dating పేరిట పురుషులపై వల...కిలాడీ లేడీల అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-27T13:41:19+05:30 IST

డేటింగ్ పేరిట పురుషులపై వలపన్ని తప్పుడు అత్యాచారం కేసులు పెడతామని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న లేడీకిలాడీల ఆటను ఢిల్లీ పోలీసులు కట్టించారు....

dating పేరిట పురుషులపై వల...కిలాడీ లేడీల అరెస్ట్

న్యూఢిల్లీ: డేటింగ్ పేరిట పురుషులపై వలపన్ని తప్పుడు అత్యాచారం కేసులు పెడతామని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న లేడీకిలాడీల ఆటను ఢిల్లీ పోలీసులు కట్టించారు. సినీ ఫక్కీలో సాగిన ఈ డేటింగ్ రాకెట్ బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సంచలనం రేపింది.కొందరు లేడీ కిలాడీలు ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా యువకులతో స్నేహం చేసి, వారిని ఒక ఇంటికి రప్పించారు. అక్కడ వారు వచ్చిన వ్యక్తికి మత్తుమందు ఇచ్చి, ముఠాలోని మహిళలతో అతని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలను క్లిక్ చేశారు. అనంతరం వారిపై బూటకపు అత్యాచారం కేసులు పెడతామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేశారు. 


42 ఏళ్ల మహిళ నేతృత్వంలోని లేడీ కిలాడీల ముఠాలో ఆమెతో పాటు ఆమె నలుగురు సహచరులను అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి తాము కొన్ని పోలీసు ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. గత రెండేళ్లలో దాదాపు 40 మంది పురుషుల నుంచి విలువైన వస్తువులను తాము తీసుకున్నామని లేడీ కిలాడీల ముఠా సభ్యులు అంగీకరించారు. తాము 34 మంది బాధితుల వివరాలతో కూడిన డైరీని, నేరాన్ని అంగీకరిస్తూ వారి రాతపూర్వక ప్రకటన, సంతకం చేసిన రాజీ ఒప్పందాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. డబ్రీలో కలప వ్యాపారం చేసే ఒక వ్యాపారవేత్తకు ఒక నెల క్రితం ప్లై బోర్డు కావాలని పూజ అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. అక్టోబర్ 21న అతను జనక్‌పురి ప్రాంతంలో ఉండగా పూజ అనే మహిళ అతనికి వాట్సాప్‌లో కాల్ చేసి ఐదు నిమిషాల తర్వాత కలిసింది. పూజ అతన్ని ఒక ఇంటికి రప్పించి, తాగడానికి ఒక గ్లాసు మంచినీరు ఇచ్చింది. ఆ తర్వాత అతను స్పృహతప్పి పడిపోయాడు. వ్యాపారవేత్త స్పృహలోకి వచ్చినప్పుడు నగ్నంగా మంచం మీద ఉన్నాడు. 


అక్కడ ఉన్న ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతనిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న 15,700రూపాయల నగదు, అతని చేతి గడియారం, బంగారు ఉంగరం లాక్కున్నారు. రూ.7 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారని వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుపై  కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) శంకర్ చౌదరి తెలిపారు.విచారణలో పోలీసులకు కిలాడీ లేడీల గ్యాంగ్ గురించి సమాచారం అందింది.ఈ గ్యాంగ్ సూత్రధారిణిగా శివాని అలియాస్ సోను సూరిని అరెస్టు చేశారు. పోలీసులు శివానీతోపాటు ఆమె నలుగురు సహచరులను అరెస్టు చేశారు.


పోలీసులు నిందితులైన జీవన్ పార్క్ నివాసితులు రేవ్తీ దేవి (33), ఆమె భర్త వైభవ్ (37), బురారీ నివాసి శీతల్ అరోరా అలియాస్ పూజ (40),  ఠాగూర్ గార్డెన్ నివాసి హర్బిందర్ సింగ్ (60)లను ఇంటరాగేట్ చేస్తున్నారు. శివానీని విచారించగా ఆమె ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించి టార్గెట్ల మొబైల్ నంబర్‌లను పొందేదని డీసీపీ తెలిపారు. ఆమె అరోరాకు వారి మొబైల్ నంబర్‌లను అందజేస్తూ ఉండేది. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తిని రేవ్తి నివాసానికి ఆహ్వానించింది.బూటకపు అత్యాచారం అభియోగాన్ని నమోదు చేస్తామని భయపెట్టి కిలాడీ లేడీలు బాధిత పురుషుల నుంచి డబ్బు వసూలు చేశారని డీసీపీ చౌదరి చెప్పారు.బాధితులను మోసం చేయడంలో ముఠా నాటకాలు ఆడిందని, ప్రతి ముఠా సభ్యునికి నిర్దిష్ట పాత్రలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-10-27T13:41:19+05:30 IST