మేనిఫెస్టోలో మత్స్యకారుల డిమాండ్లు

ABN , First Publish Date - 2021-02-25T07:00:16+05:30 IST

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారుల డిమాండ్లను చేరుస్తామని ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ చెప్పారు.

మేనిఫెస్టోలో మత్స్యకారుల డిమాండ్లు

కేంద్రంలో మత్స్య శాఖ ఏర్పాటు: రాహుల్‌ 


కొల్లాం, ఫిబ్రవరి 24: కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారుల డిమాండ్లను చేరుస్తామని ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ చెప్పారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ‘‘రైతులు పొలాల్లో సేద్యం చేస్తారు. మత్స్యకారులు సముద్రంలో చేస్తారు. ఢిల్లీలో రైతులకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కానీ, మీకు లేదు. మీ కోసం ఢిల్లీలో ఎవరూ మాట్లాడరు. నేనైతే ముందు దేశంలో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేస్తా. అప్పుడే మీ సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని అన్నారు.


త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో పర్యటిస్తున్న రాహుల్‌.. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వాడి బీచ్‌ నుంచి మత్స్యకారుల పడవలో చేపల వేటకు వెళ్లారు. దాదాపు గంట సేపు సముద్రంలో గడిపారు. మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి దూకారు. భద్రతాధికారులు కంగారు పడగా.. రాహుల్‌ మాత్రం ప్రశాంతంగా 10 నిమిషాల పాటు ఈత కొట్టారు. తిరిగి వచ్చిన తర్వాత మత్స్యకారులతో భేటీ అయ్యారు. మీరు పడే కష్టాన్ని నేను అర్థం చేసుకోగలనని రాహుల్‌ అన్నారు.


మరోవైపు కేరళలో నిర్వహించిన ఐశ్వర్య యాత్రలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఉత్తర భారతంలో రాజకీయాలు వేరుగా ఉంటాయని, కేరళలో మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజలు సమస్యలపై దృష్టి సారిస్తారన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలు ఉత్తర, దక్షిణ భారత ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Updated Date - 2021-02-25T07:00:16+05:30 IST