జ్వాలా జవాబివ్వాల్సిన ప్రశ్నలు

ABN , First Publish Date - 2021-01-13T06:30:06+05:30 IST

వనంజ్వాలా నరసింహారావు గారి వ్యాసం ‘ఉద్యోగాల కల్పవల్లి కె.సి.ఆర్‌. సర్కార్‌ ’ నిరుద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది...

జ్వాలా జవాబివ్వాల్సిన ప్రశ్నలు

వనంజ్వాలా నరసింహారావు గారి వ్యాసం ‘ఉద్యోగాల కల్పవల్లి కె.సి.ఆర్‌. సర్కార్‌ ’ (జనవరి 5, ఆంధ్రజ్యోతి) నిరుద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. గణాంకాల గారడీతో వాస్తవాలను వక్రీకరించడానికి జ్వాలా చేయని ప్రయత్నం లేదు. ఎవరి మెప్పుకోసం ఆయన ఆ వ్యాసం రాశారో అందరికీ అర్థమయింది. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాల కోసం కదా. నిన్నగాక మొన్న రవీంద్రభారతి ఆవరణలో నాగులు అనే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది, రాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది నిరుద్యోగులు బలిదానాలకు పాల్పడినది జ్వాలా లాగ తమ ఉద్యోగాల కోసం కాదు. తమలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాలనే ఆశయమే వారిని బలిదానాలకు పురికొల్పింది. జ్వాలా నరసింహారావు తమ వ్యాసంలో పేర్కొన్న విషయాలను, ఆయన ఇచ్చిన గణాంకాలను నిశితంగా పరిశీలిద్దాం.


ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసి, సింగరేణి, విద్యుత్‌, పోలీస్‌, వైద్య ఆరోగ్య, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వేతర రంగంలోని వివిధ పరిశ్రమలు, ఐటి కంపెనీలలో గత ఆరున్నర సంవత్సరాల కాలంలో జరిగిన మొత్తం నియామకాలు 21,47,946 అని జ్వాలా లెక్క తేల్చారు. ఇందులో సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 31,072, విద్యుత్‌ శాఖలో 9,289, సింగరేణిలో 13,625, యూనివర్శిటీలు, కార్పొరేషన్లలో 9,600, పోలీస్‌ శాఖలో 28,277, ఐ.టి. కంపెనీలలో 5 లక్షల 82 వేలు, కొత్తగా వచ్చిన 14,338 పరిశ్రమల్లో 14 లక్షల 59 వేల మందికి ఉద్యోగాలు లభించినట్లు జ్వాలా విపులీకరించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు మూడు ఉన్నాయి. అవి: (1) ప్రభుత్వేతర పారిశ్రామిక సంస్థలు, ఐటి కంపెనీలలోని ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు కాదు. అవన్నీ ప్రైవేటు రంగంలోనివి. (2) గత ఆరున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో నెలకొల్పిన ఐటి కంపెనీలు, ఇతర పరిశ్రమలు ఎన్ని? ఒక్కోదాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో వివరాలు ఎందుకు వెల్లడించలేదు? (3) గత ఆరున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల మూతబడ్డ వివిధ పరిశ్రమలు ఎన్ని? తద్వారా ఎంతమంది ఉపాధి కోల్పోయారో వివరించకపోవడం శోచనీయం. 


జ్వాలా లెక్క ప్రకారం సింగరేణిలో మొత్తంగా జరిగిన నియామకాలు 13,625. ఇందులో పదివేలకు పైగా నియామకాలు డిపెండెంట్‌ ఉద్యోగాలే. కొత్తగా కల్పించిన ఉద్యోగాలు మూడు వేలు కూడా లేవు. అదే విధంగా యూనివర్సిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన నియామకాలు 9600 అని పేర్కొన్నారు. మాకున్న సమాచారం ప్రకారం విశ్వవిద్యాలయాల్లోగానీ, కార్పొరేషన్లలోగానీ ఒక్క నియామకం కూడా జరగలేదు. ఇక ఆయన పేర్కొన్న విద్యుత్‌శాఖలోని ఉద్యోగాలు చాలావరకు, కొన్ని సంవత్సరాల నుంచి ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో జరిగిన నియామకాలే అన్న విషయాన్ని గమనించాలి. పోలీస్‌శాఖలోని ఉద్యోగాలలో సగానికి పైగా నియామకాలు కొంతకాలంగా హోం గార్డులుగా పనిచేస్తున్నవారికి సంబంధించినవేనన్నది నగ్నసత్యం.


వనం జ్వాలా నరసింహారావును రెండు ప్రశ్నలు అడుగదలుచుకున్నాను. అవి: (1) రాష్ట్ర విభజన పిదప ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న మన రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో జరిగిన వాస్తవ నియామకాలు ఎన్ని? లోటు బడ్జెట్‌తో మనతోపాటే ఏర్పడ్డ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియామకాలు ఎన్ని? (2) ప్రభుత్వం కొన్ని కేటగిరీల తాత్కాలిక ఉద్యోగుల జీతాలను గణనీయంగా పెంచిందంటున్నారు. ఆయా కేటగిరీల ఉద్యోగుల జీతాలు మనరాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో, పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో చెప్పాలి? పక్క రాష్ట్రంలో స్కావెంజర్‌ జీతమెంతో తెలుసుకోకుండా మాట్లాడడం ఆయనలాంటి వారికి సముచితం కాదు.


చివరగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో చూద్దాం. మన రాష్ట్రంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో వన్‌టైం రిజిస్ట్రేషన్‌ కింద నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 25 లక్షలు. వీరిలో పురుషులు 15 లక్షలు, మహిళలు 10 లక్షలు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో 25 ఏళ్ల లోపువారు 16 లక్షలు. ఈ నిరుద్యోగులలో ఇంజనీరింగ్‌ పట్టభద్రులు రమారమి 4,27,324 మంది. ఈ గణాంకాలను బట్టి రాష్ట్రంలో నిరుద్యోగం ఏ విధంగా విలయతాండవం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ శోచనీయస్థితి పాలకుల పుణ్యమే కాదూ? గత ఆరున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగం ఏ విధంగా పెరిగిందో చూడండి. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగం 2.7 శాతం కాగా, 2019 నాటికి అది 9.3 శాతానికి చేరుకుంది. డిప్లొమా చదువుకున్నవారిలో 2014లో నిరుద్యోగం 6 శాతం ఉంటే 2019 నాటికి అది 34 శాతానికి పెరిగింది. పట్టభద్రుల్లో నిరుద్యోగం 7.3 శాతం నుంచి 27.7 శాతానికి చేరుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌లో 7.3 శాతం నుంచి 31.3 శాతానికి పెరిగింది. తెలంగాణ ఆవిర్భవించాక ఆరున్నర సంవత్సరాల కాలంలో నిరుద్యోగం నాలుగురెట్లు పెరిగిందనే విషయం నిర్వివాదాంశం.


ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగుల సంఖ్య 5,23,675. ఇందులో పని చేస్తున్న సిబ్బంది 3,33,781 పోగా ఖాళీగా ఉన్న, భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య 1,89,894. వీటిలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేసింది కేవలం 31,072 మాత్రమే. భర్తీ చేయాల్సింది 1,58,822. గత ఆరున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రప్రభుత్వం పాలనా సౌలభ్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 33 జిల్లాలను, 584 మండలాలను, 126 మున్సిపాలిటీలను, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లను, 12,751 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఈ స్థానిక సంస్థల్లో ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా జరగాలంటే ఒక్కో జిల్లాకు 2000 మంది సిబ్బంది అవసరం. ఈ లెక్కన మొత్తం 60 వేల మంది సిబ్బంది అవసరమవుతారు. భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1,58,822కు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలను కలిపితే రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 2,24,822. వాస్తవాలు ఇలా ఉంటే 50వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని ఆలోచించడం గర్హనీయం కాదా? 


ఉద్యోగం అనేది వ్యక్తులలో మానసికంగా భద్రతా భావాన్ని, ఆత్వవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సమాజంలో గుర్తింపును, స్థాయిని సమకూర్చి పెడుతుంది. నిరుద్యోగం వ్యక్తులలో అభద్రతాభావాన్ని, అధైర్యాన్ని, ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని కలిగిస్తుంది. సగటు మనిషికి జీవనాధారంగా పరిణమించిన ఉద్యోగాల కోసం ప్రతి నిరుద్యోగి ప్రయత్నించడం సహజం. రాష్ట్రం ఏర్పడిన పిదప ఉద్యోగాలు వస్తాయని నిత్యం ఎదురుచూస్తున్న మాలాంటి లక్షలాది మంది నిరుద్యోగులకు మద్దతుగా దిశానిర్దేశం చేసే రచనలను వనం భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తున్నాం.

వీరమల్ల శ్రీశైలం 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌

Updated Date - 2021-01-13T06:30:06+05:30 IST