిగాయని, ఆ మేరకు తనకు అదనపు మొత్తాలు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తి చేస్తానని రాయబారాలు నడుపుతున్నాడని పలువురు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement