మింగిన మృత్యుబావి

ABN , First Publish Date - 2020-08-03T10:25:23+05:30 IST

అప్పటి వరకు ఆడుతూపాడుతూ పనిచేశారు. తోటికూలీలతో కలిసి నాటు వేశారు. మధ్యాహ్నసమయం అయింది. భోజనం చేయాలనుకున్నారు.

మింగిన మృత్యుబావి

జారిపడిన ఐదుగురు కూలీలు

కాళ్లుకడుక్కునేందుకు వెళ్లగా కుంగిన మెట్టు

ఇద్దరు మహిళళు మృతి.. 

ముగ్గురిని కాపాడిన తోటికూలీ 

ఖమ్మం జిల్లా కొణిజర్లలో విషాదం


కొణిజర్ల, అగస్టు 2 : అప్పటి వరకు ఆడుతూపాడుతూ పనిచేశారు. తోటికూలీలతో కలిసి నాటు వేశారు. మధ్యాహ్నసమయం అయింది. భోజనం చేయాలనుకున్నారు. కాళ్లు, చేతులు కడుక్కునేందుకు పొలం పక్కన ఉన్న వ్యవసాయబావి వద్దకు వెళ్లారు. అంతలోనే అనుకోని సంఘటన. బావికి కట్టిన మెట్టు ఉర్లింది. ఐదుగురు కూలీలు ఆ బావిలో పడ్డారు. వారిలో ముగ్గురిని తోటి కూలీ రక్షించగా.. ఇద్దరిని మాత్రం విధి మృత్యువై మింగేసింది. ఈ విషాద సంఘటన ఆదివారం కొణిజర్ల మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, ఎస్‌ఐ మొగిలి తెలిపిన వివరాలు ప్రకారం కొణిజర్లకు చెందిన తొమ్మిది మంది మహిళా కూలీలు అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు పొలంలో వరినాటు వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు వారంతా పక్కనే ఉన్న మరో రైతు పొలంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. వారిలో ఐదుగురు.. కూలీలు బండారు మల్లిక, తుప్పతి రమాదేవి, చింతల మమత, తద్దె నాగమణి, తద్దె మౌనిక బావి మెట్టుపై వరుసగా నిల్చుని కాళ్లు,చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఆ సమయంలోనే వారు నిలబడిన మెట్టుకాస్తా ఉర్లి పడింది. దాంతో ఆ ఐదుగురు బావిలో పడ్డారు.


దాంతో వారు కేకలు వేయడం ప్రారంభించగా ఒడ్డున నిలుచుని ఉన్న తోటి కూలీ చింతల ఎల్లమ్మ తన చీరను, కండువాను బావిలోకి విసరగా.. వాటిని పట్టుకొని మమత, నాగమణి, మౌనిక బయటకు వచ్చారు. బండారు మల్లిక(30), తుప్పతి రమాదేవి(35) మాత్రం నిటమునిగారు. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అప్పటికే వారు మృతిచెందడంతో తోటికూలీలు, కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ మొగిలి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. మల్లికకు భర్త భాస్కర్‌రావు, కుమార్తెలు జస్మిత, దివ్య ఉన్నారు. రమాదేవికి భర్త తుప్పతి నరసింహరావు, కుమారుడు మధు, కూతురు మౌనిక ఉన్నారు. తెల్లవారితే రాఖీపౌర్ణమి, ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో మాయదారి బావి విషాదాన్ని మిగిల్చిందని మృతుల కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సర్పంచ్‌ సూరంపల్లి రమారావు తోటి కూలీలను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.


ముగ్గురిని కాపాడిన ఎల్లమ్మ..

కళ్లు బయర్లుకమ్మే సంఘటన జరిగినప్పుడు ఎవరైనా ఆందోళనకు గురవుతారు. ఏం చేయాలో అర్థం కాక పరుగు తీస్తారు. కానీ చింతల ఎల్లమ్మ మాత్రం ఆ పని చేయలేదు. తన ధైర్యం, ఆలోచనతో ముగ్గురిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంది. అప్పటి వరకు తనతో కలిసి పని చేసిన తన వాళ్లు కళ్ల ఎదుటే నీట మునిగిపోతుంటే ఏంచేయాలో అర్థం కాలేదు ఆమెకు. మొదట అందరిలాగే కంగారు పడింది. వారిని కాపాడేందుకు ఎవరైనా ఉన్నారేమోనని కేకలు వేసింది. కానీ ముంచేస్తున్న ప్రమాదాన్ని పసిగట్టింది. అంతే భయాన్ని కాస్తా ధైర్యంగా మలుచుకుని గుండె నిండా నింపుకొంది. తన వారు ప్రమాదంలో ఉన్నారంటూ బిగ్గరగా ఏడుస్తూనే తన చీరను, కండువాను నీటిలోకి విసిరి ముగ్గురిని కాపాడింది. దీంతో ఆమె ధైర్య సాహసాలను స్థానికులు మెచ్చుకున్నారు. అయితే తాను ముగ్గురిని కాపాడానని, మరో ఇద్దరి కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఎల్లమ్మ కన్నీరుమున్నీరవడం అందరినీ కలిచివేసింది. 

Updated Date - 2020-08-03T10:25:23+05:30 IST