రెచ్చిపోతున్న.. మట్టి మాఫియా!

ABN , First Publish Date - 2020-05-24T09:44:43+05:30 IST

అధికారులు కళ్లుండీ చూడలేకపోతున్నారు.. అక్రమమని తెలిసీ ఏం చేయలేకపోతున్నారు.. ప్రభుత్వ స్థలాల పేరుతో ప్రైవేటుకు మట్టిని ..

రెచ్చిపోతున్న.. మట్టి మాఫియా!

యథేచ్ఛగా సాగుతున్న మట్టి దందా

ప్రభుత్వ స్థలాల పేరుతో ప్రైవేటుకు తరలింపు

పట్టించుకోని అధికార యంత్రాంగం


అధికారులు కళ్లుండీ చూడలేకపోతున్నారు.. అక్రమమని తెలిసీ ఏం చేయలేకపోతున్నారు.. ప్రభుత్వ స్థలాల పేరుతో ప్రైవేటుకు మట్టిని తరలిస్తున్నా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. సందట్లో సడేమియాగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఏకంగా తణుకు మండలం దువ్వ జాతీయ రహదారి పక్కనే వెంకయ్య వయ్యేరు కాలువలో మట్టిని తవ్వేస్తున్నా అడిగే నాథుడే లేడు.. కాళ్ల మండలం కోపల్లెలో  అయితే  ఊరికి చేర్చి ఉన్న చెరువునే ఖాళీ చేసేస్తున్నారు.. రాత్రికి రాత్రి ప్రైవేటు లేఅవుట్లు మట్టితో నిండిపోతున్నా పట్టించుకునే వారే లేరు.  ప్రస్తుతం ఇసుక దందాను  తల దన్నె రీతిలో జిల్లా వ్యాప్తంగా మట్టి మాఫియా సాగుతోంది. ఇకనైనా అధికారులు కళ్లు  తెరవాలి.. మట్టి మాఫియా ఆట కట్టించాలి.. 


    తణుకు రూరల్‌/ఇరగవరం/కాళ్ల, మే 23 : మట్టి  మాఫియా రెచ్చిపోతోంది.అడ్డూ అదుపూ  లేకుండా మట్టిని తరలించేస్తోంది.అయినా అధికారులు పట్టించుకోవడంలేదు.. దీంతో అక్రమ దందా మూడు పువ్వులు.. ఆరు కాయ లుగా సాగుతోంది.తణుకు,ఇరగవరం, కాళ్ల మండలాల్లో  అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వ స్థలాలకు మట్టి తరలింపు పేరుతో ప్రైవేటు స్థలాలకు తరలిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. 


ప్రభుత్వం పేరుతో ప్రైవేటుకు...

 ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాలకు మట్టి తోలకాల పేరుతో మండలాలను దాటి భారీ వాహనాల్లో మట్టిని ప్రైవేట్‌ లేఅవుట్లకు తరలిం చేస్తున్నారు.ఇరగవరం, తణుకు, కాళ్ల మండలాల్లో మట్టిని తరలిస్తున్నారు. తణుకు మండలంలో అయితే ఏకంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న దువ్వ వెంకయ్య వయ్యేరు కాలువ గట్లను రాత్రి సమయాల్లో తవ్వేసి పక్క దారి పట్టిస్తున్నారు.సుమారు 10 రోజులుగా మట్టిని తవ్వేస్తున్నా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. విచ్చలవిడిగా మట్టిని తరలించుకుపోతూ గ్రామంలో లేఅవుట్లను నింపుతున్నారు.


ఇటుక బట్టీల వద్ద గుట్టలు గుట్ట లుగా మట్టిని పోస్తున్నారు.ఇరగవరం మండలం అయిన పర్రు, కంతేరు, కాకిలేరు తదితర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఇళ్ల స్థలాలకు పూడిక చేసే పేరుతో ప్రైవేట్‌ స్ధలాలకు మట్టిని తరలిస్తున్నారు. కాళ్ల మండలం కోపల్లె, సీసలి, ఏలూరుపాడు తదితర గ్రామాల నుంచి భీమవరంలోని ప్రైవేటు లేఅవుట్లను తరలిస్తున్నారు. కోపల్లెలో అయితే అధి కార యంత్రాంగం అనుమతి లేకుండా పాత చెరువులో మట్టిని తవ్వేస్తున్నా కనీసం ప్రశ్నించే వారే లేరు.దీంతో మట్టి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది..


ఇసుకను తలదన్నేలా...

ప్రస్తుతం పెట్టుబడి లేని వ్యాపారం మట్టి వ్యాపారం.. కాస్త పలుకుబడి ఉంటే చాలు దర్జాగా అక్రమ వ్యాపారం కొనసాగించేయవచ్చు.. మట్టి వ్యాపారం కూడా అలాగే సాగుతుంది. 5 యూనిట్లు లారీకి 10 కిలోమీటర్ల లోపు అయితే రూ. 3 వేలు.. ఆ తరువాత కిలో మీటర్లను బట్టి లెక్కగడతారు. అదే ట్రాక్టర్‌ అయితే రూ. 800ల వరకూ విక్రయిస్తున్నారు. ఒక్కో లారీ, ట్రాక్టర్‌ రోజుకు సుమారు 30 ట్రిప్పులు వేస్తాయి.  దీంతో జిల్లా వ్యాప్తంగా మట్టి వ్యాపారం ప్రతీ రోజూ కోట్లలో సాగుతోంది. ప్రభుత్వ స్థలాల పూడిక పేరుతో వందలాది లారీల్లో మట్టి తరలిపోతోంది. ఉదయం   ఇళ్ల స్థలాలు పూడిక చేస్తుంటే.. రాత్రి సమయాల్లో మాత్రం మట్టి దారి తప్పుతోంది. 


కన్నెత్తి చూడని అధికారులు..

ఇరగవరం మండలంలోని పలు గ్రామాల నుంచి తణుకు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు వందలాది లారీలు మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వదిలివేస్తున్నారు. తవ్వకాలను నిలుపుదల చేయాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వందలాది లారీల్లో మట్టి తరలిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాత్రి సమయాల్లో  తవ్వకాలు కొనసాగిస్తూ లక్షలాది రూపా యలను సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మట్టి తవ్వకాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-05-24T09:44:43+05:30 IST