కరోనా పాజిటివ్‌తో గుంటూరులో వణుకు

ABN , First Publish Date - 2020-03-27T09:24:52+05:30 IST

గుంటూరులో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదుతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఉలికిపాటుకు గురయ్యారు.

కరోనా పాజిటివ్‌తో గుంటూరులో వణుకు

బాధితుడ్ని విజయవాడ తరలింపు

ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారికి వైద్య పరీక్షలు

తాడికొండలోని మిత్రులను కూడా ఆసుపత్రికి తరలింపు

గుంటూరు నగరంలో వైద్యుల సంరక్షణలో మరో 9 మంది 


గుంటూరు(సంగడిగుంట)/గుంటూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదుతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఉలికిపాటుకు గురయ్యారు. బాధితుడిని గుంటూరు నుంచి విజయవాడకు తరలించినప్పటికీ అతడితో నాలుగైదు రోజులుగా సన్నిహితంగా మెలిగిన వారు వణికిపోతున్నారు. అయితే వారికై వారు చికిత్సకు ముందుకు రావడంలేదు. అధికారులు వారిని వెతుక్కుంటూ వారి ఇళ్ళకు వెళ్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి అతడితో పాటు రైల్లోనూ, ఆ తరువాత ఆటోలోనూ ప్రయాణించిన 9 మందిని గుర్తించిన అధికారులు వారిని గుర్తించి వైద్యులకు అప్పగించారు.   వారికి గుంటూరు జనరల్‌ హాస్పిటల్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్సలు చేస్తున్నారు. బాధితుడు ఈ నెల 21న గుంటూరు నుంచి తాడికొండకు వెళ్లి అక్కడ నిర్వహించిన సమావేశానికి సుమారు 40 మంది హాజరైనట్లు తెలుసుకుని వారిలో కొందరిని గుర్తించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. మిగతా వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. 


ఢిల్లీ వెళ్ళిన వారిలో పల్నాడు ప్రముఖులు కూడా

కరోనా వ్యాధి సోకిన బాధితుడితో పాటు ఢిల్లీలో గడిపి తిరిగి జిల్లాకు చేరుకున్న వారిలో గుంటూరు నగరవాసులే కాకుండా పల్నాడు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెనాలి ప్రాంతానికి చెందిన ఒకరు, మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన ఒకరు, మాచర్లకు చెందిన వారు 8 మంది, పిడుగురాళ్ళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. వీరి కోసం కూడా అధికారులు గాలిస్తున్నారు. 


ఆందోళనలో వైద్య వర్గాలు

కరోనా బాధితుడికి ఎవరి ద్వారా వైరస్‌ సోకిందనేది ఎవరికీ అర్థం కావడంలేదు. ఢిల్లీలో జరిగిన పెద్ద సమావేశంలో అనేక రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి వేల సంఖ్యలోనే హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిపై వైద్య వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. బాధితుడు ప్రజా ప్రతినిధికి బంధువు కావడం, ఎక్కువ మందితో కలిసే అవకాశం ఉండటంతో ఎవరెవరు కలిశారా అని  ఆరాలు తీస్తున్నారు. బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని ప్రత్యేక జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఢిల్లీ నుంచి చేసిన ప్రయాణంలో అతడితో గడిపిన వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. గురువారం వద్ద వారి వద్ద శాంపిల్స్‌ సేకరించి తిరుపతి పంపారు. శుక్రవారం సాయంత్రానికి ఈ ఫలితాలు రానున్నాయి. ఐసోలేషన్‌ వార్డులో ప్రత్యేకంగా వ్యాధి నిర్థారణ అయిన వారికి శాస్ర్తీయతతో కూడిన చికిత్స అందించే ఏర్పాట్లు లేవని గురువారం వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.     


బాధ్యతగా పరీక్షల కోసం రావాలని వినతి

కరోనా బాధితుడితో పాటు ప్రయాణించిన వారితో పాటు, గుంటూరులో అతడితో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా వచ్చి చికిత్సలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అతడితో కలిసిన వారిని గుర్తించి, పరీక్షలకు తరలించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఎవరికి వారుగా బాధ్యతగా ముందుకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొందరిని  ఎంతో కష్టంగా పట్టుకుని ఆసుపత్రులకు తరలించగలిగామన్నారు.  వీలైనంత త్వరగా ఎవరికివారే ఆసుపత్రులకు వచ్చి వ్యాధి నిర్ధారణ చేయించుకుంటే చికిత్సలు చేసి కాపాడడం సులువు అవుతుందని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-03-27T09:24:52+05:30 IST