Tenth Exams : తొలి రోజు ఉరుకులు.. పరుగులు.. ఆందోళనకు గురైన విద్యార్థులు

ABN , First Publish Date - 2022-05-24T15:11:33+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి

Tenth Exams : తొలి రోజు ఉరుకులు.. పరుగులు.. ఆందోళనకు గురైన విద్యార్థులు

  • రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు
  • మొదటి రోజు 1,635 మంది గైర్హాజరు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి తొలి రోజు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉరుకులు.. పరుగులు పెట్టారు. రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. కొందరు నిర్ణీత సమయాని కంటే రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా కేంద్రాలకు వచ్చారు. బోర్డుపై హాల్‌టికెట్‌ నంబర్లను చూసుకుని హడావిడిగా తమకు కేటాయించిన గదులకు పరుగులు తీశారు. మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టడంలో భాగంగా కొన్ని చోట్ల సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించారు. గతంలో 8, 9 పరీక్షలు రాయకుండా పై తరగతికి వెళ్లిన విద్యార్థుల్లో కొందరు టెన్త్‌ ఎగ్జామ్స్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొదటి రోజు 1,635 మంది గైర్హాజరైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని రెడ్‌క్రాస్‌ బాలికోన్నత పాఠశాల, ఏసీ గార్డులోని మౌలానా ఆజాద్‌ హైస్కూల్‌, విజయ్‌ మేరీ స్కూల్‌ను జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ సందర్శించారు.


పరీక్ష రాసిన 20 మంది దివ్యాంగులు

హయత్‌నగర్‌ కేంద్రంలో 20 మంది దివ్యాంగులు పరీక్ష రాశారు. వారిలో 12 మందికి అధికారులు సహాయకులను ఏర్పాటు చేశారు.


విద్యార్థినికి అస్వస్థత

మణికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షకు హాజరైన ఓ బాలిక అస్వస్థతకు గురైంది. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే శ్వాస సరిగా ఆడక ఇబ్బందులను ఎదుర్కొంది. అధికారులు ఆమె తల్లిదండ్రులను పిలిపించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని, మంగళవారం పరీక్షకు హాజరు అవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులను పాఠశాల కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని ప్రధానోపాధ్యాయుడు నిరంజన్‌ తెలిపారు.

Updated Date - 2022-05-24T15:11:33+05:30 IST