కలుషిత నీటితో చేపలు మృత్యువాత

ABN , First Publish Date - 2021-04-14T04:01:34+05:30 IST

కలుషిత నీటితో చేపలు మృత్యువాత

కలుషిత నీటితో చేపలు మృత్యువాత
మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌ గ్రామం చింతలకుంటలో మృతిచెందిన చేపలు

మేడ్చల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధి 5వ వార్డులో ఉన్న నీళ్ల చెరువులో మంగళవారం వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కాగా చెరువు పక్కనే ఓ ప్రైవేటు భవంతి నిర్మాణం పనులు జరుగుతుండగా కూలీలు చెరువు పక్కనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు. వీరు నివసించే ప్రాంతం నుంచి పెద్దఎత్తున డ్రైనేజీ చెరువులో చేరి తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో చేపలు మృతిచెందుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చెరువులోకి మురుగు రాకుండా చర్యలు చేపట్టడంతో పాటు చేపలు మృతిచెందడంపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

  • కొల్తూర్‌ గ్రామం చింతలకుంటలో.. 

మూడుచింతలపల్లి : వ్యర్థ రసాయనాలు చెరువులోకి వదలడంతో చేపలు మృతిచెందిన ఘటన మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌ గ్రామం చింతలకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. ముదిరాజ్‌ సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం చింతలకుంట(చెరువు)లో సుమారు లక్ష చేపపిల్లలను వదిలామని, ప్రస్తుతం అవి మృతిచెందడంతో రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పక్కనే ఉన్న జీనోమ్‌ వ్యాలీలోని యూనిక్‌ బయోటెక్‌ కంపెనీ నుంచి వ్యర్థ రసాయనాలు వదలడంతోనే చేపలు మృతి చెందాయని వారు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి కంపెనీపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కాగా ముదిరాజ్‌ సంఘం కొల్తూర్‌ గ్రామ అధ్యక్షుడు కొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొక్కొండ నర్సింలు, ఉపాధ్యక్షుడు నర్సింహ, కోశాధికారి మల్లేష్‌, సంఘం నాయకులు చనిపోయిన చేపలను పరిశీలించారు.

Updated Date - 2021-04-14T04:01:34+05:30 IST