జెండా.. నీకు వందనం

ABN , First Publish Date - 2022-08-13T05:34:06+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలో త్రివర్ణ పతకాలు రెపరెపలాడుతున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు

జెండా.. నీకు వందనం

  ఇంటింటికీజాతీయ జెండాల పంపిణీ 

- శ్రీహరినగర్‌లో హరితహారం 

- మొక్కలు నాటిన మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 12: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలో త్రివర్ణ పతకాలు రెపరెపలాడుతున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. వజ్రోత్సవ వేడుకల్లో ఐదవ రోజు శుక్రవారం తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్థానిక 38వ డివిజన్‌ శ్రీహరినగర్‌ కాలనీలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, స్థానిక కార్పొరేటర్లు కచ్చు రవితో కలిసి మొక్కలు నాటి ఇంటింటికీ తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరూ చాటాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, వాటిని ఎగురవేయాలని, ఎక్కడ కూడా జాతీయ జెండాను అగౌరవ పరచకూడదని మంత్రి సూచించారు.  అలాగే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.  

 

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ : మంత్రి గంగుల 


అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీపండుగ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ మంత్రి రాఖీపౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రాఖీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌కు మహిళా కార్పొరేటర్లు, ఉద్యోగులు, మెప్మా, ఆర్‌పీలు, స్వశక్తి సంఘాల మహిళలు, టీఆర్‌ఎస్‌ నాయకురాళ్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మహిళలకు తోబుట్టువుగా నిలుస్తున్నారని అందుకు ఆయనకు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, పలువురు కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 


 మహాత్మాజ్యోతిబాపూలే స్కూల్‌లో రాఖీ వేడుకలు 


స్థానిక శర్మనగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విద్యార్థులతో కలిసి రాఖీవేడుకలను జరుపుకున్నారు. మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, స్థానిక కార్పొరేటర్‌ మెండి శ్రీలతచంద్రశేఖర్‌తో కలిసి పాఠశాలను సందర్శించిన మంత్రి గంగుల కమలాకర్‌ ముందుగా విద్యార్థులను పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయని అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వచ్చమైన తాగునీటి వసతి, స్నానాలకు వేడినీటిని అందించాలని, క్రీడామైదానం లేదని, ఇతర సమస్యలను వివరించారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం  విద్యార్థినిలు మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావుకు రాఖీలు కట్టారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీ రామారావు కటౌట్లకు రాఖీ కట్టారు. 

 

Updated Date - 2022-08-13T05:34:06+05:30 IST