Abn logo
Apr 21 2020 @ 13:08PM

తొలి తెలుగు గజల్ గానం

Kaakateeya

సంగీతంలో ఉత్తమాభిరుచి ‌ఉన్న వాళ్ల ఎన్నిక ఉర్దూ గజల్ గానం. ప్రత్యేకమైన లేదా ఉన్నత స్థాయి గానంగా ఉర్దూ‌ గజల్ గానం కొన్ని దశాబ్దుల క్రితం నుంచీ మనదేశంలో పరిగణించబడుతోంది.


మనదేశంలో‌ 1907లో రికార్డ్ పై తొలిసారి‌ గజల్ గానం వెలువడింది. అంతకు ముందు రాజాస్థానాల్లోనూ, సభల్లోనూ ఈ గజల్ గానం పలికేది. కె.ఎల్. సైగల్, బేగం అఖ్తర్‌ ఈ‌ ఇద్దఱు రికార్డ్ లపై పాడిన గజళ్లు, చలన చిత్రాల్లో పాడిన గజళ్లు మనదేశంలో  ప్రాచుర్యాన్ని పొందాయి. అటు తరువాత తలత్‌ మహ్మూద్ రికార్డ్ లపై పాడిన గజళ్లు గొప్ప ప్రాచుర్యాన్ని పొందాయి. 1944లో తలత్ పాడి రికార్డ్ పై విడుదలయిన గజల్ "తస్ వీర్ తేరీ దిల్ మెరా బెహ్ లాన సకేగీ" దేశంలో సంచలనాన్ని సృష్టించింది. ఆ గజల్  విడుదలైన మొదటి నెలలో లక్షన్నర రికార్డ్ లు అమ్ముడుపోయింది. అప్పటి‌నుంచి మనదేశంలో గజల్ గానానికి పెద్ద ఊపు వచ్చింది. తరువాతి కాలంలో హిందీ చలన‌ చిత్రాల్లో తలత్, మొహమ్మద్ రఫీ, లతామంగేశ్కర్, ఆశా‌ భోస్లే, మన్నాదే వంటి గాయకులు గజళ్లను పాడారు. మెహ్దీహసన్,‌ గులాం అలీ వంటి గాయకుల ద్వారా ఉర్దూ గజల్ గానం విశ్వవ్యాప్తమయింది.


తెలుగులో  తొలి గజల్ గానం  "వల్లరి" (తెలుగు ఘజల్ )   పేరుతో కొలంబియా రికార్డ్ పై 1967లో విడుదలయింది. దాశరథి వ్రాసిన గజల్ అది. సంగీతం ఈమని శంకరశాస్త్రి. గానం పి.బి. శ్రీనివాస్. ఈ ముగ్గురూ చలన చిత్ర కళాకారులే కావడం  విశేషం.


ఆ గజల్:

నీ కొంటె చూపులోన కురిసింది‌ పూలవాన

నీ కొంగు నీడలోన మెరిసింది కొండ కోన


నా కంటి‌ పాపలోనే ఉయ్యాలలూగు దానా

నీ ఒంటి‌ ఒంపుతోనే వియ్యాలనందుకోనా


నా గుండె గూటిలోన కులికేటి వలపు మైనా

నీ కన్న వేరె లేరు నా వారు ఈ జగాన


వ్యథజెంది కుందు మదిలో సుధలూరజేయ రావే

అధరాల వీధిలోన మధుశాలలున్నదాన


నీ బాహుపంజరాన నను నేనె మరిచిపోనా

నీ పొందు విందులంది నీలోన నిండిపోన


తెలుగు గజల్ దార్శనికులు, తొలి‌ తెలుగు గజల్ వాగ్గేయకారులు పి.బి. శ్రీనివాస్ పూనుకోవడం వల్ల ఈ తొలి తెలుగు గజల్ గానం సాకారమయింది. ఉర్దూ భాషపై పట్టు, ఉర్దూ గజల్ గానంపై సరైన అవగాహన ఉన్న పి.బి. శ్రీనివాస్ ఉర్దూ గజళ్ల స్థాయిలో సాంద్రమైన గజల్ గానం‌ చేశారు తెలుగులో. ఉదాత్తమైన గజల్ గానానికి ఉండాల్సిన గాత్ర సాంద్రత, గాన సంస్కారం ఉన్నవారు పి.బి. శ్రీనివాస్. మేలైన గజల్‌ గానానికి‌ అనువైన‌ voice timbre and baritone వారిది. Tenor voices మేలైన గజల్ గానానికి తగినవి కావు. గజల్ గానానికి కావాల్సిన జ్ఞానం, విజ్ఞత ఉన్న పి. బి. శ్రీనివాస్ అరబీ పోహళింపుతో  తెలుగులో‌  గొప్ప గజల్ గానం చేసి మనకు అందించారు.


విశ్వస్థాయి ఉర్దూ గజల్ గానంలా తెలుగులో సాంద్రమైన, ఉదాత్తమైన గజల్ గానానికి ఎప్పటికీ పునాదిగా‌ విలసిల్లే తొలి తెలుగు గజల్ గానం ఇది. "గజల్ లోగిలి" రసజ్ఞలోకానికి  సమర్పిస్తోంది.

రోచిష్మాన్ 

9444012279

[email protected]

Advertisement
Advertisement
Advertisement