తాలిబన్లు ఇంటిని తగలెట్టేశారు... ప్రాణభయంతో ఎయిర్ పోర్టుకు పరుగుతీశాం: ఐదుగురు అక్కాచెల్లెళ్ల దీనగాథ!

ABN , First Publish Date - 2021-08-22T12:59:18+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్ ఉగ్రవాద సంస్థ స్వాధీనం చేసుకున్నాక...

తాలిబన్లు ఇంటిని తగలెట్టేశారు... ప్రాణభయంతో ఎయిర్ పోర్టుకు పరుగుతీశాం: ఐదుగురు అక్కాచెల్లెళ్ల దీనగాథ!

కాబుల్: అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్ ఉగ్రవాద సంస్థ స్వాధీనం చేసుకున్నాక అక్కడి పరిస్థితులు మరింత దుర్భరంగా మారిపోయాయి. కాబుల్ ఎయిర్‌పోర్టులోని పరిస్థితులే ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ఇందులో భాగమే ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్ల దీనగాథ. 



మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఐదుగురు సోదరీమణులు హజారా సమాజానికి చెందినవారు. వీరు ఉంటున్న ప్రాంతంలోని ప్రజలను తాలిబన్లు చాలా కాలంగా వేధిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు. ఈ ఐదుగురు సోదరీమణులలో ఒకరైన 19 ఏళ్ల విద్యార్థిని ఆయీనా మాట్లాడుతూ తన నలుగురు అక్కాచెల్లెళ్లు, సోదరునితోపాటు చాలా రోజులుగా ఎయిర్ పోర్టు వద్దనే పడిగాపులు పడుతున్నామని, తాము అమెరికా వెళ్లిపోవాలనుకుంటున్నామని, ఇక్కడ తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


అయితే వీరెవరి దగ్గరా పాస్‌పోర్టు లేదు. వీసాలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వీరికి అమెరికాకు వెళ్లేందుకు అనుమతి లభించడం లేదు. అయితే ఏదో అద్భుతం జరిగి తమకు అఫ్ఘానిస్తాన్ నుంచి విముక్తి లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఇంటిని తాలిబన్లు వారం రోజుల క్రితమే తగులబెట్టేశారు. దీంతో వీరంతా నిరాశ్రయులుగా మారారు. అయితే వీరి తల్లిదండ్రులు అదే ప్రాంతంలో ఉంటూ, పిల్లలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముడు కాబుల్ ఎయిర్ పోర్టు చేరుకునేందుకు 240 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వీరి సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటున్నాడు. ఇప్పటివరకూ వీరిదగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో కాలం గడుపుతున్నారు. ఈ డబ్బులు అయిపోతే ఏం చేయాలో తెలియడంలేదని వీరు వాపోతున్నారు.

Updated Date - 2021-08-22T12:59:18+05:30 IST