తొలి తరం దళిత ఐఏఎస్‌ రామలక్ష్మణ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-02-25T08:36:14+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి తరం దళిత ఐఏఎస్‌ అనుములపురి రామలక్ష్మణ్‌(76) బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.

తొలి తరం దళిత ఐఏఎస్‌ రామలక్ష్మణ్‌ కన్నుమూత

హైదరాబాద్‌, నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి తరం దళిత ఐఏఎస్‌ అనుములపురి రామలక్ష్మణ్‌(76) బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా నల్లగొండ మండల పరిధిలోని చిన్నసూరారం గ్రామానికి చెందిన రామలక్ష్మణ్‌ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదివిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి తరం దళిత ఐఏఎ్‌స(1976)గా ఎంపికయ్యారు. వివిధ రాష్ట్రాల్లో కలెక్టర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ అనంతరం తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ రామలక్ష్మణ్‌కు ప్రభుత్వ సలహాదారు (సంక్షేమం) బాధ్యతలు అప్పగించగా నాలుగేళ్లపాటు సమర్థంగా నిర్వర్తించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న రామలక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండగా, పెద్ద కుమారుడు హర్యానాలో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఏఎ్‌సగా రాణించి గ్రామానికి వన్నె తెచ్చిన రామలక్ష్మణ్‌ మృతితో చిన్నసూరారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామలక్ష్మణ్‌ అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 


సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం

రామలక్ష్మణ్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఐఏఎస్‌ అధికారిగా, ప్రభుత్వ సలహాదారుగా రామ లక్ష్మణ్‌ అనేక సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, ఆర్ధిక మంత్రి టీ.హరీశ్‌ రావులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-02-25T08:36:14+05:30 IST