కేరళ తొలి రెవెన్యూ మంత్రి గౌరి అమ్మ కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-11T15:47:32+05:30 IST

కేరళ తొలి రెవెన్యూ మంత్రి, జనాధిపత్య సంరక్షణ సమితి (జేఎస్ఎస్) నేత కేఆర్ గౌరి..

కేరళ తొలి రెవెన్యూ మంత్రి గౌరి అమ్మ కన్నుమూత

తిరువనంతపురం: కేరళ తొలి రెవెన్యూ మంత్రి, జనాధిపత్య సంరక్షణ సమితి (జేఎస్ఎస్) నేత కేఆర్ గౌరి అమ్మ మంగళవారంనాడిక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో ఆమె చికిత్స పొందుతూ వచ్చారు. ఆమె వయస్సు 102 సంవత్సరాలు. గౌరి అమ్మ ఇటీవలే జేఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలిగారు. 1994లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పదవిలో గౌరి అమ్మ కొనసాగుతున్నారు.


ఈఎంఎస్ నంబూద్రిపాది నాయకత్వంలోని సీపీఎం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలి రెవెన్యూ మంత్రిగా ఆమె పని చేశారు. 1957లో సంచలనం సృష్టించిన భూసంస్కరణల బిల్లును ఆమె ప్రవేశపెట్టారు. 1957,67,1980,1987లో కూడా కమ్యూనిస్టుల పాలనలో ఆమె  మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో 2001 నుంచి 2006 వరకూ వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 1987లో మహిళా కమిషన్ బిల్లు రూపకల్పనలోనూ ఆమె కీలక భూమిక పోషించారు. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి భయపడే రోజుల్లో ఆమె చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి, సుదీర్ఘ కాలం రాజకీయ సేవలందించారు. అళపుజ జిల్లాలోని చేర్తాలలో జన్మించిన గౌరి అమ్మ... కార్మిక సంఘాల్లో చురుకుగా పాల్గొనే వారు. అనేక సందర్భాల్లో జైలుకు వెళ్లారు. 1952లో ట్రావెన్‌కోర్ కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1954లో మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. జేఎస్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత యునైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్‌లో చేరి ఏకే ఆంటోనీ, ఊమన్ చాందీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత యూడీఎఫ్‌ను విడిచిపెట్టారు.

Updated Date - 2021-05-11T15:47:32+05:30 IST