3 కిమీ వరకు.. నివారణ చర్యలు

ABN , First Publish Date - 2020-03-27T09:25:40+05:30 IST

గుంటూరు మంగళదాస్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుతో నగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది.

3 కిమీ వరకు.. నివారణ చర్యలు

మంగళదాస్‌నగర్‌లో వైరస్‌ కట్టడికి ప్రత్యేక పారిశుధ్యం

పాజిటివ్‌ బాధితుడి ఇంటి పరిసర మార్గాల మూత

10 ప్రధాన, 181 అంతర్గత రోడ్లపైకి ప్రజలు రాకుండా కట్టడి

1వ వార్డు సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

38 కాలనీల్లో 58 వేల 843 గృహాలు, 4,846 దుకాణాలపై హైపో క్లోరైడ్‌ పిచికారి


గుంటూరు(కార్పొరేషన్‌), మార్చి 26: గుంటూరు మంగళదాస్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుతో నగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలోని వ్యక్తికి పాజిటివ్‌గా జిల్లా వైద్య రోగ్య శాఖ ధ్రువీకరించడంతో ఆ ప్రాంతానికి మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులకు నగర పాలక సంస్థ రంగంలోకి దిగింది. ఈ ప్రాంతమంతా వైరస్‌ నివారణ చర్యలు చేపట్టారు. కేసు నిర్థారణ జరిగిన ప్రాంతానికి మూడు కిలో మీటర్ల పరిధిలో 38 కాలనీలు ఉండగా వాటిని 1650 క్లస్టర్‌గా విభజన చేసి ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నారు. బాధిత వ్యక్తి ఇంటి పరిసరాల్లో కమిషనర్‌ చల్లా అనురాధ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి గురువారం పర్యటించి అధికార్లకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వైరస్‌ పాజిటివ్‌ కేసుతో ఎమర్జెన్సీ బృందాన్ని సమన్వయం చేసుకుని మున్సిపల్‌ ఎమర్జెన్సీ బృందం  వేగంగా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


ఈ ప్రాంతంలోని 1వ వార్డు సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి క్లస్టర్‌ ప్లాన్‌ రూపొందించామన్నారు. ఈ ప్రాంతంలో 58,843 గృహాలు, 4846 దుకాణ, వ్యాపార సంస్థలను గుర్తించి డోర్‌ టూ డోర్‌ సోడియం హైపో క్లోరైడ్‌, బ్లీచింగ్‌ ద్రావణాన్ని రెండు ఫైర్‌ ఇంజన్లు, ఆరు ట్యాంకర్ల ద్వారా పిచికారి చేయిస్తున్నామన్నారు. 700 మంది పారిశుధ్య, 150 మంది మలేరియా విభాగ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉన్న 10 ప్రధాన రహదారులను, 181 అంతర్గత రోడ్లను గుర్తించి మూసేశామన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు బయటకు రాకుండా ప్రచారం చేస్తున్నామన్నారు. ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం సమస్యలతో బాధపడుతుంటే తక్షణం ప్రభుత్వ వైద్యశాలకు, లేదా నగరపాలక సంస్థ కంట్రోల్‌ రూమ్‌ 0863 - 2345103, 2345104లో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జేడీ డాక్టర్‌ హైమావతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, జీఎంసీ డిప్యూటీ కమిషనర్లు డీ శ్రీనివాసరావు, బీ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్‌ సునీత, ఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీదేవి, బయాలజిస్ట్‌ ఓబులు  పాల్గొన్నారు. 


ఇళ్లల్లో క్రిమి సంహారక రసాయనాలు వాడుకోవాలి

ప్రజలు తమ ఇళ్లల్లో తరుచుగా తాకే వస్తువులను క్రిమి సంహారక రసాయనాలు వాడుకోవాలని కమిషనర్‌ తెలిపారు.  ప్రజారోగ్య విభాగం సిబ్బంది గృహాల గేట్ల వద్ద, జన సమూహాలు, పార్కులు రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్ల వద్ద పిచికారి చేస్తున్నారన్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని ప్రతి గృహంలోనికి వచ్చి స్ర్పే చేయడం కష్ట సాధ్యమన్నారు. అందువల్ల గృహస్థులే తరచుగా తాకే వస్తువలపై సోడియం హైపోక్లోరైట్‌, బ్లీచింగ్‌ ద్రావకంతో శుభ్రం చేసుకోవాలన్నారు.  

Updated Date - 2020-03-27T09:25:40+05:30 IST