చెరువు కళకళ మీన మిలమిల

ABN , First Publish Date - 2020-10-11T10:52:51+05:30 IST

ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మత్స్య సంపద గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

చెరువు కళకళ మీన మిలమిల

ఆగస్టు, సెప్టెంబరులలో సమృద్ధిగా కురిసిన వర్షాలు

జలకళను సంతరించుకున్న రిజర్వాయర్లు, చెరువులు, కంటలు

మత్స్య సంపదను పెంచేందుకు అధికారుల ప్రణాళికలు

ఒక్కో జిల్లాకు కోటిన్నర చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయం

మత్స్యకారులకు మెరుగు కానున్న ఉపాధి అవకాశం


ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మత్స్య సంపద గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత సమృద్ధిగా వర్షాలు కురువడంతో, ఆ నీటితోనే చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నాయి.. దీనికితోడు ఎగువ నుంచి వచ్చిన వరదలతో జలాశయాలు కళకళలాడుతుండగా, ఈసారి భారీ స్థాయిలో చేప పిల్లలను విడుదల చేసేందుకు మత్స్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.. ఒక్కో జిల్లాకు దాదాపు కోటిన్నర చేప పిల్లలను పంపిణీ చేయాలని భావిస్తుండగా, ఇప్పటికే దాదాపు 50 లక్షల చేప ప్లిలలను ఒక్కో జిల్లాలో విడుదల చేసినట్లు ఆ శాఖ లెక్కలు చెబుతున్నాయి.. వచ్చే ఏడాది మే నాటికి ఈ చేపలన్నీ పెరిగి పెద్దవై మంచి దిగుబడులు రావడంతో పాటు మత్స్యకారులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి..


గద్వాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో చేపల పెంపకానికి కాలం కలిచి వచ్చింది. దీంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దీనికితోడు మత్స్య సహకార సంఘాలు చెరువుల్లో సబ్సిడీ చేపల పిల్లలను పోయించుకోవడానికి ముందుకు రావడం శుభ సుచకంగా మారింది.


ఒక్కో జిల్లాకు కోటిన్నర చేప పిల్లలు

ఉమ్మడి జిల్లాలోని ప్రతి జిల్లాకు ఈ ఏడాది కోటి నుంచి కోటిన్నర చేప పిల్లలను పంపిణీ చేయడానికి మత్స్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో ఇప్పటికే ప్రతి జిల్లాలో 40 లక్షల నుంచి 50 లక్షల చేప పిల్లలను ఆయా చెరువుల్లో విడుదల చేసినట్లు ఆ శాఖ యంత్రాంగం పేర్కొంటున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో కూడా 1.40 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని మత్స్యశాఖ అధికారి రూపేందర్‌ సింగ్‌ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 లక్షల చేప పిల్లలను 97 చెరువుల్లో విడుదల చేయగా, అందులో ర్యాలంపాడు రిజర్వాయర్‌లో మూడు లక్షలు, నాగర్‌దొడ్డి రిజర్వాయర్‌ ఐదు లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు వివరించారు. త్వరలో జూరాల, తుంగభద్ర, రేకులపల్లితో పాటు మరికొని రిజర్వాయర్లలో కూడా చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.


మత్తడి దూకిన చెరువులు

ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నాయి. దీనికితోడు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీ స్థాయిలో వరద రావడంతో జూరాల జలాశయంతో పాటు దాని కింద ఉన్న ఎత్తిపోతల పథకాలు నిండు కుండను తలపిస్తున్నాయి. 1988 నుంచి 2020 వరకు 82 రోజుల పాటు వర్షాలు కురిసిన సంఘటలను ఈ ఏడాదే చోటు చేసుకున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబరులలో జూరాల కాల్వల ద్వారా వచ్చే నీటితో చెరువులు, కుంటలను నింపుకునే పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేది. కానీ, ఈసారి స్థానికంగానే కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండాయి. చాల చెరువులు మత్తడి పారాయి. ఉమ్మడి జిల్లాలో 2,366 చెరువులు మత్తడి పారాయని ఇరిగేషన్‌శాఖ చెపుతుంది. మత్తడిపారిన చెరువుల్లో జోగుళాంబ గద్వాల జిల్లాలో 151, మహబూబ్‌నగర్‌లో 705, నారాయణపేటలో 406, వనపర్తిలో 902, నాగర్‌కర్నూల్‌లో 202 చెరువులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.


మత్స్యకారులకు ఉపాధి

ముందుగానే చెరువులు, కుంటలు నిండటం, చేప పిల్లలను కూడా ముందస్తుగానే జలాశయాల్లో విడుదల చేయడంతో వచ్చే ఏడాది మే నాటికి ఇవి బాగా పెరిగి అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ప్రతి జిల్లాలో ఐదు వేల నుంచి పది వేల మంది చేపల పట్టుకోవడం, అమ్ముకోవడం ఉపాధిగా కొనసాగిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 63 మత్స్య సహకార సంఘాలు ఉండగా, ఇందులో 3,300 మంది సభ్యులు ఉన్నారు. వీరితోపాటు కృష్ణా, తుంగభధ్ర నదిలో చేపలు పట్టుకోవడానికి లైసెన్స్‌ కలిగిన వారు 2,300 మంది ఉన్నారు. ఈ సంవత్సరం చేపల పెంపకం సమృద్ధిగా ఉండటంతో వీరికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగు కానున్నాయి.

Updated Date - 2020-10-11T10:52:51+05:30 IST