పొద్దుపోతోంది.. ఇళ్లకు వెళ్లండి: మెలానియా ట్రంప్ విన్నపం

ABN , First Publish Date - 2020-06-03T18:42:00+05:30 IST

నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ హత్య పట్ల చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారిన నేపథ్యంలో..

పొద్దుపోతోంది.. ఇళ్లకు వెళ్లండి: మెలానియా ట్రంప్ విన్నపం

వాషింగ్టన్: నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ హత్య పట్ల చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారిన నేపథ్యంలో.. ఆందోళనకారులు శాంతించాలంటూ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అభ్యర్థించారు. కర్ఫ్యూకు లోబడి వీధులు ఖాళీ చేయాలనీ.. ఇళ్లలోనే ఉంటూ తమ ఆప్తుల కోసం సమయం కేటాయించాలని ఆమె కోరారు. ‘‘రాత్రి వేళ అవుతున్నందున దయచేసి పౌరులంతా కర్ఫ్యూకు విధేయత చూపి వీధులు ఖాళీ చేయాలని కోరుతున్నాను. ఇళ్లలోనే ఉండి మీ ఆప్తులతో సమయం గడపండి.. అన్ని నగరాలు, కమ్యునిటీలు, పౌరులు సురక్షితంగా ఉండాలి. అందరూ శాంతి, సమాధానాల కోసం కలిసికట్టుగా పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుంది...’’ అని మెలానియా ట్వీట్ చేశారు.


కాగా నిన్న ఆమె ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘మన దేశం, మన కమ్యునిటీలు ధ్వంసానికి గురికావడం తీవ్రంగా బాధించింది...’’ అని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సాటి పౌరుల సంక్షేమం కోసం పనిచేయాలనీ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అయితే నిరసనల సందర్భంగా హింసకు దిగరాదని ఆమె కోరారు. పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2020-06-03T18:42:00+05:30 IST