చేపల వ్యాపారిని బస్సు నుంచి దించేసిన డ్రైవర్‌, కండక్టర్‌

ABN , First Publish Date - 2021-12-09T16:34:15+05:30 IST

దుర్వాసన వస్తుందంటూ చేపలు విక్రయించే మహిళను బస్సు నుంచి దింపివేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా, బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ సహా ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ రవాణా

చేపల వ్యాపారిని బస్సు నుంచి దించేసిన డ్రైవర్‌, కండక్టర్‌

- సీఎం ఆగ్రహం

- ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు


పెరంబూర్‌(చెన్నై): దుర్వాసన వస్తుందంటూ చేపలు విక్రయించే మహిళను బస్సు నుంచి దింపివేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా, బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ సహా ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... కన్నియా కుమారి జిల్లా వాణియంకుడి గ్రామానికి చెందిన సెల్వం (70) చేపలు విక్రయించి జీవనం సాగిస్తోంది. ఆమె మంగళవారం కుళచ్చల్‌ బస్టాండు నుంచి వాణియంకుడికి వెళ్లే బస్సు ఎక్కుతున్న సమయంలో, చేపలగంప నుంచి దుర్వాసన వస్తోందంటూ డ్రైవర్‌ ఆమెను బలవంతంగా దింపేశాడు. సెల్వమేరి బస్టాండు ప్రాంగణంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బోరున ఏడ్చే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలువడ్డాయి.

 

ఖండించిన సీఎం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. మహిళల సంక్షేమం కోసం తాము ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించా మని, అలాంటి నేపథ్యంలో, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడాన్ని ఖండిస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


డ్రైవర్‌, కండక్టర్‌ సస్పెన్షన్‌

కాగా సీఎం స్పందన అనంతరం రాష్ట్ర రవాణాశాఖలో  కదలిక వచ్చింది. ఈ ఘటనకు బాధ్యులైన డ్రైవర్‌ మైఖేల్‌, కండక్టర్‌ మణికంఠన్‌, బాధిత మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోని టైం కీపర్‌ జయకుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, బాధిత మహిళ దగ్గరకు వెళ్లిన రవాణాశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ జొరోలిన్‌ క్షమాపణలు తెలిపారు.

Updated Date - 2021-12-09T16:34:15+05:30 IST