కృతజ్ఞత చెల్లిద్దాం!

ABN , First Publish Date - 2020-05-22T05:30:00+05:30 IST

పవిత్రమైన రంజాన్‌ మాసం పూర్తి కానుంది. ముస్లిమ్‌లు భక్తి శ్రద్ధలతో పాటిస్తున్న ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. లాక్‌డౌన్‌ వేళ ఎంతో సంయమనంతో ఇంటిపట్టునే ఉంటూ దీక్షలను పాటిస్తున్న విశ్వాసులు ఫిత్రా దానాలతో...

కృతజ్ఞత చెల్లిద్దాం!

పవిత్రమైన రంజాన్‌ మాసం పూర్తి కానుంది. ముస్లిమ్‌లు భక్తి శ్రద్ధలతో పాటిస్తున్న ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. లాక్‌డౌన్‌ వేళ ఎంతో సంయమనంతో ఇంటిపట్టునే ఉంటూ దీక్షలను పాటిస్తున్న విశ్వాసులు ఫిత్రా దానాలతో దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఆర్తులకు పండుగ సంబరాల్లో భాగస్వామ్యం కల్పించాలి. అన్నార్తులు, ఆపన్నులు ఎక్కువైపోయిన ఈ కరోనా కల్లోల సమయంలో మతం, వర్గం లాంటి పరిమితులకు అతీతంగా, అవసరం ఉన్న వారికి వీలైనంత విరివిగా ‘ఫిత్రా’ దానాలు చేద్దాం. ఇది ‘దైవ సంకల్పం’గా భావిద్దాం.


ఏ పండుగ అయినా, ఏ ఉత్సవం అయినా ఆయా జాతులు, తెగల సభ్యతా సంస్కృతులనూ, వారి జీవన విధానాన్నీ ప్రతిబింబిస్తాయి. ఇస్లామ్‌ ధర్మం పాటించే పండుగల్లోని మౌలిక అంశాలు రెండు విషయాల మీద ఆధారపడి ఉన్నాయి. మొదటిది: దైవం ప్రసాదించిన వాటి మీద ఆధారపడిన మానవులు ఆయన అందించిన ఎనలేని వరాలకు కృతజ్ఞతలను చెల్లించుకోవడం! దైవం ఔన్నత్యాన్ని కొనియాడడం! రెండోది: పండుగ శుభ సందర్భంలో- సమాజంలోని నిరుపేదలు, ఆర్తులు, అనాథలు, వితంతువులకు సంబరాల్లో భాగస్వామ్యం కల్పించడం! ఇలా పండుగలు జరుపుకొంటున్నప్పుడు ఒకవైపు దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, మరొక వైపు ఆపన్నులైన వారి పట్ల సానుభూతి చూపించమని ఇస్లామ్‌ ఆదేశిస్తోంది. ‘ఈద్‌-ఉల్‌-జుహా’ నాడు ఖుర్బానీ ద్వారా పేదలకు సాయపడాలని చెబుతోంది. అలాగే ముస్లిమ్‌ల ప్రధాన పండుగ అయిన ‘ఈద్‌-ఉల్‌-ఫిత్ర్‌’ (రంజాన్‌) నాడు ఫిత్రా దానం ద్వారా పేదలను ఆదుకోవాలని సూచిస్తోంది.


ఫిత్రా అంటే?

‘ఫిత్ర్‌’ అంటే ‘ఉపవాసాలను పూర్తి చేయడం/ విరమించడం’ అని అర్థం. ‘సదఖాయె ఫిత్ర్‌’ అంటే రంజాన్‌ నెల చివర రోజాలు (ఉపవాసాలు) పూర్తయిన తరువాత పేదలకు విధిగా ఇవ్వాల్సిన దానం. సదాఖయే ఫిత్ర్‌ ముఖ్య ఉద్దేశాలు - రెండు. ఉపవాస సమయంలో ఎంత జాగ్రత్తగా మసలుకున్నా తెలిసో, తెలియకో పొరపాట్లు జరుగుతాయి. మనిషి తన సంపద నుంచి కొంత మొత్తాన్ని దైవమార్గంలో ఖర్చు చేస్తే, అతని వల్ల జరిగిన పొరపాట్ల క్షమాపణకు అది దోహదపడుతుంది. రెండోది, అందరూ పండుగ సంబరాల్లో మునిగి ఉన్నప్పుడు- సమాజంలో కడుపు నిండా తిండి, ఒంటి నిండా దుస్తులూ లేని నిరుపేదలు, అనాథలు, అవసరంలో ఉన్నవారు కూడా పండుగ పూట సంతోషంగా ఉండాలి. 


‘‘ముస్లిమ్‌ సమాజానికి ‘ఫిత్రా’ను విధిగా (వాజిబ్‌) నిర్ణయించడం జరిగింది. ఇది ఉపవాస కాలంలో వారు చేసిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా పరిగణన పొందుతుంది. తద్వారా బీదలకూ, అనాథలకూ భోజన సదుపాయం కలుగుతుంది. ఎవరైతే పండుగ నమాజ్‌ కన్నా ముందు దీన్ని చెల్లిస్తారో దాన్ని ఎంతో గొప్ప ఫిత్రా దానంగా అల్లాహ్‌ స్వీకరిస్తాడు. పండుగ నమాజ్‌ తరువాత చెల్లించినదాన్ని మామూలు దానంగా స్వీకరిస్తాడు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ స్పష్టంచేశారు.


ఎవరు చెల్లించాలి?

  1. ఆర్థిక స్థోమత కలిగిన పురుషులు విధిగా ‘ఫిత్రా’ చెల్లించాలి. 
  2. యుక్త వయసుకు చేరని సంతానం తరఫున తండ్రి ‘ఫిత్రా’ను చెల్లించాలి.
  3. యుక్త వయసుకు వచ్చిన సంతానం ఆర్థిక స్థోమత కలిగినవారైతే, వారి ‘ఫిత్రా’ను వారే చెల్లించాలి. లేకపోతే వారి తరఫున తండ్రే ఇవ్వాలి.
  4. తండ్రి మరణిస్తే, అతని సంతానం ‘ఫిత్రా’ చెల్లించలేని పక్షంలో, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత వారి తాతపై ఉంటుంది.


ఎంత ఇవ్వాలి? 

తినే వస్తువుల నుంచి ఒక ‘సా’ పరిమాణాన్ని ‘ఫిత్రా’ దానంగా ఇవ్వాలి. ‘సా’ అంటే రెండున్నర కిలోలు.


ఎవరికి, దేని కోసం?

  1. అవసరంలో ఉన్నవారికీ, నిరుపేదలకూ, బాటసారులకూ, జకాత్‌ వసూలుకు నియమితులైనవారికీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికీ ఇవ్వాలి
  2. బానిసలను విముక్తి చేయడం కోసం, ఋణగ్రస్థులను ఋణ విముక్తులను చేయడం కోసం, దైవ మార్గంలో ఖర్చు చేయడం కోసం ‘ఫిత్రా’ ఇవ్వాలి.
  3. ఒక వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మందికి ‘ఫిత్రా’ ఇవ్వవచ్చు. అలాగే కొందరు వ్యక్తులు తమ ‘ఫిత్రా’లను కలిపి, ఒకరికైనా, ఎక్కువమందికైనా ఇవ్వవచ్చు.
  4. ‘ఫిత్రా’ దానం ఈద్‌ నమాజ్‌ కన్నా ముందే పేదలకు ఇవ్వాలి. ‘ఈద్‌’కు రెండు, మూడు రోజుల ముందే ఇస్తే అందుకున్న వారి అవసరాలకు పనికి వస్తాయి. 
  5. రంజాన్‌ ‘రోజా’లు (ఉపవాసాలు) పాటించనివారు కూడా ‘ఫిత్రా’ దానం ఇవ్వాలి. 
  6. ‘ఫిత్రా’ చెల్లించనంతవరకూ రంజాన్‌ ఉపవాసాలు దైవ సన్నిధికి చేరవు. భూమ్యాకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి. కాబట్టి ఉపవాసాలను దైవం స్వీకరించాలంటే ‘ఫిత్రా’ దానం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు.


-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST