షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో.. మత్స్యకారుడి కుమార్తె పతకాల వేట!

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

మత్స్యకారుడి కుమార్తె మనీషా కీర్‌ షూటింగ్‌లో అదరగొడుతోంది. కైరోలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు రజతం సాధించడంలో 20 ఏళ్ల మనీషా కీలకపాత్ర పోషించింది. ట్రాప్‌ ఈవెంట్‌లో మనీషా, కృతి గుప్తా, రాజేశ్వరీ కుమార్‌తో కూడిన టీమిండియా మొత్తం 444 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో.. మత్స్యకారుడి కుమార్తె పతకాల వేట!

న్యూఢిల్లీ: మత్స్యకారుడి కుమార్తె మనీషా కీర్‌ షూటింగ్‌లో అదరగొడుతోంది. కైరోలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు రజతం సాధించడంలో 20 ఏళ్ల మనీషా కీలకపాత్ర పోషించింది. ట్రాప్‌ ఈవెంట్‌లో మనీషా, కృతి గుప్తా, రాజేశ్వరీ కుమార్‌తో కూడిన టీమిండియా మొత్తం 444 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. టీమ్‌లోని ముగ్గురు షూటర్లలోనూ మనీషా (158)నే టాప్‌ స్కోరర్‌. రష్యా మొత్తం 463 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకొంది. గోల్డ్‌మెడల్‌ రౌండ్‌లో 0-4తో వెనుకబడినా.. మన అమ్మాయిలు అద్భుతంగా పుంజుకొని 4-4తో సమం చేశారు. దీంతో ఫలితం షూటౌట్‌కు దారి తీసింది. కానీ, కీలక సమయంలో భారత జట్టు తడబడడంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


కాగా తన కుమార్తె దేశానికి పతకం తీసుకురావడంపై ఆమె తండ్రి కైలాష్‌ కీర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ శివార్లలోని ఓ గుడిసెలో మనీషా కుటుంబం నివసిస్తోంది. చిన్నతనంలో ఆమె తండ్రితో కలసి చేపల వేటకు కూడా వెళ్లేదట..! 2013లో టాలెంట్‌ హంట్‌లో మనీషా ప్రతిభను గుర్తించిన మధ్యప్రదేశ్‌ షూటింగ్‌ అకాడమీ.. ఆమెను మరింతగా సానబెట్టింది. మూడేళ్ల క్రితం కొరియాలో జరిగిన వరల్డ్‌ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ ట్రాప్‌లో 115/125 స్కోరుతో వరల్డ్‌ రికార్డు స్కోరును సమం చేసిన మనీషా అందరితో శభాష్‌ అనిపించుకొంది.

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST