కరోనాను జయించిన ఐదు నెలల బాబు.. బ్రెజిల్‌లో..

ABN , First Publish Date - 2020-06-01T09:57:00+05:30 IST

బ్రెజిల్‌లో ఐదు నెలల బాబు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి

కరోనాను జయించిన ఐదు నెలల బాబు.. బ్రెజిల్‌లో..

సావోపావో: బ్రెజిల్‌లో ఐదు నెలల బాబు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నెల రోజుల పాటు కోమాలో చికిత్స పొందుతూ వచ్చిన డామ్ అనే బాబు ఎట్టకేలకు కరోనాను జయించాడు. రియో డీ జనైరోలోని ప్రోకార్డియాకో ఆసుపత్రిలో డామ్‌కు చికిత్స అందించారు. ఆసుపత్రిలో డామ్ మొత్తంగా 54 రోజుల పాటు చికిత్స పొందగా.. అందులో 32 రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు. నెలల వయసున్న తన కొడుకుకు నెల రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించినట్టు డామ్ తండ్రి వాగ్నర్ ఆండ్రేడ్ చెప్పారు. తన కొడుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే.. మొదట బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ అనుకున్నామని వాగ్నర్ తెలిపారు. అయితే మెడికేషన్ పనిచేయకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లామని.. అక్కడ డామ్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. తన కొడుకుకు కరోనా ఎలా సోకిందో తెలియదని.. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు సోకినట్టు అనుమానిస్తున్నామన్నారు. తమ కొడుకు కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం ఆనందంగా ఉందని డామ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. డామ్‌కు జూన్ 14తో ఆరు నెలలు నిండుతాయని.. ఈ సందర్భంగా ఆరు నెలల పుట్టినరోజును జరపనున్నట్టు వాగ్నర్ తెలిపారు. కాగా.. ఆరోగ్యశాఖకు చెందిన డేటా ప్రకారం బ్రెజిల్‌లో ఇప్పటివరకు 12 నెలల వయసులోపు ఉన్న 25 మంది చిన్నారులు కరోనా బారిన పడి మరణించారు. 

Updated Date - 2020-06-01T09:57:00+05:30 IST