కొందరికే మత్స్యకార భరోసా!

ABN , First Publish Date - 2022-05-14T06:08:42+05:30 IST

‘మత్స్యకార భరోసా’ అంటూ అట్టహాసంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం...దానిని అందరికీ వర్తింపజేయకుండా కొందరికే పరిమితం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొందరికే మత్స్యకార భరోసా!

నిబంధనల పేరిట కొందరి పేర్లు తొలగింపు

విశాఖ జిల్లాలో మొత్తం మత్స్యకారులు 13,630

భరోసా ప్రకటించింది 11,334 మందికే...

పథకం వర్తించని వారిలో అసంతృప్తి

డీజిల్‌ రాయితీ కూడా పెంచాలని డిమాండ్‌

లీటర్‌ ధర రూ.72 ఉన్నప్పుడు సబ్సిడీగా రూ.9 ప్రకటన

ఇప్పుడు రూ.106 అయినా...అంతే రాయితీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘మత్స్యకార భరోసా’ అంటూ అట్టహాసంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం...దానిని అందరికీ వర్తింపజేయకుండా కొందరికే పరిమితం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకానికి కేటాయించిన నిధులను శుక్రవారం మీట నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేశారు. విశాఖపట్నం జిల్లాలో 13,630 మంది వేటకు వెళ్లే మత్స్యకారులు ఉన్నారని అధికారులు లెక్కలు తేల్చగా, శుక్రవారం 11,334 మందికే ‘మత్స్యకార భరోసా’ నిధులు అందిస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.11.33 కోట్లు విడుదల చేశారు. అవి ఎంత మంది ఖాతాల్లో పడ్డాయనేది ఇంకా వెల్లడి కాలేదు. 

ఇది పథకం కిందకు వస్తుందా?

సముద్రంలో వేటకు వెళ్లనిదే మత్స్యకారులకు పూట గడవదు. వారిని ఆ పని చేయవద్దని ప్రభుత్వమే చెప్పి, ఇళ్ల వద్దనే ఉండాలని ఆదేశించి, దానికి ప్రతిఫలంగా నెలకు రూ.5 వేలు చొప్పున రెండు నెలలకు రూ.10 వేలు ఇచ్చి, అది ప్రభుత్వ పథకం అని ప్రకటించుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాము వేటకు వెళితే...అంతకు రెండింతలు సంపాదించుకుంటామని, కానీ పథకం అని చెప్పి...నిబంధనలు పెట్టి, కొందరికి ఇచ్చి, మరికొందరికి మొండిచేయి చూపించారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మర పడవల్లో ఆరుగురు నుంచి ఎనిమిది మంది కలాసీలు ఉంటారని, వారిలో ముగ్గురు, నలుగురికి డబ్బులు ఇచ్చి...మిగిలిన వారికి ఇవ్వకపోవడం ఏ విధమైన న్యాయమని నిలదీస్తున్నారు. 

స్మార్ట్‌ కార్డులూ పనిచేయడం లేదు

మత్స్యకార భరోసా కింద గుర్తించిన ప్రతి మత్స్యకారుడికి స్మార్ట్‌ కార్డులు ఇచ్చారు. మర పడవలకు నెలకు మూడు వేల లీటర్ల వరకూ రాయితీపై డీజిల్‌ లభిస్తుంది. లీటరుకు తొమ్మిది రూపాయల చొప్పున వస్తుంది. డీజిల్‌ పోయించుకున్నప్పుడు ఆ స్మార్ట్‌ కార్డు స్వైప్‌ చేస్తారు. అది పనిచేస్తేనే రాయితీ వస్తుంది. లేదంటే...ఆరోజు పోయించుకున్న డీజిల్‌కు రాయితీ రాదు. ఏ కారణం చేతనో కొందరి కార్డులు పనిచేయడం లేదు. దాంతో వారు డీజిల్‌ రాయితీ కోల్పోతున్నారు. మరపడవల యజమానులకు ఇచ్చిన కార్డుల్లో సుమారు 60 కార్డుల వరకు పనిచేయడం లేదని జెట్టీలో బోట్ల యజమానులు చెబుతున్నారు. 

లీటర్‌ రూ.106...రాయితీ రూ.9

డీజిల్‌ ధర లీటరు రూ.72 ఉన్నప్పుడు రాయతీ రూ.9 ప్రకటించారు. ఇటీవల కాలంలో డీజిల్‌ ధరలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు లీటరు రూ.106. పెరిగిన ధర మేరకు అదే నిష్పత్తిలో రాయితీ కూడా పెంచాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మత్స్యకార నాయకులు కూడా దీనిపై మాట్లాడడం లేదనే వాదన వినిపిస్తోంది. 

నిబంధనలన్నారు..ఏమి చేశారో..?

ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేటపై ఆంక్షలు విధించారు. ఆ తరువాత వేటకు వెళ్లని వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా మత్స్యకార భరోసా పథకానికి కొన్ని నిబంధనలు పెట్టింది. స్మార్ట్‌ కార్డులు తీసుకున్న వారు తప్పనిసరిగా నెలలో ఎంతో కొంత డీజిల్‌ వినియోగించాలని, లేదంటే...వారు వేటకు వెళ్లలేదని భావించి పథకం ఇవ్వబోమని ప్రకటించింది. అలాగే ప్రభుత్వం నుంచి ఇతర పథకాలు ఏమైనా పొందుతున్నట్టయితే వారికి కూడా ఇందులో లబ్ధి చేకూరదని స్పష్టంచేశారు. దాంతో చాలా మంది నిరాశ చెందారు. అనుకున్నట్టుగానే గుర్తించిన వారందరికీ భరోసా నిధులు ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించలేదు. తొలి విడతగా 11,334 మందికి ఇచ్చామని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే రెండో విడతలో ఇస్తామని అంటున్నారు. ఒకరికి ఒకసారి, మిగిలిన వారికి మరోసారి ఏమిటనే వాదన వినిపిస్తోంది. ఏదైనా చిత్తశుద్ధితో అమలు చేయాలని, అందరికీ ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. 

Read more