మునుగోడు కమలదళం సిద్ధం

ABN , First Publish Date - 2022-09-23T05:45:40+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌ తమ బలగాలను సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రె్‌సకు సైన్యాన్ని ఇప్పటికే గ్రామాల్లో మొహరించగా, టీఆర్‌ఎస్‌ తన బలగాన్ని దింపేందుకు సరైన ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది.

మునుగోడు కమలదళం సిద్ధం

చైర్మన్‌గా వివేక్‌, కోఆర్డినేటర్‌గా మనోహర్‌తో స్టీరింగ్‌ కమిటీ

ప్రతీ మండలం, గ్రామానికి ముగ్గురు నేతలకు బాధ్యతలు

పాత, కొత్త నేతల కలయికతో 601 మందితో సైన్యం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌ తమ బలగాలను సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రె్‌సకు సైన్యాన్ని ఇప్పటికే గ్రామాల్లో మొహరించగా, టీఆర్‌ఎస్‌ తన బలగాన్ని దింపేందుకు సరైన ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది. కాగా, బీజేపీ కమిటీలు ఇప్పటి వరకు ఏర్పాటుకాలేదు. ఈ నేపథ్యంలో పోరులో వెనకబడకుండా ఉండేందుకు నియోజకవర్గస్థాయిలో స్టీరింగ్‌ కమిటీని, మండలం, గ్రామస్థాయిలో త్రీమెన్‌ కమిటీలను బీజేపీ నియమించింది.

మునుగోడు ఉప పోరులో ఇప్పటి వరకు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయన దూకుడు, బీజేపీ సైద్థాంతిక పనితీరు మధ్య సయోధ్య కుదరక సంస్థాగత కమిటీల ఏర్పాటులో జాప్యం చోటుచేసుకుంది. పాత, కొత్త నాయకుల కలయికలతో ముందుకు వెళ్లాలని పలుమార్లు భేటీలు నిర్వహించారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన విమోచన దినోత్సవానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వరుసగా రాజగోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులతో సమావేశం అనంతరం కమిటీల నియామకంపై కార్యాచరణ ఖరారైంది. కమిటీలు త్వరగా ఏర్పాటుచేయాలని, స్థానికంగా పట్టున్న నేతలకు అవకాశం కల్పించాలని అమిత్‌షా సూచించారు. ఆ మేరకు కసరత్తు పూర్తిచేశారు. మొత్తంగా 601 మందితో వివిధ స్థాయిల్లో కమిటీలు ఖరారయ్యాయి. నియోజకవర్గం మొత్తంగా పర్యవేక్షణకు స్టీరింగ్‌ కమిటీ, ప్రతీ మండలానికి బయటి నుంచి ముగ్గురు కీలక నేతలు, ప్రతీ గ్రామానికి ముగ్గురు అందులో ఇద్దరు స్థానిక నేతలకు అవకాశం కల్పిస్తూ కమిటీలు ఏర్పాటుచేశారు. స్టీరింగ్‌ కమిటీని అధికారికంగా ప్రకటించగా, మరో రెండు రోజుల్లో మిగిలిన కమిటీల బాధ్యుల పేర్లను బీజేపీ నేతలు ప్రకటించనున్నట్లు సమాచారం.

స్టీరింగ్‌ కమిటీ ఖరారు

బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి చైర్మన్‌గా, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌ను కోఆర్డినేటర్‌గా నియమిస్తూ 14 మంది సభ్యులతో మునుగోడు నియోజకవర్గస్థాయిలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, రవీంద్రనాయక్‌, రాపోలు ఆనందభాస్కర్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీ్‌పకుమార్‌, శాసన మండలి మాజీ చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, ఎన్నం శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీ్‌పకుమార్‌, బీసీ జాతీయ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచార్య, డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌కుమార్‌తో స్టీరింగ్‌ కమిటీ ఖరారైంది.

త్రీమెన్‌ కమిటీలు

మునుగోడు నియోజకర్గంలోని ప్రతీ మండలానికి, గ్రామానికి త్రీమెన్‌ కమిటీలను బీజేపీ నేతలు ఖరారు చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎంపీ స్థాయి నేతలతో ముగ్గురు చొప్పున మండల స్థాయిలో త్రీమెన్‌ కమిటీని నియమించాలని నిర్ణయించి ఆ మేరకు జాబితా ఖరారు చేశారు. ప్రతీ గ్రామానికి, మునిసిపల్‌ వార్డుకు సైతం త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఒకరు ఇతర జిల్లాల వారు కాగా, మరొకరు ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, ఇంకొకరు మనుగోడు నియోజకవర్గానికి చెందిన నాయకుడితో త్రీమెన్‌ కమిటీలను ఖరారు చేశారు. ఈ కమిటీల ప్రకటన వారంలోగా చేయనున్నారు. నియోజకవర్గంలో 159 పంచాయతీలు, 30మునిసిపల్‌ వార్డులు ఉన్నాయి. ప్రతీచోట ముగ్గురు చొప్పున 567 మందికి బాధ్యతలు కేటాయించారు. ప్ర తీ మండలానికి ముగ్గురు చొప్పున ఆరు మండలాలకు 18మంది, 16 మందితో స్టీరింగ్‌ కమిటీ మొత్తం 601 మందితో ఎన్నికల టీం సిద్ధమైంది.

పాత, కొత్త నేతలతో

బీజేపీకి చెందిన పాత నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు ఇటీవల పార్టీలో చేరిన కొత్త నాయకులతో మునుగోడు ఉప ఎన్నిక కమిటీలు ఖరారయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్నట్టు ఆయన మిత్రుడు మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామికి అప్పగించారు. పాత టీం నుంచి విద్యార్థి సంఘం నుంచి బీజేపీలో కొనసాగుతూ గతంలో మునుగోడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీచేసిన గంగిడి మనోహర్‌రెడ్డిని కోఆర్డినేటర్‌గా నియమించారు. స్టీరింగ్‌ కమిటీలోనూ కొత్త నాయకుల కోటాలో ఈటల రాజేందర్‌, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, స్వామిగౌడ్‌, చంద్రశేఖర్‌, రవీంద్రనాయక్‌, ఆనంద్‌భాస్కర్‌, దిలీ్‌పకుమార్‌, దాసోజు శ్రవణ్‌కు అవకాశం కల్పించగా, పాత నాయకుల కోటాలో ఎండల లక్ష్మీనారాయణ, దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌, ఎన్నం శ్రీనివా్‌సరెడ్డి, ఆచారికి స్థానం కల్పించారు. స్టీరింగ్‌ కమిటీ పేర్లను అధికారికంగా ప్రకటించగా, గ్రామ, వార్డుస్థాయి త్రీమెన్‌ కమిటీలను ప్రకటించాల్సి ఉంది. అనంతరం పూర్తిస్థాయిలో బీజేపీ సైన్యం మునుగోడులో దిగనుంది.

Updated Date - 2022-09-23T05:45:40+05:30 IST