ఓవర్సీస్ సినిమా: ధర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మాసీవ్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం.. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో ఎంతోకాలంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. శుక్రవారం వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇక ఓవర్సీస్లో కూడా ఆర్ఆర్ఆర్ను భారీగానే విడుదల చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగా అమెరికాలో అయితే ఇంతకుముందు ఏ భారతీయ చిత్రం విడుదల కాని విధంగా అత్యధిక లొకేషన్స్‌లో ప్రదర్శితం కానుంది. అక్కడ ఈ సినిమాను విడుదల చేస్తున్న సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ దేశ వ్యాప్తంగా 1150కు పైగా లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.
ఇవాళ(గురువారం) ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. అయితే, అమెరికాలో ఆర్ఆర్ఆర్ అప్పుడే రికార్డుల వేట మొదలెట్టింది. ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా ఈ మూవీ ఏకంగా 2.5 మిలియన్ డాలర్లుకు(సుమారు రూ.18కోట్లు) పైగా రాబట్టిందని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించాయి. దీంతో 'బహుబలి-2' (2.4 మిలియన్ డాలర్లు) రికార్డును దాటేసింది. అలాగే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. యూఎస్‌లో సినీమార్క్ అనే సింగిల్ చైన్ ద్వారానే ప్రీమియర్ ప్రీ సేల్స్‌తో ఏకంగా 1మిలియన్ డాలర్లకు(సుమారు రూ.7.50కోట్లు) పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో ఇంతకుముందు 'బహుబలి-2' (రూ.7.25కోట్లు) రికార్డు బద్దలైంది. ఇలా ప్రీమియర్స్‌తోనే అగ్రరాజ్యంలో ప్రభంజనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ ఇంకెన్నీ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి