Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : సినీ ఇండస్ట్రీలో మేనేజర్‌గా వర్క్.. రియల్‌ లైఫ్‌లో భారీ స్కెచ్.. సీన్ మొత్తం రివర్స్ అవ్వడంతో...!

  • సినీ ఫక్కీలో ఐదు లక్షలు దోపిడీ
  • ఐదుగురి అరెస్టు.. నగదు, 
  • నకిలీ రెండువేల నోట్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : సినీఫక్కీలో మోసాలకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు కొల్లగొడుతున్న  ముఠా ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. ఏడుగురు సభ్యులున్న ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.3లక్షల నగదు, కారు, రూ. కోటి డమ్మీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన మహ్మద్‌ అజీజ్‌, జనగం భాగ్యలక్ష్మి, రవీందర్‌, రాజేష్‌, పెద్దపల్లి జిల్లాకు చెందిన మహ్మద్‌ అన్వర్‌ పాషా, సనత్‌నగర్‌కు చెందిన తడుక సుభాష్‌ చంద్రబోస్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన మర్రి నాగరాజు హైదరాబాద్‌లో ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. షూటింగ్‌లో ఉపయోగించే డమ్మీ రూ. 2వేల నోట్లు ప్రింట్‌ చేయించాడు.

సినిమా స్కెచ్‌తో..

డబ్బున్న బడా బాబులను దోచుకోవాలని పధకం వేసిన మహ్మద్‌ అజీజ్‌.. ఆ విషయాన్ని తన మిత్రులకు చెప్పాడు. చెక్‌మేట్‌ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన అన్వర్‌ పాషా, ప్రొడక్షన్‌ మేనేజర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, గతంలో దొంగతనం కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన నాగరాజు కలిసి ఒక స్ర్కిప్టు రెడీ చేశారు. వారి ముఠాలో ఉన్న భాగ్యలక్ష్మిని కరీంనగర్‌కు చెందిన వ్యాపారి నర్రెడ్డి రాజిరెడ్డి వద్దకు పంపారు. హైదరాబాద్‌లో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి చెందిన బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చుకునేందుకు రూ.లక్షకు ఐదు లక్షలిస్తాడని నమ్మిబలికింది. ఆయనను నమ్మించడానికి నకిలీ కరెన్సీ వీడియోలు చూపించింది.

పోలీసులమంటూ దాడి చేయించి..

భాగ్యలక్ష్మి మాటలు నమ్మిన రాజిరెడ్డి సెప్టెంబర్‌ 2న తన ఇంట్లో ఉన్న రూ. 5లక్షలు తీసుకొని హైదరాబాద్‌కు బయల్దేరాడు. మహ్మద్‌ అజీజ్‌ బృందం కారులో శామీర్‌రేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఆగి, రాజిరెడ్డిని మాత్రమే కారులో ఎక్కించుకుని మార్గ మధ్యలో కొన్ని సైట్లు చూపించి.. అవి వారి రియల్‌ఎస్టేట్‌ సైట్లే అని నమ్మించారు. కీసర పరిధిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చారు. రాజిరెడ్డి వద్ద ఉన్న రూ. 5 లక్షలు తీసుకొని, వారి వద్ద ఉన్న రూ. 25లక్షలు ఇచ్చే క్రమంలో.. ముందస్తు స్కెచ్‌లో భాగంగా ముఠాలోని నిందితుడు నాగరాజు, మరో ఇద్దరితో కలిసి పోలీస్‌ డ్రెస్‌లో అక్కడికి చేరుకున్నాడు. 


బ్లాక్‌మనీ ఎక్ఛ్సేంజ్‌ దందా నిర్వహిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేస్తున్నామని బెదిరించి అజీజ్‌ను అదుపులోకి తీసుకున్నాడు. తనకు ముఠాతో ఎలాంటి సంబంధం లేదని రాజిరెడ్డి చెప్పడంతో అతడిని వదిలేసి రూ. 5 లక్షలతో అజీజ్‌ను తీసుకొని వెళ్లిపోయారు. రాజిరెడ్డి కీసర పోలీసులకు ఫిర్యాదు చేయగా డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శివకుమార్‌, పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ రంగంలోకి దిగారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకొని నిందితుల ఆటకట్టించారు. ముఠాలోని నలుగురిని అరెస్ట్‌ చేయగా రవీందర్‌, రాజేష్‌ పరారీలో ఉన్నారు.   

Advertisement
Advertisement