మహిళా జాలర్లు!

ABN , First Publish Date - 2020-06-10T05:30:00+05:30 IST

సాగర కెరటాలకు ఎదురెళ్లి చేపలు పట్టడమంటే ఒకరకంగా ప్రాణాల్ని పణంగా పెట్టడమే. ఈ వృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. కానీ మొరాకో (ఆఫ్రికా)లోని సముద్రతీర గ్రామంలో కొందరు మహిళలు అలల మీద ధైర్యంగా చేపల వేటకు వెళుతున్నారు...

మహిళా జాలర్లు!

సాగర కెరటాలకు ఎదురెళ్లి చేపలు పట్టడమంటే ఒకరకంగా ప్రాణాల్ని పణంగా పెట్టడమే. ఈ వృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. కానీ మొరాకో (ఆఫ్రికా)లోని సముద్రతీర గ్రామంలో కొందరు మహిళలు అలల మీద ధైర్యంగా చేపల వేటకు వెళుతున్నారు. ఇన్నాళ్లు వంటగదికి పరిమితమైన ఆడవాళ్లు ఇంతటి సాహసం ఎందుకు చేస్తున్నారంటే....


ఫతిహ నజీ, ఫాతీమా మెఖ్నాస్‌, సైదా ఫెత్నో, అమీనా మెఖ్నాస్‌.... ఉదయాన్నే ఇంటి పనులు ముగించుకొని చేపలు పట్టే వలలు అందుకొని సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ పడవ ఎక్కి చేపల వేటకు వెళతారు. సాయంత్రం వల నిండా చేపలతో తీరానికి తిరిగివస్తారు. గత కొన్నిరోజులుగా వీరి దినచర్య ఇదే... వీరితో పాటు మరో 14 మంది మహిళా జాలర్లు చేపలు పట్టి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు నడుపుతున్నారు. మొరాకోలో మొట్టమొదటి మహిళా జాలర్లుగా గుర్తింపు సాధించిన వీరిది మోసెస్‌ కొండ ప్రాంతానికి దిగువగా మధ్యధరా సముద్ర తీరం వెంబడి ఉన్న బెలియోనెచ్‌ గ్రామం. ఈ ఊరికి ఏడు కిలోమీటర్ల దూరంలో మొరాకో, యూరప్‌ సరిహద్దు భూభాగమైన స్పెయిన్‌ పట్టణం సెవుటా ఉంది. బెలియోనెచ్‌ గ్రామస్థులు సెవుటాలో పనిచేసి సాయంత్రం బోర్డర్‌ దాటి ఇంటికి చేరుకునేవారు. అయితే 2000 సంవత్సరం ప్రారంభంలో స్పెయిన్‌ ప్రభుత్వం ఆ భూభాగాన్ని మూసివేయడంతో  బెలియోనెచ్‌వాసుల ఉద్యోగాలు పోయాయి. కూలీపని దొరక్కపోవడంతో ఇల్లు గడవడం కష్టమైంది. దాంతో వాళ్లంతా తమ తాతల కాలం నాటి చేపలు పట్టే వృత్తిని చేట్టారు.  


వంటగది దాటి సముద్రంలోకి...

‘‘నేను సెవుటాలో పనిమనిషిగా, ఆయాగా పనిచేసేదాన్ని. రోజుకు 20 యూరోలు ఇచ్చేవారు. దాంతో చీకూ చింతా లేకుండా ఇంటిల్లిపాది బతికేవాళ్లం. ఎప్పుడైతే సరిహద్దు మూసివేశారో అప్పటి నుంచి నేను ఇంటికే పరిమితం అయ్యా’’ అని చెబుతారు 60 ఏళ్ల ఖేడౌజ్‌ ఘాజిల్‌ అనే పెద్దావిడ. ఖాళీ సమయంలో ఘాజిల్‌, మరికొంత మంది మహిళలు చిరిగిన వలలకు మరమ్మతు చేయడం, పడవల్ని శుభ్రం చేయడం వంటి పనులు చేసేవారు. సరిగా అప్పుడే స్థానిక మహిళలకు ఉపాధి చూపాలనే ఆలోచనతో అక్కడి సహకార సంస్థ 19మంది మహిళలతో జాలర్ల బృందాన్ని 2018 మార్చిలో ఏర్పాటు చేసింది. మొరాకో దేశంలో మొట్టమొదటి మహిళా జాలర్ల బృందం వీరిదే. వీరిలో నలుగురు మహిళలకు మాత్రమే చేపలు పట్టడంలో అనుభవం ఉంది. మిగతావారికి తమ తమ భర్తలకు చేపల వేటలో సాయం చేయడం, చిరిగిన వలలకు మరమ్మతు చేయడం, చేపల్ని మార్కెట్లో అమ్మడం వంటి పనులు తెలుసు అంతే. దాంతో వారికి రెండేళ్లు సముద్రంలో అలల మీద పడవలో ప్రయాణించడం, వల విసరడం, చేపలు పట్టడం, ప్రథమ చికిత్స చేయడం, ఒకవేళ పడవ పట్టు తప్పి మునిగిపోయే పరిస్థితిలో నీళ్లలో దూకి ఒడ్డుకు చేరడంలో శిక్షణ ఇచ్చారు. 




సముద్రమే ఆకలి తీర్చే అమ్మ...

‘‘మేము సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం. సముద్రం నుంచి మమ్మల్ని దూరం చేస్తే చేప మాదిరిగానే మేము కూడా చనిపోతాం. సముద్రంతో ముడిపడిన జీవితం నాది. నా పిల్లలతో పాటు, ఊళ్లో వారందరికీ సముద్రమే ఆకలి తీర్చే అమ్మ.  చేపల వేటకు వెళ్లడం అంత సులువైన ఉద్యోగం కాదు. కానీ నాతోటి చెల్లెల్లకు నాకు ఈ కొత్త జీవితం ఎంతో ఎంతో బాగుంది’’ అంటూ సముద్రంతో తమకున్న అనుబంధాన్ని వివరిస్తారు సహకార సంస్థ అధ్యక్షురాలు అమీనా మెఖ్నాస్‌. ఏ పనైనా చేసే సామర్థ్యం, తెగింపు మహిళల్లో ఉంటుందని, వారు ఎంతో శక్తిమంతులు అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేం ఉంటుంది.


Updated Date - 2020-06-10T05:30:00+05:30 IST