యూకేలో తొలి ఒమైక్రాన్ మరణం.. పెరుగుతున్న ఆందోళన

ABN , First Publish Date - 2021-12-14T00:39:56+05:30 IST

దక్షిణాఫ్రికాలో పురుడుపోసుకుని ప్రపంచం మొత్తం చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న ఒమైక్రాన్ మరింత

యూకేలో తొలి ఒమైక్రాన్ మరణం.. పెరుగుతున్న ఆందోళన

లండన్: దక్షిణాఫ్రికాలో పురుడుపోసుకుని ప్రపంచం మొత్తం చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న ఒమైక్రాన్ మరింత ఆందోళనకరంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో ఇప్పటికే ఈ వేరియంట్ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండగా మరింత ఆందోళన కలిగించే విషయం ఒకటి తాజాగా వెలుగుచూసింది. దేశంలో తొలి ఒమైక్రాన్ మరణం నమోదైనట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా వెల్లడించారు.


ఒమిక్రాన్ వేరియంట్‌తో ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ప్రజలు బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించారు. పశ్చిమ లండన్‌లోని పాడింగ్టన్‌లో ఉన్న ఓ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన బోరిస్ మాట్లాడుతూ.. ఒమైక్రాన్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒమైక్రాన్ కారణంగా తొలి మరణం కూడా సంభవించినట్టు చెప్పారు.


ఒమైక్రాన్ వేరియంట్‌పై ఏవైనా అపోహలు ఉంటే పక్కన పెట్టాలని అన్నారు. ఒమైక్రాన్ ఏం చేస్తుందిలే.. అదో చిన్న వేరియంట్ అని, స్వల్ప లక్షణాలే ఉంటాయని తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ఈ నెలాఖరు నాటికి దేశప్రజలందరికీ బూస్టర్ డోసు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.


మరోవైపు, ఒమైక్రాన్ భయంతో నేడు ఏకంగా లక్షమంది బూస్టర్ డోసును బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఎన్‌హెచ్ఎస్ వెబ్‌సైట్ క్రాష్ అయినట్టు ప్రభుత్వం తెలిపింది. టెస్టులు చేయించుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. వాక్-ఇన్ కేంద్రాల వద్ద కొండవీటి చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2021-12-14T00:39:56+05:30 IST