తొలి దశలో 65 వేల మందికి...

ABN , First Publish Date - 2020-11-28T06:11:05+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా వుండాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్టోరేజీ కేంద్రాలను సిద్ధం చేసే పనులను ప్రారంభించారు.

తొలి దశలో 65 వేల మందికి...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి అధికారుల ఏర్పాట్లు

ఇప్పటికే 60 వేల వైద్య సిబ్బంది వివరాల సేకరణ

వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రాల గుర్తింపు

వాక్‌ ఇన్‌ కూలర్‌ ఏర్పాటు పనులు ప్రారంభం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా వుండాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్టోరేజీ కేంద్రాలను సిద్ధం చేసే పనులను ప్రారంభించారు. జిల్లాకు తొలి దఫా సుమారు 65 వేల మందికి సరిపడా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం వున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా భారీ స్టోరేజీ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రాలుగా జిల్లా ఇమ్యునైజేషన్‌ కార్యాలయం, ప్రభుత్వ మానసిక వైద్యశాల, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోని కొంత ప్రాంతాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా ఇమ్యునైజేషన్‌ కార్యాలయంలో వున్న వైద్య విధాన పరిషత్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. ఈ కేంద్రంలో భారీ వాక్‌ ఇన్‌ కూలర్‌ (ఫ్రీజర్‌)ను ఏర్పాటుచేయనున్నారు.  


మొదటి దశలో 65 వేల మందికి.. 

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే మొదట వైరస్‌పై పోరులో ముందువరుసలో వున్న వైద్య సిబ్బందికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బంది వివ రాలను సిద్ధం చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 237 ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 22,900 మంది, 1,182 ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో పనిచేస్తున్న 36,756 మంది వివరాలను అధికారులు సేకరించారు. మరో ఐదు వేల మంది వివరాలు సేకరించాల్సి వున్నదని చెబుతున్నారు. మొత్తం జిల్లాలో మొదటి విడత వ్యాక్సిన్‌ తీసుకునేవారు సుమారు 65 వేల మంది వుంటారని భావిస్తున్నారు. మొదటి దశలో వ్యాక్సిన్‌ తీసుకునే వారి జాబితాలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారా మెడికల్‌, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, అంబులెన్స్‌ డ్రైవ ర్లు, శానిటరీ సిబ్బంది ఉంటారు. వీరందరి పాన్‌, ఆధార్‌ కార్డు నంబర్లు, ఓటరు ఐడీ వంటి వివరాలను జిల్లా అధికారులు సేకరించారు. జిల్లాకు సంబంధించిన మొత్తం డేటాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.


కేంద్ర స్టోరేజీ నుంచి.. 

65 వేల మందికి అవసరమయ్యే వ్యాక్సిన్‌ ఒకేసారి అందుబాటులోకి వస్తే..దాన్ని స్టోర్‌ చేసేందుకు అవసరమైన భారీ ఫ్రీజర్‌ను కేంద్రం పంపిస్తోంది. ఇక్కడి నుంచి మినీ స్టోరేజీ కేంద్రాలకు పంపించనున్నారు. మినీ స్టోరేజీ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటుచేయాలన్న దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల ఈ మినీ స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. మరో రెండు, మూడు వారాల్లో సిరంజిలు రానున్నట్టు అధికారులు చెబుతున్నారు. 


వలంటీర్లకు కొవిషీల్డ్‌ రెండో డోసు

ఏఎంసీ ఆధ్వర్యంలో 60 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వేగవంతంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 17 సెంటర్లలో 1600 మందిపై ఈ ట్రయల్స్‌ జరుగుతుండగా, ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో 60 మందిపై నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వలంటీర్లకు అక్టోబరు నెలాఖరులో మొదటి డోసు ఇచ్చిన అధికారులు..29 రోజులు పూర్తి కావడంతో తాజాగా రెండో డోసు ఇస్తున్నారు. వలంటీర్లకు మరో మూడుసార్లు అంటే...57వ రోజు, 90వ రోజు, 180వ రోజు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వలంటీర్ల ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణకు 15 మందితో కూడిన వైద్యుల బృందాన్ని మెడికల్‌ కళాశాల అధికారులు నియమించారు.

Updated Date - 2020-11-28T06:11:05+05:30 IST