money: మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడుతున్నారా?.. అయితే మీకింకా 30 రోజులే గడువు..

ABN , First Publish Date - 2022-09-02T00:20:27+05:30 IST

మనిషి జీవితం డబ్బుతో ముడిపడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే దాకా అత్యధికం ఆర్థిక సంబంధ విషయాలే.

money: మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడుతున్నారా?.. అయితే మీకింకా 30 రోజులే గడువు..

ముంబై : మనిషి జీవితం డబ్బుతో ముడిపడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే దాకా అత్యధికం ఆర్థిక సంబంధ విషయాలే. అయితే మనిషి జీవితాన్ని ఇంతలా ప్రభావితం చేసే ఆర్థిక అంశాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇలా సెప్టెంబర్‌లో కూడా పలు కీలక మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు ఏమిటి?.. మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఓ లుక్కేయండి..


అక్టోబర్ 1 నుంచి టోకేనైజేషన్ విధానం..

డెబిట్ (Debit), క్రెడిట్ (Credit) కార్డుల చెల్లింపులను మరింత సురక్షితం చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ ప్రతిపాదించిన టోకెనైజేషన్ విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. వాస్తవానికి జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా వినతుల దృష్ట్యా సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. గడువులోగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వినియోగదారులు టోకెనైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు మరింత సురక్షితంగా ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు.  ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే వినియోగదారులు తరచుగా ఉపయోగించే ఈ-కామర్స్‌ సైట్లు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో తమ కార్డు వివరాలు స్టోర్‌ చేస్తుంటారు. తద్వారా ఆ వైబ్‌సైట్‌ లేదా కంపెనీ సర్వర్‌లో కస్టమర్‌ కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ ఆ సర్వర్‌ హ్యాకింగ్‌కు గురైతే ఆ కార్డు వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచివుంది. టోకనైజ్డ్‌ సర్వీసుల ద్వారా ఈ తరహా ముప్పును తప్పించుకునే వీలుంటుంది. ఎందుకంటే, కార్డు జారీ చేసిన కంపెనీ మాత్రమే టోకెన్‌ను డీక్రిప్ట్‌ చేయగలదు. ఈ విధానంలో ముందుగా కస్టమరు కార్డు వివరాల టోకెన్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడి కార్డు, టోకెన్‌ కోసం అభ్యర్థించిన సంస్థ, డివైజ్‌(కార్డు ఉపయోగించిన డివైజ్) ఆధారంగా కార్డు కంపెనీ కొత్త టోకెన్‌ను జారీ చేస్తుంది. ఈ టోకెన్‌లోనే కార్డు వివరాలు ఎన్‌క్రిప్ట్‌ చేసి ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఒక టోకెన్‌తో ఈ-కామర్స్‌ సైట్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌ లాంటి ఒక ప్లాట్‌ఫామ్స్‌పై పలుమార్లు చెల్లింపులు జరిపే వీలుంటుంది.


డెబిట్ కార్డు జారీ, వార్షిక ఫీజులు పెంపు

డెబిట్ కార్డు జారీ, వార్షిక ఛార్జీలను సెప్టెంబర్ 1 నుంచి పెంచుతున్నట్టు పలు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. కార్డులు, ఇతర ఇన్‌పుట్స్‌లో ఉపయోగించే సెమికండక్టర్ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఛార్జీలు పెంపుతున్నట్టు కారణాన్ని తెలిపాయి. ఉదాహరణగా తీసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) వేర్వేరు డెబిట్ కార్డులపై ఫీజుల పెంపు సెప్టెంబర్ 6 నుంచి అమల్లోకి రానుంది. రూపే క్లాసిక్ డెబిట్ కార్డు జారీ ఫీజు రూ.50, రెండో ఏడాది నుంచి వార్షిక ఛార్జీ రూ.150గా ఉండనుందని తెలిపింది. మరోవైపు యస్ బ్యాంక్ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది.


వారికి ఇంకా 30 రోజులే గడువు

ఆదాయ పన్ను చెల్లింపుదార్లు ఐటీఆర్(ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్)లో తాము పొందుపరచిన సమాచారం సరైనదేనని నిర్ధారించే ముందు దానిని ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఆదాయ పన్ను చట్టం -1961 కింద వేరిఫికేషన్‌కు మొత్తం 90 రోజుల గడువు ఉంటుంది. అయితే ఈ ఏడాది మరో 30 రోజులే గడువుంది. అంటే ఈ నెలాఖరు కల్లా ఐటీఆర్‌ను వేరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆగస్టు 1, 2022 తర్వాత ఫైలింగ్ చేసే రిటర్నుల వేరిఫికేషన్ గడువు కేవలం 30 రోజులే. అంటే ఆగస్టు 8న ఐటీఆర్ ఫైల్ చేసినవాళ్లు సెప్టెంబర్ 7లోపే ధృవీకరించాల్సి ఉంటుంది. వేరిఫికేషన్ చేయకుంటే ఆదాయ పన్ను విభాగం పరిగణలోకి తీసుకోదు.


అటల్ పెన్షన్ యోజనకు లాస్ట్ ఛాన్స్..

అవ్యవస్థీకృత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో కనీసం రూ.1000 - రూ.5000 పెన్షన్‌ జారీకి ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజనను 2015లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 18 - 40 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పథకంలో ఈ ఏడాది చేరేందుకు తుది గడువు సెప్టెంబర్ 30, 2022తో ముగుస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. అల్పాదాయ వర్గాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-02T00:20:27+05:30 IST