- స్వాగతానికి పోటీ పడిన డీఎంకే-బీజేపీ నేతలు
చెన్నై: శ్రీలంక సైన్యం చేతుల్లో బందీగా ఉన్న 29 మంది తమిళ జాలర్లు విడుదలై గురువారం ఉదయం నగరానికి చేరు కున్నారు. స్థానిక మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆ జాలర్లకు స్వాగతం పలికేందుకు డీఎంకే, బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు. దీనితో విమానాశ్రయం వద్ద కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నాగపట్టినంకు చెందిన 18 మంది, కారైక్కాల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు జాలర్లు, జనవరిలో రెండు పడవల్లో సముద్రంలో చేపలవేటకు వెళ్ళినప్పుడు తమ దేశ సరిహద్దు లో చొరబడ్డారంటూ శ్రీలంక సైనికులు వారిని నిర్బంధించి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ఫిబ్రవరిలో రామేశ్వరానికి చెందిన 12 మంది జాలర్లు సముద్రంలో చేపలు పడుతుండగా శ్రీలంక నావికాదళం నిర్బంధించి తరలించుకెళ్ళారు. ఈ జాలర్లను విడిపించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయ అధికారులు శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ జాలర్లను విడిపించేందుకు చర్యలు చేపట్టారు.. దీంతో ఫిబ్రవరి 21న నాగ పట్టినం, కారైక్కాల్ జాలర్లు 21 మందిని విడుదల చేసి అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులకు అప్పగించారు. ఇదే విధంగా ఫిబ్రవరి 28న రామేశ్వరం ప్రాంతా నికి చెందిన 12 మంది జాలర్లను విడుదల చేసి రాయబార కార్యాలయం అధికారులకు అప్పగించారు. వీరందరికీ అత్యవసర ప్రాతిపదికన పాస్‌పోర్టులను సిద్ధంచేసి విమానంలో ఎక్కించారు. గురు వారం వేకువజామున 4.20 గంటలకు జాలర్లందరూ కొలంబో నుంచి మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా తమిళ జాలర్లకు స్వాగతం పలికేందుకు డీఎంకే, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోటీపడడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తొక్కిసలాట జరిగింది. డీఎంకే, బీజేపీ జాలర్ల విభాగాలకు చెందిన నాయకులందరూ శాలువలు పట్టుకుని తమిళ జాలర్లను సత్కరిం చేందుకు పోటీపడ్డారు. ఊహించని ఈ సంఘటనతో అక్కడే వున్న ప్రభుత్వాధికారులు దిగ్ర్భాంతి చెందారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలంతా తమిళ జాలర్లను శాలువలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసిన తర్వాత అధికారులు జాలర్లను బస్సులలో వారి స్వస్థలాలకు పంపారు.
ఇవి కూడా చదవండి