మరో ఐదు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-10T11:10:29+05:30 IST

కరోనావైరస్‌ మహమ్మారి నిర్మల్‌ జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే పది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా గురువారం తాజాగా మరో ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్‌ రిపోర్టు

మరో ఐదు పాజిటివ్‌

మొత్తం 15కు చేరుకున్న సంఖ్య 

రెడ్‌జోన్‌ పరిధిలో 11 ప్రాంతాలు 

కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో ప్రత్యేక చర్యలు 

నిర్మల్‌ జిల్లాలో ఐదు రోజుల పాటు 100శాతం ప్రత్యేక లాక్‌డౌన్‌ కొనసాగింపు 

పెరుగుతున్న కాంటాక్ట్‌ కేసులు

ఎనిమిది పోలీసు పికెట్‌లు ఏర్పాటు 


నిర్మల్‌, ఏప్రిల్‌  9 (ఆంధ్రజ్యోతి)  : కరోనావైరస్‌ మహమ్మారి నిర్మల్‌ జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే పది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా గురువారం తాజాగా మరో ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్‌ రిపోర్టు కావడం మరింత ఆందోళనను రేకేత్తిస్తోంది. భైంసాకు చెందిన ఇద్దరు, చాక్‌పల్లికి చెందిన మరో ఇద్దరికి కాకుండా నిర్మల్‌లోని గుల్జార్‌ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు 15 మందికి పైగా కరోనా లక్షణాలకు గురి కాగా ఒకరు మరణించినట్లు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ వెల్లడించారు. నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు క్వారంటైన్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇందులో విదేశాలకు వెళ్ళి వచ్చిన వారే కాకుండా ఢిల్లీ మర్కజ్‌కు హాజరైన వారందరినీ అబ్జర్వేషన్‌లో ఉంచారు.


ఇదిలా ఉండగా ఇటీవలే చాక్‌పల్లి వీఆర్‌ఏకు కరోనా పాజిటివ్‌ రాగా ఆయనతో సన్నిహితంగా ఉన్న గ్రామ కార్యదర్శికి మరోవ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. అలాగే భైంసాలో ఇటీవల కరోనా పాజిౄటివ్‌ లక్షణాలు బయటపడ్డ వ్యక్తి భార్యకు అలాగే ఢిల్లీ మర్కజ్‌కు వెళ్ళిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్‌ పట్టణంలోని గుల్జార్‌ మార్కెట్‌లో ఇటీవల కరోనా లక్షణాలు బయటపడ్డ వ్యక్తి కుటుంబసభ్యులు ఒకరికి కూడా గురువారం కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. ఈ ఐదుగురిని ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడంతో నిర్మల్‌ జిల్లాను వందశాతం లాక్‌డౌన్‌గా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ వెల్లడించారు. కాగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డ కనకాపూర్‌, రాచాపూర్‌, రాయధారి, కొత్త లింగంపల్లి , చాక్‌పల్లిలతో పాటు భైంసాలోని మూడు వార్డులు, నిర్మల్‌లోని మరో మూడు వార్డులను రెడ్‌జోన్‌లుగా కలెక్టర్‌ ప్రకటించారు.


కరోనా కంటైన్‌మెంట్‌ ఏరియాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ప్రత్యేకచర్యలు తీసుకుంటోంది. కాగా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పోలీసు పికెట్‌లు ఏర్పాటు చేసి రోడ్లపై జనం తిరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే నిర్మల్‌జిల్లా కేంద్రంలో నాలుగు పెట్రోలింగ్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా చాక్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తూ కరోనాకు గురయ్యాడు. ఇప్పటికే చాలా ఇళ్లల్లో పెయింటింగ్‌ చేయడంతో ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన వీఆర్‌ఏతో పాటు గ్రామ కార్యదర్శికి సైతం కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయట పడడంతో గ్రామ పంచాయతీ , మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు, తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా మరి కొంత మంది రక్త పరీక్షల నివేదికలు వరుసగా రాబోతుండడంతో ఈ రిపోర్టులపై సర్వత్రా భయాందోళనలు నెలకొంటున్నాయి. 


కొత్తగా ఐదుగురికి పాజిటివ్‌ లక్షణాలు..

జిల్లాకు చెందిన పది మందిని కరోనా భూతం వెంటాడుతుండగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. వీరిలో నిర్మల్‌కు చెందిన వ్యక్తి అలాగే, భైంసా, చాక్‌పల్లిలకు చెందిన వ్యక్తులు ప్రైమరీ కాంటాక్ట్‌లు కాగా దీంతో పాటు భైంసా, చాక్‌పల్లిలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఇటీవలే ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. బుధవారం గల్ప్‌ దేశాలకు వెళ్లిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రిపోర్టులు రాగా తాజాగా గురువారం మాత్రం ఇద్దరు ఢిల్లీ వెళ్ళిన వారికి మరో ముగ్గురు కాంటాక్ట్‌ అయిన వారికి కరోనా సోక డం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 15 మందికి పైగా కరో నా లక్షణాలతో భాధపడుతన్నారు. ఒకరు కరోనా లక్షణాలతో మరణించగా మరొకరు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. గుండెపోటుతో మరణించిన ఇద్దరు కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. 


ఐదు రోజుల పాటు 100 శాతం ప్రత్యేక లాక్‌డౌన్‌..

కాగా నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం లాక్‌డౌక్‌ ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అలాగే కనకాపూర్‌, రాచాపూర్‌, రాయధారి, న్యూలింగంపల్లి, చాక్‌పల్లి, నిర్మల్‌, భైంసాల్లోని మూడేసీ ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. దీనికి తోడుగా లాక్‌డౌన్‌ మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు ఎనిమిది పోలీసు పికెట్‌లు, ప్రత్యేక పెట్రోలింగ్‌ పార్టీలను ఏర్పాటు చేసి జన సంచారం లేకుండా చేస్తున్నారు. దీని కోసం గాను జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తున్నారు. కంటైన్‌మెంట్‌ ఏరియాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం డేగకళ్ళతో పహారా కాస్తోంది. 


పెరుగుతున్న కాంటాక్ట్‌ కేసులు..

ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌లుగా వచ్చిన కేసుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన వారు వారి నుంచి కాంటాక్ట్‌ అయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కేవలం ముగ్గురు మాత్రమే గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణకు గురయ్యారు. కాగా మరో ఆరుగురు ఢిల్లీ మర్కజ్‌కు హాజరైన వారు కాగా వారి ద్వారా మరో ఆరుగురికి ఈ కరోనా వైరస్‌సోకడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మరో రెండు, మూడురోజుల్లో మరిన్ని రక్తపరీక్షల ఫలితాలు రానున్నందున అందరికీ దృష్టి అటువైపే నిలుస్తోంది. అధికారులు స్పష్టమైన వివరాలు అందించకపోతుండంతో పలు సందర్భాల్లో గందరగోళం నెలకొంటోంది. నిర్మల్‌, భైంసాల్లో కుటుంబ సభ్యులకు ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకినట్లు అదికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వందశాతం లాక్‌డౌన్‌ అమలుకు జిల్లా అధికార యంత్రాంగౄమంతా సిద్దమవుతోంది. 

Updated Date - 2020-04-10T11:10:29+05:30 IST