బైడెన్ పాలనలో చైనాతో తొలి సైనిక స్థాయి చర్చలు

ABN , First Publish Date - 2021-08-28T23:53:40+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై చైనా-అమెరికా సైన్యం చర్చించింది

బైడెన్ పాలనలో చైనాతో తొలి సైనిక స్థాయి చర్చలు

బీజింగ్ : ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై చైనా-అమెరికా సైన్యం చర్చించింది. జో బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి మిలిటరీ లెవెల్ చర్చలు ఇవేనని శనివారం చైనా మీడియా తెలిపింది. అంతర్జాతీయ సైనిక సహకారం కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫీస్‌ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ హువాంగ్ క్వెపింగ్, అమెరికా సైనికాధికారి మైఖేల్ ఛేస్‌ గత వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపినట్లు తెలిపింది. 


చైనా సైనికాధికారి ఒకరు ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం సత్వరమే చర్చించవలసిన అంశమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ ఏడాది అలాస్కాలో జరిగిన చర్చల్లో అమెరికా  సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌కు చెప్పారని తెలిపారు. ఈ సలహాను ఆయన పట్టించుకోలేదన్నారు. బీజింగ్‌లోని అమెరికన్ ఎంబసీతో చైనా మిలిటరీకి మిడిల్ లెవెల్ మిలిటరీ-టు-మిలిటరీ కమ్యూనికేషన్ ఛానల్ ఉందని, గత వారం సీనియర్ అధికారుల మధ్య చర్చలు పునఃప్రారంభమయ్యాయని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ రిస్క్ అసెస్‌మెంట్ గురించి చైనా, అమెరికా చర్చలు ప్రారంభించి ఉంటే, ఇరు దేశాలకు ఇంత తీవ్ర నష్టం జరిగి ఉండేది కాదన్నారు. దాదాపు అందరు చైనీయులను మూడు నెలల క్రితమే ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించినట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఈస్ట్ టర్కిస్థాన్ ఇస్లామిక్ మువ్‌మెంట్ సహా తీవ్రవాద శక్తులు బలోపేతమవుతాయని చైనా ఆందోళన చెందుతోందని తెలిపారు. ఇటువంటి శక్తులు బలపడకుండా చైనా, అమెరికా, ఇతర దేశాలు కలిసికట్టుగా పని చేయవలసి ఉందన్నారు. 


జో బైడెన్ దేశాధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి మార్చిలో అలాస్కాలో చైనా-అమెరికా మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. వాంగ్ యీ, చైనా ఉన్నత స్థాయి దౌత్యవేత్త యాంగ్ జియెచి, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ జేక్ సులివన్ పరస్పరం విమర్శించుకున్నారు. 


Updated Date - 2021-08-28T23:53:40+05:30 IST