Abn logo
Apr 10 2020 @ 11:41AM

గుంటూరు జిల్లాలో తొలి మరణం.. అతడికి కరోనా ఎలా వచ్చిందో తేల్చలేకపోతున్నారు..!

నరసరావుపేటలో కలకలం

రెడ్‌జోన్లుగా వరవకట్ట, రామిరెడ్డిపేట 

క్వారంటైన్‌కు మృతుడి కుటుంబ సభ్యులు సహా 21 మంది 

పొన్నూరులో మరో పాజిటివ్‌ కేసు.. 

ఆస్పత్రి మూత.. 50 మంది క్వారంటైన్‌


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌): వైరస్‌తో వణికిస్తున్న కరోనా ఏకంగా ఒకరిని బలి తీసుకుంది. అయితే ఇంతవరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాని నరసరావుపేటలో ఈ ఘటన వెలుగు చూడటంతో జిల్లావాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి వైరస్‌ ఎలా వచ్చిందో ఎవరికీ అంతుబట్టడంలేదు. కేబుల్‌ కలెక్షన్‌ బాయ్‌గా పని చేసే ఇతడు ఈ నెల 6న నరసరావుపేట ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం రాగా అక్కడి నుంచి గుంటూరు తరలించారు. క్షయ వ్యాధితో ఉన్న ఇతడిలో కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ నివేదిక రాకుండానే బుధవారం రాత్రి మరణించాడు. కరోనాతో సదరు వ్యక్తి మృతి చెందినట్టు జిల్లా వైద్యాధికారులు గురువారం ప్రకటించారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇతడికి కేబుల్‌ నగదు వసూలు చేసే క్రమంలో స్థానికుల ద్వారా వైరస్‌ వచ్చి ఉండవచ్చని అధికారులు భావి స్తున్నారు. 


అయితే మరణించిన వ్యక్తికి ఇప్పటికే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండటంతో వైరస్‌ వేగంగా బయటపడి మృతికి దారి తీసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో  నరసరావుపేటలో మరికొన్ని కేసులు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. కరోనా మరణంతో  యంత్రాంగం అప్రమత్తమైంది. నరసరావుపేటలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన అధికారులు లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినతరం చేశారు. వరవ కట్ట, రామిరెడ్డిపేట ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి దిగ్భందం చేశారు. ఆ వ్యక్తి  కుటుంబ సభ్యులతో పాటు అతడితో కలిసి తిరిగిన 21 మందిని గుర్తించి గుంటూరులోని క్వారంటైన్‌కు   తరలించారు. వీరందరి కి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రామిరెడ్డిపేట, వరవకట్ట ప్రాం తంలో నాలుగు వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఆరోగ్య సర్వే చేపట్టారు.  మృతుడికి నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేసిన ఇద్దరు వైద్యులను హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. పట్టణంలోనే తొలి కరోనా మృతి దురదృష్టకమని ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో  ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని కోరారు. తొలి కరోనా మృతితో గురువారం డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, అర్డీవో వెంకటే శ్యర్లు, డీఎస్పీ వీరారెడ్డి,  కమిషనర్‌ శివారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రోహిణీ సమీక్షించారు. నరసరావుపేటలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి బంధువులైన పెదకాకాని మండల పరిధి లోని వెనిగండ్లకు చెందిన 8 మందిని క్వారంటైన్‌కు తరలించారు.  


పొన్నూరులో ఇంట్లో ఉండే వృద్ధుడికి..

పొన్నూరులో గురువారం సాయంత్రం ఓ పాజిటివ్‌ కేసును గుర్తిం చారు. పొన్నూరుకు చెందిన మాజీ సైనికుడైన 70 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ అని తేలింది. బీపీ, షుగర్‌ రోగి అయిన ఇతడు 6న స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు తరలించారు. గుం టూరు జనరల్‌ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం పాజిటివ్‌గా నిర్ధారిం చి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఇతడి కుటుంబీకులు గుంటూరు వచ్చి వెళ్ళినట్లు, తద్వారా వైరస్‌ వ్యాపించినట్లు అను మానిస్తున్నారు. ఇతడి కుటుంబ సభ్యులు, ఇతడితో పరిచయం ఉన్న 50 మందిని క్వారం టైన్‌కు తరలించారు. తహసీల్దారు పద్మనాభుడు, మున్సిపల్‌ కమిషనరు పాయసం వెంకటేశ్వరావు, అర్బన్‌ సీఐ ప్రేమయ్య, వైద్యఆరోగ్య బృందం ఇతడి నివాస ప్రాంతంలో చేపట్టిన చర్యలను పరిశీలించారు.  పొన్నూరు లో మూడు కిలోమీటర్లు  మేర రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రూరల్‌ ఎస్పీ విజయరావు, బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పొన్నూరును సందర్శించి పోలీసులకు పలు సూచనలు చేశారు. వైరస్‌ బాధితుడికి మొదట చికిత్స చేసిన పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని  మూయించి, వైద్యుడితోపాటు ఆయన సతీమణి, సిబ్బందిని క్వారంటైన్‌కు  పంపించామని ఎస్పీ తెలిపారు. సత్తెనపల్లి పెద్దమసీదులో ఉన్న కజికిస్థాన్‌కు చెందిన వారికి ఆరోగ్య సిబ్బంది గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు.  

Advertisement
Advertisement
Advertisement