30% ఫిట్‌మెంట్‌ పెన్షన్లు ఇచ్చేదెన్నడు?

ABN , First Publish Date - 2021-10-14T08:54:18+05:30 IST

ఉద్యోగు లు, పింఛన్‌దారులకు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. మార్చిలో ..

30% ఫిట్‌మెంట్‌ పెన్షన్లు ఇచ్చేదెన్నడు?

  • 2018 జూలై 1 తర్వాత రిటైరైనవారికి ఇబ్బందులు
  • ఏజీ ఆఫీసు నుంచి వెలువడని ప్రొసీడింగ్స్‌
  • ప్రభుత్వమే జాప్యం చేస్తోందన్న ఆరోపణలు
  • 2018 జూలై 1కు ముందు 
  • రిటైరైన వారికి మానిటరీ బెనిఫిట్స్‌ పెండింగ్‌
  • ఉద్యోగులు, పెన్షనర్లకు అందని 3 డీఏలు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, పింఛన్‌దారులకు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. మార్చిలో ప్రకటించిన ఈ ఫిట్‌మెంట్‌కు సంబంధించి జూన్‌ 11న ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, 4 నెలలు గడిచినా పింఛనుదారులకు ఫిట్‌మెంట్‌ అమలు కాకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం కావాలనే నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు. ప్రొసీడింగ్స్‌ వెలువడకుండా అకౌంటెంట్‌ జనరల్‌(ఏజీ) కా ర్యాలయ అధికారులను ప్రభావితం చేస్తోందని విమర్శిస్తున్నారు. పదవీ విరమణ పొంది, ప్రశాంత జీవనం గడపాల్సిన పరిస్థితుల్లో పెన్షన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు, ఏజీ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించి, విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించడం లేదని వాపోతున్నారు.


ఒక్కొక్కరికీ రూ.10 వేల వరకు బకాయిలు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన మొట్టమొదటి పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ).. ఉద్యోగులు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసుచేసింది. కానీ, సీఎం కేసీఆర్‌ 30 శాతం ప్రకటించారు. 1.7.2018 నుంచి నోషనల్‌ బెనిఫిట్స్‌, 1.4.2020 నుంచి మానిటరీ బెనిఫిట్స్‌, 1.7.2021 నుంచి క్యాష్‌ బెనిఫిట్స్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జూలై నుంచి 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాలు అమలవుతున్నాయి. 2018 జూలై 1 కంటే ముందు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా ఈ ఫిట్‌మెంట్‌తో కూడిన పింఛన్లు అందుతున్నాయి. 2018 జూలై 1 త ర్వాత పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు మాత్రం అమలు కావడం లేదు.


ఇలాంటివారు రాష్ట్రంలో దాదా పు 20 వేల మంది వరకు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి. పెరిగిన ఫిట్‌మెంట్‌ ప్రకారం ఒక్కొక్కరికి రూ.10 వేల వరకు బకాయి సొమ్ము రావాల్సి ఉం ది. 30 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలంటూ పెన్షనర్ల సంఘం నేతలు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు, ఏజీ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకుందామంటే ఆ పరిస్థితి లేదని, ఉన్నతాధికారులూ స్పందించడం లేదని పెన్షనర్ల సంఘం నేత లు ఆరోపిస్తున్నారు.


ఇదీ అసలు సంగతి!

30 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పెన్షన్లకు అర్హులైన వారి జాబితాను ఏజీ కార్యాలయం ఖరారు చేయాల్సి ఉంది. అర్హుల వివరాలను వెల్లడించినప్పటికీ ప్రొసీడింగ్స్‌ను జారీ చేయడం లేదని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం నుంచి ఏజీ ఆఫీసుపై పెరుగుతున్న ఒత్తిడేనని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వా న్ని నిధుల కొతర వేధిస్తోందని, అందుకే ప్రొసీడింగ్స్‌ను మరికొంత కాలం పాటు తొక్కి పెట్టాలంటూ ప్రభు త్వం ఒత్తిడి తెస్తోందని ఓ నాయకుడు చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలోని 2.56లక్షల మంది పెన్షనర్లకు ప్రభు త్వం ప్రతి నెలా రూ.1100 కోట్ల పైచిలుకు చెల్లించేది. 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కావడంతో ఆగస్టులో రూ.3283.06 కోట్లు చెల్లించింది. 2018 జూలై 1 తర్వాత రిటైరైన పెన్షనర్లకు కూడా చెల్లించాల్సి వస్తే.. ఈ భారం మరింత పెరుగుతుంది. అందుకే వీరికి కొత్త పెన్షన్‌ను ఇప్పట్లో అమలు చేయకుండా అడ్డుపడుతోందన్న ఆరోపణలున్నాయి.


36 వాయిదాల మానిటరీ బకాయిలేవి?

ఇవే కాదు, 2018 జూలై 1కు ముందు రిటైర్‌ అయిన పెన్షనర్లకు అమలు చేయాల్సిన మానిటరీ బెనిఫిట్స్‌ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి 31 వరకు 12 నెలల మానిటరీ బెనిఫిట్స్‌ను ఈ ఆగస్టు నుంచి 36 వాయిదాల కింద చెల్లిస్తామని తెలిపింది. ఇప్పటివరకు ఈ వాయిదాలు అమల్లోకి రాలేదు. ఒక్కొక్కరికి కనీసం రూ.6-10 వేల వరకు బకాయిలు రావాల్సి ఉంది. 36 వాయిదాల్లో కాకుండా.. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లోనే మొత్తం సొమ్మును చెల్లించాలని పెన్షనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ, దీని గురించి పట్టించుకోవడం లేదు. 


పెండింగ్‌లో మూడు డీఏలు

ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా మూడు డీఏలు రావాల్సి ఉంది. వీటిని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడుతున్నారు. 1.1.2020కు సంబంధించి ఒక డీఏ, 1.7.2020 నుంచి అమలు కావాల్సినది, 1.1.2021 నుంచి రావాల్సింది.. ఇలా మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని వివరిస్తున్నారు. వీటి కింద దాదాపు 9 శాతానికి పైగా వేతనాలు పెరుగుతాయని తెలిపారు.

Updated Date - 2021-10-14T08:54:18+05:30 IST