కరోనాకు పట్టుబడ్డారు!

ABN , First Publish Date - 2020-08-10T11:08:19+05:30 IST

కరోనా చేపల రైతును నిండా ముంచేసింది. కోలుకోనీయకుండా చేసేసింది. కరోనా ఉధృతి పెరగడం.. లాక్‌డౌన్‌ కొనసాగడం చేపల ..

కరోనాకు పట్టుబడ్డారు!

చేప రైతుకు కరోనా దెబ్బ  

నిలిచిన ఎగుమతులు  - తగ్గిన ధరలు

ప్రస్తుతం  కేజీ రూ.85లోపే 

అమ్మకాలకు దారి లేక సాగులో వేల టన్నులు

నిండా మునిగిన చేపల రైతు


వైరస్‌ దెబ్బకు చేప రైతు విలవిల్లాడిపోతున్నాడు. ఒక పక్క గిట్టుబాటు ధర లేక.. ఆరుగాలం పండించిన పంటను కొనే నాథుడు లేక దిక్కులు చూస్తున్నాడు. పెరిగిన చేపలకు మేత పెట్టలేక ఏదో ధరకు వదిలించుకుందామని చూస్తున్నాడు.  ఇదే అదనుగా ట్రేడర్లు కూడా ధరలు తగ్గించి.. అరువుకు సరుకు దక్కించుకుని రైతులను నష్టాల పాలు చేస్తున్నారు. కరోనా దెబ్బకు ఇలా చేపల రైతు రెండు రకాలుగా నిండా మునిగిపోతున్నాడు. 


భీమవరం రూరల్‌/ నిడమర్రు, ఆగస్టు 9:  కరోనా చేపల రైతును నిండా ముంచేసింది. కోలుకోనీయకుండా చేసేసింది. కరోనా ఉధృతి పెరగడం.. లాక్‌డౌన్‌ కొనసాగడం చేపల ఎగుమతులకు అడ్డుగా మారి చేపల సాగు భారీ నష్టాలు చవి చూసేలా చేసింది. కేజీ చేప ధర రూ.85 కన్నా తక్కువ పలకడం ఆ ధరకు కొనుగోలుకు మక్కువ చూపకపోవడం రైతులను గందరగోళానికి గురిచేస్తుంది. మార్చి మొదటి వారంలో కేజీ చేప రూ.115పైబడి రూ. 120 వరకు కొనుగోలు చేశారు. ఆ నెలలో లాక్‌డౌన్‌ మొదలుకుని ధర తగ్గుతూ ప్రస్తుతం రూ.35 వరకు తగ్గిపోయింది. దీంతో రైతులు నష్టాల పాల వుతున్నారు. పట్టుబడికి వచ్చిన చేపలను నష్టాలకు అమ్మలేక అలాకాదని మేత పెట్టలేక ఆందోళన చెందుతున్నారు. కొనే నాథులు లేక కొంత మంది రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఒకనాడు లాభాలు పండించిన పంట కరోనాతో రైతును నష్టాల పాలు చేసింది. 


నిలిచిన ఎగుమతులు..

ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో చేపల ధర అమాంతంగా పడి పోయింది. గతంలో రూప్‌చంద్‌ రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.80కి పడిపోయింది.. అదే విధంగా శీలావతి రూ.115 ఉండగా ప్రస్తుతం రూ. 85కి పడి పోయింది. బీహార్‌, ఢిల్లీ, పాట్నా, కోల్‌కత్తా, గౌహతి తదితర ఈశాన్య రాష్ర్టాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు సముద్రపు చేప ఉత్పత్తులు పెరగడం తక్కువ ధరకు లభించిడంతో మన చేపకు గిట్టుబాటు ధర లభించడం కష్టమవు తుంది.ప్రస్తుతం చేపను తమిళనాడు, ఒడిసా రాష్ర్టాలకు కేజీలోపు సరుకు మాత్రమే రవాణా సాగుతోంది. ప్రస్తుతం దీనికే డిమాండ్‌ ఉంది. అది కూడా తక్కువ ధర ఉండడంతో రైతు నష్టాల్లో కూరుకుపోతున్నాడు. జిల్లాలో లక్ష 25వేల ఎకరాల్లో చేపల సాగు చేస్తుండగా లారీల ద్వారా రోజుకు సుమారు 600 టన్నులు కోల్‌కత్తా, అస్సాం, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాలకు జరిగేది. ప్రస్తుతం ఆ తరహా రవాణా అంతా నిలిచిపో యింది. జిల్లా వ్యాప్తంగా రోజుకు ఒకటి రెండు లారీలు మాత్రమే రవాణా అవుతున్నాయి. దీంతో వేల టన్నుల చేపలు పట్టుబడికి వచ్చి అమ్మకాలు జరగకుండా చెరువుల సాగులో ఉన్నాయి. 


ధర రూ.100 పైన ఉంటేనే గిట్టుబాటు..

ఏడు నెలల నుంచి ఏడాది సాగే చేపల సాగులో ఎకరానికి చెరువు లీజుతో కలిపి రూ.3 లక్షలు పైనే పెట్టుబడి అవుతుంది. ఈ ఏడాది మేత కింద వాడే తవుడు, చెక్క ధర  పెరిగింది.. దీంతో పెట్టుబడి పెరిగింది. ఈ లెక్కన చేప ధర రూ.105 దాటి ఉంటేనే రైతులకు సాగులో కొంత ఆదాయం వచ్చేదని రైతులు చెబుతున్నారు. అలాంటిది రూ.85కి లోపు ఉంటే లక్షల రూపాయలు నష్టాలు తప్పవన్న భయాందోళనలో పడ్డారు. పట్టుబడులు జరగక చేపల సాగు చేస్తున్న రైతులకు పట్టుబడి భారంగా మారింది. చేప మేతగా వాడే తవుడు ధర ఎక్కువ ఉండడం నష్టం మరింత పెరిగేలా ఉంది. ఇటు సాగు చేయలేక అమ్మకాలు లేక రైతులు ఆందోళనలో ఉన్నారు. 


అరువుకు విక్రయాలు

చేపకు మార్కెట్‌ లేకపోవడంతో రైతాంగం రూ.85కు విక్రయించినా వెంటనే సొమ్ము అందడంలేదు. అరువుకు అయితే కొంటాం లేదంటే మీ ఇష్టం అంటూ ట్రేడర్లు చేపల రైతులకు వల వేస్తున్నారు. అయితే పట్టుబడికి వచ్చిన చేపలకు మేత పెట్టలేని రైతుల నయానో భయానో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెలల తరబడి అరువులు సాగుతున్నాయి. ఒక పక్క చేపల సాగులో నష్టం.. మరో వైపు వడ్డీలు వెరసి రైతుకు తడిచి మోపడవుతుంది. దీంతో రైతు నష్టాల పాలవుతున్నాడు. ట్రేడర్లు మిగుల్చు కుంటున్నారు. చాలా కాలంగా ఇదే పరిస్థితి.. దీంతో రైతు ఒక పక్క పెట్టుబడులు రాక.. మరో వైపు అప్పులతో రెండు వైపులా నలిగిపోతున్నాడు. 


నష్టాల ఊబిలో కూరుకుపోయాం.. కొప్పర్తి పల్లారావు, రైతు, గూట్లపాడు

లాక్‌డౌన్‌ కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో చేపల ధర భారీగా పడిపోయింది. దీంతో నష్టాల ఊబిలో కూరుకుపోయాం.కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి. పట్టుబడికి వచ్చిన చేపలను కొనుగోళ్లు లేక పెంచాల్సి వస్తుంది. మేతగా వాడే తవుడు ధర ఎక్కువగా ఉండడం సాగు పెట్టుబడి ఇప్పుడు భారంగా మారింది.


 రూ.98కి అమ్మితే పెట్టుబడి.. 80కి అమ్ముతున్నాం.. అల్లూరి సాయిదుర్గరాజు, రైతు, కొవ్వాడ

కరోనాతో ఏకంగా రూ.30పైనే ధర పడిపోయింది. దీంతో ఈ మూడు నెలలో విక్రయాలు చేసిన రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. సాగులో చేప ధర రూ.98 వరకు అమ్మితే పెట్టుబడి వస్తుంది. ప్రస్తుతం 80కి అమ్ముతున్నాం. రైతు వద్దే కేజీకి రూ. 18 నష్టం.. అంటే పెట్టుబడిలోనే భారీ నష్టం వస్తుంది. 

Updated Date - 2020-08-10T11:08:19+05:30 IST