మరో ఐదుగురికి

ABN , First Publish Date - 2020-06-06T09:15:35+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. ఇటీవల వచ్చిన కేసుల్లో వలంటీర్లకు కూడా పాజిటివ్‌లు కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మరో ఐదుగురికి

వలంటీర్లకు వైరస్‌తో వణుకు

తాడేపల్లిలో 29కి చేరిన కేసులు

గుంటూరును వీడని కోయంబేడు

వినుకొండలో కరోనా కలకలం

522కు చేరువలో బాధితుల సంఖ్య


గుంటూరు(ఆంధ్రజ్యోతి)/రాజుపాలెం, తాడేపల్లి టౌన్‌, వినుకొండ టౌన్‌, బాపట్ల, జూన్‌ 5: జిల్లాలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు.  రోజురోజుకు వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. ఇటీవల వచ్చిన కేసుల్లో వలంటీర్లకు కూడా పాజిటివ్‌లు కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారికంగా నిర్ధారించారు. ఇందులో రాజుపాలెం మండలం ఇనిమెట్ల, తాడేపల్లిలో వలంటీర్లుకు పాజిటివ్‌గా నిర్ధారించారు. తాడేపల్లిలో అధికారికంగా నలుగురికని ప్రకటించగా మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. శుక్రవారం కొత్తగా నమోదైన ఐదు కేసులతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 522కి చేరింది. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన ఓ వలంటీరుకు పాజిటివ్‌ అని నిర్ధారణ కావటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అతడు ఎవరెవరిని కలిశాడు  ఇతడు 120 మందిని ప్రైమరీ కాంటాక్టు కింద కలిసినట్లు ఎస్‌ఐ వెంకట ప్రసాద్‌ గుర్తించారు. వారి నుంచి శనివారం రక్తనమూనాలు సేకరించనున్నారు. అతడు నివాస ప్రాంతంలోని వీధిలోకి ప్రవేశం లేకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి మహంకాళమ్మ ప్రత్యేక పారిశుధ్య చర్యలను ముమ్మరం చేశారు.  


తాడేపల్లిలో మహానాడు ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చిన వార్డు వలంటీరుకు సంబంధించి ప్రైమరీ కాంటాక్టులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు బంధువులు, ఎదురు ఇంట్లోని ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. సుందరయ్యనగర్‌ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వృద్ధుడికి పాజిటివ్‌ కూడా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇతడికి వైరస్‌ ఎలా వచ్చింది అనేది నిర్ధారించలేదు. ఇప్పటి వరకు వచ్చిన కేసులతో తాడేపల్లిలో బాధితుల సంఖ్య 29కి చేరింది. తాడేపల్లి మహానాడు ప్రాంతంలో అధికారులు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. 13వ రోడ్డులో స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని, నిత్యావసరాలు పంపిణీ చేస్తామని కమిషనరు రవిచంద్రారెడ్డి తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్బన్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు, సీఐ అంకమ్మరావు తదితరులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.


వినుకొండలో శుక్రవారం కరోనా కలకలం రేగింది. స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పని చేసే స్టాంప్‌ రైటర్‌ ప్రతి రోజూ గుంటూరు నుంచి వస్తుంటారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కారులో వినుకొండకు రాగా ఆ కారు డ్రైవరుకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ కారు డ్రైవరును విచారించగా కాంటాక్ట్‌ కింద స్టాంప్‌ రైటర్‌ పేరు చెప్పినట్లు తెలిసింది. దీంతో స్టాంప్‌రైటర్‌ను టెస్ట్‌ల నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు.


బాపట్ల నరాలశెట్టివారిపాలెం, బేతనీకాలనీలలో ముగ్గురికి పాజిటివ్‌ రావటంతో వారి ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న 202 మందికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. నరాలశెట్టివారిపాలెంలో 58మందికి డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ సిద్దార్ద, బేతనీకాలనీలో 120మందికి డాక్టర్‌ చల్లా రామ్మోహనరావు, డాక్టర్‌ ఈశ్వర్‌, డాక్టర్‌ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో 24మందికి డాక్టర్‌ చరణ్‌రాయ్‌ సిబ్బందితో కలిసి వి.ఆర్‌.డిఎల్‌ పరీక్షలు చేశారు. 


Updated Date - 2020-06-06T09:15:35+05:30 IST