మారువేషంలో వెళ్లి శంకుస్థాపన.. మేయర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..

ABN , First Publish Date - 2020-11-22T17:47:15+05:30 IST

నగరానికి మేయర్‌ మొదటి పౌరుడిగా ప్రొటోకాల్‌ పాటించడం ఆనవాయితీ. అలాంటి గౌరవ హోదాలో ఉండే మేయర్‌నూ ఒక సందర్భంలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చరిత్రలో అరెస్టు అయిన తొలి మేయర్‌గా చరిత్రకెక్కారు ఎన్‌. లక్ష్మీనారాయణ ముదిరాజ్‌.

మారువేషంలో వెళ్లి శంకుస్థాపన.. మేయర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..

హైదరాబాద్‌ : నగరానికి మేయర్‌ మొదటి పౌరుడిగా ప్రొటోకాల్‌ పాటించడం ఆనవాయితీ.  అలాంటి గౌరవ హోదాలో ఉండే మేయర్‌నూ ఒక సందర్భంలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చరిత్రలో అరెస్టు అయిన తొలి మేయర్‌గా చరిత్రకెక్కారు ఎన్‌. లక్ష్మీనారాయణ ముదిరాజ్‌. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల స్మారకంగా గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం నెలకొల్పాలని ఆనాటి ఉద్యమకారులు నిర్ణయించారు. 1970, ఫిబ్రవరి 23న గన్‌పార్కులో స్తూపం శంకుస్థాపన తలపెట్టారు. కార్యక్రమానికి స్థానిక పోలీసుల అనుమతి ఉన్నా, అప్పటి ప్రభుత్వం వ్యతిరేకించింది. శంకుస్థాపన ఆపేయాలని హుకుం జారీచేసింది.  దీంతో గన్‌పార్కు చుట్టూ వందల మంది పోలీసులు మోహరించారు.  ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేసిమరీ అమరవీరుల స్తూపానికి పునాదిరాయి వేశారు లక్ష్మీనారాయణముదిరాజ్‌. ఆయనతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న వారినీ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకి తరలించారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నగరమంతా నిరసనలు మిన్నంటాయి. తర్వాత లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ కాంగ్రె్‌సకు రాజీనామా చేసి, తెలంగాణ ప్రజా సమితి పార్టీలో చేరారు. 1972లో మహారాణిగంజ్‌ (ఇప్పటి గోషామహల్‌)నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. బీసీ కమిషన్‌ సభ్యుడిగానూ సేవలందించారు. అనారోగ్యంతో 2015లో కన్నుమూశారు.


డిప్యూటీ మేయర్‌నూ...

ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పోలీసుల కాల్పులకు బలైన విద్యార్థుల స్మారకంగా సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ ప్రాంతంలోనూ మరో స్తూపం నిర్మించతలపెట్టారు. ఫిబ్రవరి 25న డిప్యూటీ మేయర్‌ మ్యేడం రామచంద్రరావు చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. అప్పుడూ డిప్యూటీ మేయర్‌నూ అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ప్రజా నిరసన వెల్లువెత్తడంతో మూడు రోజుల తర్వాత వారందరినీ విడుదల చేశారు.


ఎమ్మెల్యే అయినా.. మేయర్‌గానే..

మా నాన్న మారువేషంలో వెళ్లి తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. ఆనాటి డిప్యూటీ మేయర్‌ మ్యేడం రామచంద్రరావునూ పోలీసులు అరెస్టు చేశారు. చుడీబజార్‌ నుంచి మొదట కౌన్సిలర్‌గా గెలిచినా, ఎమ్మెల్యేగా ఎన్నికైనా,  ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం గోడెకీ కబర్‌ నయి బస్తీలోనే నివసించేవారు. మేము ఇప్పటికీ అక్కడే ఉంటున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, నాన్నను జనమంతా ‘మేయర్‌ సాబ్‌’ అనే పిలిచేవారు. అంతగా నగర ప్రజలతో ఆయన మమేకమయ్యారు. లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ కొడుకుగా గర్వపడుతున్నా. ఇప్పటి పాలకులకూ ఆ స్వతంత్రం, తెగువ అవసరం.

- వినయ్‌ ముదిరాజ్‌, లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ కుమారుడు

Updated Date - 2020-11-22T17:47:15+05:30 IST