కార్గిల్‌లో తొలి క్వారంటైన్‌ బర్త్‌

ABN , First Publish Date - 2020-04-02T05:54:28+05:30 IST

దేశంలోనే తొలి క్వారంటైన్‌ బర్త్‌ కేసు కార్గిల్‌లో నమోదైంది. కరోనా నేపథ్యంలో కార్గిల్‌కు చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్‌ చేశారు. ఆ కుటుంబంలోని 30 ఏళ్ల జహ్రా బాను నిండుచూలాలు. ఆమె సోదరుడికి కరోనా

కార్గిల్‌లో తొలి క్వారంటైన్‌ బర్త్‌

దేశంలోనే తొలి క్వారంటైన్‌ బర్త్‌ కేసు కార్గిల్‌లో నమోదైంది. కరోనా నేపథ్యంలో కార్గిల్‌కు చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్‌ చేశారు. ఆ కుటుంబంలోని  30 ఏళ్ల జహ్రా బాను నిండుచూలాలు. ఆమె సోదరుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారి కుటుంబం అంతటిని క్వారంటైన్‌ చేశారు. నొప్పులు రావడంతో జహ్రాను అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు చేర్చారు. మార్చి 28న జహ్రా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇది దేశంలోనే తొలి క్వారంటైన్‌ బర్త్‌ కేసుగా నమోదైంది. బిడ్డ 3.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్‌లో ఉండడంతో ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేయలేదు.


జహ్రా భర్త కూడా క్వారంటైన్‌లో ఉండడంతో తమ బిడ్డను చూసుకోవడానికి రాలేదు. జహ్రా బానూ వెంట కుటుంబ సభ్యులు లేకపోవడంతో హాస్పిటల్‌ సిబ్బందే అన్నీ తామై చూసుకున్నారు. ఆమెకు అండగా నిలిచారు. కష్టకాలంలో తనను కంటికి రెప్పలా చూసుకున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బందికి ఆమె ఽకృతజ్ఞతలు తెలిపారు. ‘మంగళవారంతో జహ్రా క్వారంటైన్‌ గడువు ముగిసి ఇంటికి తిరిగి వెళతారు’ అని డాక్టర్లు చెప్పారు. బిడ్డకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. తొందర్లోనే కుటుంబంతో కలిసి బారసాల వేడుకలు చేసుకునేందుకు జహ్రా ఎదురుచూస్తున్నారు. అయితే ఆమెకు ప్రసవం చేసిన వైద్యురాలు పేరు కూడా జహ్రాబానూ కావడం యాదృచ్ఛికం.

Updated Date - 2020-04-02T05:54:28+05:30 IST