పార్కుల్లో పాగా..!

ABN , First Publish Date - 2022-04-14T17:00:23+05:30 IST

అవి అప్పట్లో నగర శివారులోని గ్రామ పంచాయతీలు. పంచాయతీ అనుమతులతోనే ఇబ్బడి ముబ్బడిగా లేఅవుట్లు చేశారు. ఆయా లేఅవుట్లలో

పార్కుల్లో పాగా..!

 ఫిర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి పర్వతాపూర్‌లోని సాయిప్రియనగర్‌ కాలనీ రోడ్‌నెంబర్‌ 6లోని 1200చ.గజాల పార్కు స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, ఏకంగా భారీ షెడ్‌ నిర్మించి కుటీర పరిశ్రమనే నిర్వహిస్తున్నారు. 

ఇదే లేఅవుట్‌లోని రోడ్‌ నెంబర్‌-2లో రెండు వేల చ.గజాల స్థలంలో థియేటర్‌ కాంప్లెక్స్‌ నిర్మించాల్సి ఉండగా,  ప్లాట్లుగా మార్చి విక్రయానికి పెట్టినట్లు తెలిసింది.


నగర శివార్లలో ఏర్పాటు చేసిన లే అవుట్‌లలోని పార్కులు, థియేటర్‌ కాంప్లెక్స్‌ల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. గ్రామ పంచాయతీ అనుమతులతో ఉన్న లే అవుట్‌లో చూపించిన ఆట స్థలాలు కనుమరుగవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతోనే కబ్జాదారులు వాటిని ఆక్రమిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.


ఆక్రమిస్తున్న కబ్జాదారులు

లేఅవుట్‌లో పార్కు చూపి తాజాగా నిర్మాణాలు

ఇటీవల ఫిర్జాదీగూడలో భారీ షెడ్‌ నిర్మాణం

ప్రగతీనగర్‌లో కుంచించుపోతున్న పార్కులు


హైదరాబాద్‌ సిటీ: అవి అప్పట్లో నగర శివారులోని గ్రామ పంచాయతీలు. పంచాయతీ అనుమతులతోనే ఇబ్బడి ముబ్బడిగా లేఅవుట్లు చేశారు. ఆయా లేఅవుట్లలో పార్కు స్థలాలు, మౌలిక సదుపాయాల కోసం ఖాళీ స్థలాలు వదిలినట్లు చూపారు. లే అవుట్‌ అభివృద్ధి చేసిన కొందరు పంచాయతీలకు ఈ మేరకు గిఫ్ట్‌ డీడ్‌ చేశారు. మరికొందరు కాలనీ పేరుతో చేశారు.  ఇప్పుడు పరిస్థితి మారింది. నగరంలో, శివారులో చ.గజానికి ధర వేలు, లక్షల్లో పలుకుతుండడంతో ఆక్రమణదారులు తప్పుడు పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయిస్తున్నారు. లేఅవుట్‌ చేసిన వ్యక్తులే తమ స్థలమంటూ ఖాళీ, పార్కు స్థలాలను ఆక్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్‌లో పార్కు చూపిన స్థలం డెవలపర్‌ పేరు మీదనే ఉండడంతో తనదంటూ పత్రాలను చూపుతున్నారు. కొన్నాళ్లుగా కాలనీవాసులు పార్కుగా వినియోగించిన స్థలాన్ని కళ్ల ముందే కొందరు కబ్జాదారులు చెరబడుతున్నారు. నిర్మాణాలు చేపడుతున్నారు. 


ప్రేక్షకపాత్రలో అధికారులు

నగర శివారులోని ఫిర్జాదీగూడ, బోడుప్పల్‌, మీర్‌పేట, బడంగ్‌పేట్‌, జవహర్‌నగర్‌, నిజాంపేట, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్లతో పాటు పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగ్‌, కొంపల్లి, దుండిగల్‌, జల్‌పల్లి, తుర్కయాంజల్‌ తదితర మున్సిపాలిటీల పరిధిలో పార్కు స్థలాలు, ఖాళీ స్థలాల ఆక్రమణ వివాదాలు భారీగా ఉన్నాయి. పంచాయతీగా ఉన్న సందర్భంలో ఆయా స్థలాలు కాలనీల అధీనంలో ఉండగా, మున్సిపల్‌, కార్పొరేషన్లుగా మారిన తర్వాత అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఇదే అదనుగా కబ్జాదారులు ముందుకొస్తున్నారు. స్థానిక కాలనీవాసులు ఫిర్యాదు చేసిన క్రమంలో మున్సిపాలిటీ పార్కు, స్థలం అని చెప్పేందుకు కూడా పలు ప్రాంతాల్లో ఆధారాలు లేకుండాపోయాయి. దీంతో పార్కులు, ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారులు, సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితి నెలకొంది.

శివారు ప్రాంతాల్లో ఇలా..

ఫ నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలోని ప్రగతీనగర్‌లో సుమారు 52 వరకు పార్కు స్థలాలు ఉంటాయి. కార్పొరేషన్‌గా మారిన తర్వాత పార్కు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రస్తుతం 35 వరకు చేరినట్లు తెలిసింది. 

 నిజాంపేట పంచాయతీగా ఉన్న సందర్భంలో చూపిన పార్కులేవీ ప్రస్తుతం లేఅవుట్లలో లేవు. బాచుపల్లి పరిధిలోని ఓ కాలనీలో సుమారు రెండు వేల చదరపు గజాల పార్కు స్థలం ఉండగా లేఅవుట్‌ చేసిన వ్యక్తి ఆక్రమించడంతో స్థానికులు కోర్టుకెక్కారు.

 మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్‌లోని పార్కు స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. పంచాయతీకి గిఫ్ట్‌ డీడ్‌ చేసిన స్థలాన్ని ఆక్రమించారు. దీంతో తిరుమలహిల్స్‌ కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్‌, హెచ్‌ఎండీఏ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చెంగిచెర్లలో అరవింద ఎన్‌క్లేవ్‌ను సర్వే నెంబర్‌ 121, 124, 125, 126 తదితర సర్వే నెంబర్లలో ఏర్పాటు చేశారు. లేఅవుట్‌ ప్లాన్‌లో ఉన్న 2వేల చదరపు గజాల పార్కు స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.  

Updated Date - 2022-04-14T17:00:23+05:30 IST