ఫిట్‌లెస్‌!

ABN , First Publish Date - 2022-06-29T05:56:37+05:30 IST

కొద్దిరోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ప్రైవేటు పాఠశాలలన్నీ పిల్లల కోసం బస్సులు నడుపుతున్నాయి.

ఫిట్‌లెస్‌!

బడి బస్సు......భద్రమేనా..?

కరోనా కారణంగా రెండేళ్లుగా షెడ్డుకే పరిమితం

వాహనాల సామర్ధ్యంపై అనుమానాలు

ధ్రువీకరణ విషయంలో యాజమాన్యాల నిర్లక్ష్యం

కాలం చెల్లిన వాహనాలే ఎక్కువ

 ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకున్నవి 50 శాతం లోపే

 జూలై 5న స్కూళ్లు పునఃప్రారంభం



వచ్చే నెల ఐదో తేదీ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. దీనికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు తమ పిల్లలను సిద్ధం చేస్తున్నారు. అయితే విద్యార్థులను పాఠశాలలకు తరలించడంలో కీలకపాత్ర పోషించే బస్సుల పరిస్థితిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా షెడ్డులకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో గతంలో మాదిరి సామర్ధ్యం కలిగి ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు జిల్లాల విభజన అనంతరం రవాణా శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏ జిల్లాలోనూ పూర్తి స్థాయి సిబ్బంది లేరు. మరీ ఈ ఏడాది ఏ మేరకు తనిఖీలు నిర్వహిస్తారో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. 


గుంటూరు(తూర్పు), జూన్‌28:  కొద్దిరోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ప్రైవేటు పాఠశాలలన్నీ పిల్లల కోసం బస్సులు నడుపుతున్నాయి. బడిపిల్లలను తీసుకువెళుతున్న బస్సుల కండీషన్‌పై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు యంత్రాంగం హడావిడి చేయడం తప్ప ముందస్తుగా వాటి ఫిట్‌నెస్‌ విషయంతో పాటు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న దాఖలాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. నిర్వహణ ఖర్చుల పేరుతో స్కూళ్ల యాజమాన్యాలు వసూలు చేసే ఫీజులకు పిల్లలకు కల్పించే సౌకర్యాలకు పొంతనే ఉండడం లేదు.  దీంతో బడిబస్సులతో పాటు కళాశాల బస్సుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా తయారైంది.


సగం కూడా పూర్తికాని ఫిట్‌నెస్‌ పరీక్షలు

గుంటూరు జిల్లాలో 1,300 వరకు పాఠశాలలకు సంబంధించి బస్సులు ఉన్నాయి.  ఇప్పటివరకు 650 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. పాఠశాలలు ప్రారంభం కావడానికి  వారం మాత్రమే ఉంది. సాధారణంగా మే 15 నాటికే ప్రతి విద్యాసంస్థ వాహనం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వ్యాలిడిటీ అయిపోతుంది. ఆ వెంటనే వాహనాలకు సంబంధించి మరమ్మత్తులను పూర్తిచేసుకుని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలి, కానీ ఈ విషయంలో పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ 10 రోజుల్లో బస్సుల మరమ్మత్తులను పూర్తి చేసి, ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసుకుని బస్సులను ఎలా సిద్ధం చేస్తారో యాజమాన్యాలే చెప్పాలి. మరోవైపు ఫిట్‌నెస్‌ పరీక్షలు లేకుండా బస్సులు రోడ్డెక్కితే భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు చెబుతున్నారు. 


  బస్సుల విషయంలో పాటించాల్సిన నియమాలు.. 

మోటారు వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, ఇన్స్యూరెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, పర్మిట్‌, పన్ను చెల్లింపు రశీదు, పొల్యూషన్‌, కంట్రోల్‌ సర్టిఫికెట్‌తో పాటు డ్రైవర్లకు లెసెన్సు తప్పనిసరిగా ఉండాలి. అద్దాలకు గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి. డ్రైవర్‌ వయస్సు 60 ఏళ్లకు మించరాదు. ప్రతి బస్సులో పిల్లలకు అటెండెంట్‌ ఉండాలి. ప్రతీ నెల యాజమాన్యాలతో పాటు పేరెంట్స్‌ కమిటీలు కూడా బస్సులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదు. బస్సులకు తప్పనిసరిగా పసుపు రంగు వేయాల్సి ఉంటుంది. పాఠశాల పేరు, సెల్‌ఫోన్‌ నెంబర్‌, పూర్తి చిరునామా బస్సు ఎడమవైపు కనిపించేలా ఉండాలి. బస్సు కిటీకీలకు మధ్య రెండు లోహపు కడ్డీలు అమర్చాల్సి ఉంటుంది. ఈ నిబంధనలలో కనీసం 50 శాతాన్ని కూడా స్కూళ్ల యాజమాన్యాలు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి.


డ్రైవర్లకు ఉండాల్సిన అర్హతలు

-విద్యాసంస్థ డ్రైవరుగా నియమించే వ్యక్తికి 60 సంవత్సరాలు మించరాదు.

- అదే క్యాటగిరి వాహనాన్ని(బస్సును) కనీసం ఐదేళ్లు నడిపిన అనుభవం కలిగి ఉండాలి.

- డ్రైవరు నియామకం పేరెంట్స్‌ కమిటీకి తెలపాలి.

- బస్సు డ్రైవరు, అటెండర్‌ వారికి కేటాయించిన యూనిఫాం ధరించాలి. 

- బస్సు బయులుదేరే ముందు తప్పనిసరిగా డ్రైవర్లకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలి

- విద్యాసంస్థల బస్సుల ప్రమాదాలు ఎక్కువశాతం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. అనుభవం ఇతర  విషయాలను పట్టించుకోకుండా డ్రైవర్లు నియమించుకుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖ నిబంధనల మేరకు డ్రైవర్ల నియామకం జరుగుతుందా లేదా అనే అంఽశాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. 

 

కాలం చెల్లిన వాహనాలే ఎక్కువ....

కాలం చెల్లిన బస్సులను రోడ్లుపైన తిప్పవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ ఈ ఆదేశాలను విద్యాసంస్థల యాజమాన్యాలు బేఖతారు చేస్తున్నాయి. 15 ఏళ్ల కాలం పూర్తయిన బస్సులు నడపాలంటే స్కూళ్లు, కళాశాల యాజమాన్యాలు మరో ఐదేళ్లపాటు ఎక్స్‌టెన్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో దాదాపు రెండేళ్లుగా బస్సులు రోడ్డెక్కలేదు. కరోనా సమయంలో ఫిట్‌నెస్‌ సామర్థ్య పరీక్షలకు ఏడాదిపాటు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో వాటి భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. 

 

20 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు..

ఇదిలా ఉంటే స్కూల్‌ బస్సుల ఛార్జీలు మాత్రం ఈ ఏడాది ఒక్కసారిగా 20 శాతంపైనే పెంచారు. కొన్ని పాఠశాలల్లో అయితే స్కూల్‌ ఫీజుల కంటే బస్సు ఫీజులే అధికంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెరిగిన పెట్రోల్‌, డీజీల్‌ ధరల దెబ్బకి ఛార్జీలు పెంచామని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ ఇవి తల్లిదండ్రులకు మాత్రం భారంగా మారింది. 

 

  బాపట్ల పరిధిలో దాదాపు 225 బస్సులు...చీరాల పరిధిలో 120

 బాపట్ల మోటారు వాహనాల తనిఖీ అధికారి పరిధిలో బాపట్ల, రేపల్లె, వేమూరు, నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో మొత్తం ప్రైవేట్‌ స్కూళ్ళకు సంబంధించి సుమారు 225 బస్సులు ఉన్నాయి. వీటిల్లో 100 నుంచి  120 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌  ధ్రువపత్రాలు తీసుకున్నారు. అదే విధంగా చీరాల పరిధిలో దాదాపు 120 బస్సులు ఉన్నట్లు సమాచారంగా ఉంది. వీటిలోకూడా దాదాపు 60 శాతం మాత్రమే ఎఫ్‌సీ పూర్తయిందని, మిగిలినవారు ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. విద్యాసంవత్సరానికి ప్రారంభానికి ముందే బాపట్ల మోటారు వాహనాల తనిఖీ అధికారి బి.సత్యనారాయణ ప్రసాద్‌ మూడు బస్సులపై  కేసులు నమోదు చేశారు. అందులో ఒక బస్సు డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడుపటంతో  కేసు నమోదు చేసి 10రోజులు జైలులో కూడా పెట్టారు. మరో రెండు బస్సులకు సరైన ధ్రువపత్రాలు లేకపోవటంతో కేసులు నమోదు చేశారు.  


స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తాం...

మామూలుగా అయితే మే 15కల్లా బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను స్కూళ్ల యాజమాన్యాలు తీసుకోవాలి. స్కూళ్ల ఓపెన్‌కు ఇంకా సమయం ఉన్నందున నిబంధనల ప్రకారం బస్సులకు ఎఫ్‌సీని పూర్తిచేయించుకోవాలి. బస్సుల రోడ్లమీదకు వచ్చాక మేము అన్నిచోట్ల స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి తనిఖీలు చేపడతాం. నిబంధనల ప్రక్రియను పూర్తి చేసుకోని ఏ ఒక్క బస్సును కూడా విడిచిపెట్టం.

  - ఎ.చంద్రశేఖర్‌రరెడ్డి, డీటీవో, బాపట్ల జిల్లా



 ==================================================================================

Updated Date - 2022-06-29T05:56:37+05:30 IST